థియేటర్ల నుంచి చిరునవ్వుల్ని తీసుకెళ్తారు

ABN , First Publish Date - 2023-01-27T04:53:16+05:30 IST

చిన్న చిన్న పాత్రలతో ప్రయాణం ప్రారంభించి... ఇప్పుడు హీరో అయిపోయాడు సుహాస్‌. ‘కలర్‌ ఫొటో’ తనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది...

థియేటర్ల నుంచి చిరునవ్వుల్ని తీసుకెళ్తారు

చిన్న చిన్న పాత్రలతో ప్రయాణం ప్రారంభించి... ఇప్పుడు హీరో అయిపోయాడు సుహాస్‌. ‘కలర్‌ ఫొటో’ తనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇప్పుడు ‘రైటర్‌ పద్మభూషణ్‌’గా అవతారం ఎత్తాడు. షణ్ముఖ ప్రశాంత్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఫిబ్రవరి 3న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సుహాస్‌ చెప్పిన కబుర్లు ఇవీ...

  • ‘కలర్‌ ఫొటో చిత్రానికి ప్రశాంత్‌ సహాయకుడిగా పనిచేశాడు. ఆ సమయంలో ఈ కథ చెప్పాడు. నాకు చాలా బాగా నచ్చింది. నేనే నిర్మాతల దగ్గరకు తీసుకెళ్లా. నాకెంత నచ్చిందో.. వాళ్లకూ అంతే నచ్చింది. వెంటనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించారు’’.

  • ‘‘వినోదంతో పాటుగా మంచి ట్విస్టులున్న సినిమా ఇది. తొలి సగంలో మూడు, ద్వితీయార్థంలో రెండు ట్విస్టులు వస్తాయి. పతాక సన్నివేశాల ముందొచ్చే మలుపు ఎవరూ ఊహించలేరు. సరదా సరదాగా సాగిపోతూనే థియేటర్లో టెన్షన్‌ తీసుకొచ్చే సినిమా ఇది. సినిమా చూస్తున్నంతసేపూ పెదాలపై ఓ చిరునవ్వు ఉంటుంది. థియేటర్‌ నుంచి ఇంటికి కొన్ని చిరునవ్వుల్ని తీసుకెళ్తారన్న నమ్మకం ఉంది’’.

  • ‘‘ఆశిష్‌ విద్యార్థి, రోహిణి లాంటి మంచి నటులతో పనిచేసే అవకాశం ఈ సినిమాతో దక్కింది. గోపరాజు రమణ గారికీ మంచి పాత్ర దక్కింది. రచయితల పుణ్యం వల్ల.. నాకు మంచి పాత్రలు పడుతున్నాయి. మునుముందు కూడా నన్ను నేను విభిన్నమైన పాత్రల్లో చూసుకోవాలనుకొంటున్నా’’

  • ‘‘నన్ను నేను వెండి తెరపై చూసుకొన్న తొలి సినిమా ‘మజిలీ’. ‘కలర్‌ ఫొటో’తో మంచి గుర్తింపు వచ్చింది. ఈ రెండు సినిమాలూ నా జీవితాన్ని మలుపు తిప్పాయి. వచ్చిన ప్రతి పాత్రకూ న్యాయం చేయాలన్న తపనతో పనిచేస్తున్నా’’.

Updated Date - 2023-01-27T04:53:39+05:30 IST