రజనీ జోస్యం.. బిగ్‌ బి భయం

ABN , First Publish Date - 2023-11-18T01:01:12+05:30 IST

ఆదివారం వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగబోతోంది. ఈ నేపథ్యంలో దేశమంతా క్రికెట్‌ ఫీవర్‌ పాకేసింది.

రజనీ జోస్యం.. బిగ్‌ బి భయం

టాప్‌ స్టార్లకు వరల్డ్‌ కప్‌ ఫీవర్‌

ఆదివారం వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగబోతోంది. ఈ నేపథ్యంలో దేశమంతా క్రికెట్‌ ఫీవర్‌ పాకేసింది. మన జట్టే గెలవాలని అందరూ ముక్త కంఠంతో కోరుకొంటున్నారు. ప్రార్థనలు చేస్తున్నారు. సినీ స్టార్లు కూడా ఇందుకు అతీతులు కారు. ‘ఈసారి కప్పు మనదే..’ అని సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ జోస్యం చెప్పారు. ఆయనకు క్రికెట్‌ అంటే మక్కువే. ముంబైలో న్యూజీలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌ ఆయన ప్రత్యక్షంగా వీక్షించారు. మన జట్టు బాగా ఆడిందని, అయితే న్యూజీలాండ్‌ గెలుస్తుందేమో అనే భయం కొంతసేపు వెంటాడిందని, క్రమం తప్పకుండా వికెట్లు పడడంతో ఊపిరి పీల్చుకొన్నానని రజనీకాంత్‌ వ్యాఖ్యానించారు. 50 సెంచరీలు సాధించిన కోహ్లీని, వికెట్ల పండగ చేసుకొంటున్న షమీనీ ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

మరోవైపు అమితాబ్‌బచ్చన్‌ కూడా క్రికెట్‌ ఫీవర్‌తో ఊగిపోతున్నారు. కాకపోతే ఆయనకో సెంటిమెంట్‌ ఉందట. ఆయన మ్యాచ్‌ చూడకపోతే ఆరోజు భారత్‌ కచ్చితంగా గెలుస్తుందట. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. దాంతో అభిమానులు ‘మీరు మ్యాచ్‌ చూడొద్దు. కనీసం ఇంట్లో టీవీ కూడా ఆన్‌ చేయొద్దు’ అంటూ సోషల్‌ మీడియా ద్వారా స్వీట్‌ వార్నింగ్‌ ఇస్తున్నారు. ఇంట్లోంచి బయటకు రాకుండా మేం కాపలా కాస్తామంటూ కొంతమంది అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. దాంతో బిగ్‌ బీ నిజంగానే భయపడిపోతున్నారు. ‘మ్యాచ్‌ చూడాలా? వద్దా? అనే విషయాన్ని ఇప్పుడు నేను మరింత సీరియ్‌సగా ఆలోచించాల్సిందే’ అని కామెంట్‌ చేశారు అమితాబ్‌. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతున్నాయి.

Updated Date - 2023-11-18T01:01:13+05:30 IST