కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలను ఆదరించాలి
ABN , First Publish Date - 2023-12-13T03:33:50+05:30 IST
నిహార్ కోదాటి, ఆశ్లేషా ఠాకూర్ జంటగా నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాంతల’ ఈ నెల 15న విడుదల కానుంది. ఇండో అమెరికన్ ఆర్ట్స్ పతాకంపై ఇర్రింకి సుబ్బలక్ష్మి సమర్పణలో డాక్టర్ ఇర్రింకి సురేశ్ ఈ చిత్రాన్ని...

నిహార్ కోదాటి, ఆశ్లేషా ఠాకూర్ జంటగా నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాంతల’ ఈ నెల 15న విడుదల కానుంది. ఇండో అమెరికన్ ఆర్ట్స్ పతాకంపై ఇర్రింకి సుబ్బలక్ష్మి సమర్పణలో డాక్టర్ ఇర్రింకి సురేశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సీనియర్ నిర్మాత కె.ఎ్‌స.రామారావు సారఽఽథ్యంలో తయారైన ఈ చిత్రానికి శేషు పెద్దిరెడ్డి దర్శకుడు. విడుదల సందర్భంగా ఏర్పాటైన మీడియా సమావేశంలో కె.ఎ్‌స.రామారావు మాట్లాడుతూ ‘హింస హెవీ డోస్‌లో ఉన్న ‘జైలర్’, ‘జవాన్’, ‘యానిమల్’ వంటి చిత్రాలను ప్రేక్షకులు చూస్తున్నారు. అలాగే ‘బలగం’, ‘బేబీ’ వంటి సినిమాలను కూడా ఆదరిస్తున్నారు. మా చిత్రాన్ని కూడా ప్రోత్సహించాలని కోరుతున్నాను. కంటెంట్ ఉన్న ఇలాంటి మంచి చిత్రాలను, చిన్న చిత్రాలను ప్రోత్సహించండి. ఈ చిత్ర దర్శకుడు శేషు ఏడాదిన్నర కాలంగా కష్టపడి ఈ చిత్రం తీశారు. బాగా వచ్చింది. పాన్ ఇండియాకు సరిపడే కంటెంట్ ఉంది కనుక ఆ స్థాయిలో విడుదల చేస్తున్నాం’ అని చెప్పారు. నిర్మాత డాక్టర్ ఇర్రింకి సురేశ్ మాట్లాడుతూ ‘మాకు అండగా నిలిచిన రామారావుగారికి ధన్యవాదాలు. ఇంత మంచి చిత్రాన్ని తీయడానికి ఆయన మా వెంటే ఉన్నారు. మంచి సినిమా. దీన్ని ఆదరించాలని ప్రేక్షకులను కోరుతున్నాం’ అన్నారు. ‘మా దర్శకుడు శేషు ఈ కథతో రెండున్నర ఏళ్లుగా ప్రయాణం చేస్తున్నారు. ఎంతో కష్టపడి సినిమా తీశారు. ‘సీతారామం’ చిత్రం తర్వాత విశాల్ చంద్రశేఖర్ తన సంగీతంతో ఈ సినిమాకు ప్రాణం పోశారు. నటీనటులందరూ బాగా నటించారు’ అన్నారు నిహార్ కోదాటి. శాంతలగా నటించిన ఆశ్లేషా ఠాకూర్ మాట్లాడుతూ ‘ఇంత మంచి పాత్ర నాకు ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు.ఎంతో ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేశాం’ అన్నారు.