చిన్న ఆర్టిస్టులను కూడా బతికించండి
ABN , First Publish Date - 2023-06-04T02:23:19+05:30 IST
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి హైదరాబాద్‌లో ఎన్టీఆర్ మెమోరియల్ అవార్డ్స్ వేడుకని ఘనంగా నిర్వహించారు. చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, శివకృష్ణ, ప్రభ, రోజారమణి, కవిత, బాబూమోహన్, తనికెళ్ల భరణి...

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి హైదరాబాద్‌లో ఎన్టీఆర్ మెమోరియల్ అవార్డ్స్ వేడుకని ఘనంగా నిర్వహించారు. చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, శివకృష్ణ, ప్రభ, రోజారమణి, కవిత, బాబూమోహన్, తనికెళ్ల భరణి, నిర్మాత కైకాల నాగేశ్వరరావు, రచయిత బుర్రా సాయిమాధవ్, కొమ్మినేని వెంకటేశ్వరరావు తదితరుల్ని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు గారపాటి లోకేశ్వరి, నందమూరి మోహనకృష్ణ, చైతన్యకృష్ణ, యశ్వంత్, అంబికా కృష్ణ, తుమ్మల ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో చంద్రమోహన్, బాబూమోహన్ తదితరులు ఎన్టీఆర్‌తో తమకున్న అనుబంధాన్ని వివరించారు. కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘ఇవాళ సినిమా అనేది లేదు. అంతా సర్కస్. విషాదకర పాటకు కూడా డాన్సులు చేస్తున్నారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్‌బాబు.. తాము తీసుకున్న పారితోషికం గురించి బహిరంగంగా మాట్లాడేవారు కాదు. కానీ ఇప్పటి హీరోలు రోజుకి ఇన్ని కోట్లు తీసుకుంటున్నామని పబ్లిక్‌గా చెబుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు.’ అన్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ గురించి మాట్లాడుతూ ‘ప్రస్తుతం చిన్న ఆర్టిస్టుల బతుకు దుర్భరంగా ఉంది. ఏదన్నా ప్రకటనల్లో నటిద్దాం అంటే బాత్ రూమ్ క్లీన్ చేసే బ్రష్ నుంచి బంగారం ప్రకటనల వరకూ అన్నీ స్టార్ హీరోలే చేస్తున్నారు. ఇక చిన్న ఆర్టిస్టులకు పని ఎక్కడ ఉంటుంది? ‘మా’ సభ్యులు, తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రభుత్వాలు ఏదన్నా ఆలోచన చేసి ఆర్టిస్టులను బతికించండి’ అని కోరారు కోట.