సీక్వెల్‌ సిత్రాలు సూడరో...!

ABN , First Publish Date - 2023-01-03T00:26:39+05:30 IST

నిజానికి సీక్వెల్‌ అంటే ఇది వరకు భయపడేవారంతా. తెలుగులో సీక్వెల్స్‌ పెద్దగా ఆడలేదు. కేవలం ఓ హిట్‌ సినిమా క్రేజ్‌ని వాడుకోవాలని చూస్తే.. సీక్వెల్స్‌ ఆడవు....

సీక్వెల్‌ సిత్రాలు సూడరో...!

ఈ యేడాది కొనసాగింపు చిత్రాల హవా

చిత్రసీమలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్‌ చూస్తుంటాం. కొన్నిసార్లు

యాక్షన్‌, ఫ్యాక్షన్‌ కథలు హోరెత్తుతాయి. ఇంకొన్నిసార్లు లవ్‌ స్టోరీలు

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తుంటాయి. కొన్నిసార్లు హారర్‌ కామెడీలు జోరు

చూపిస్తుంటాయి. విజయం ఎక్కడ ఉంటుందో.. అక్కడ చిత్రసీమ ప్రదక్షణాలు

చేయడం అత్యంత సహజమైన విషయం. అందుకే ‘ట్రెండ్‌’ని నమ్ముతుంటారంతా!

ఈ యేడాది మాత్రం సీక్వెల్‌ చిత్రాల జాతర చూడబోతున్నాం. ఔను... ఓ

విజయవంతమైన చిత్రాన్ని కొనసాగించడం కూడా తెలివైన మార్కెట్‌ సూత్రమే.

2023లో అలాంటి చిత్రాలు ఎక్కువగా రాబోతున్నాయి.

నిజానికి సీక్వెల్‌ అంటే ఇది వరకు భయపడేవారంతా. తెలుగులో సీక్వెల్స్‌ పెద్దగా ఆడలేదు. కేవలం ఓ హిట్‌ సినిమా క్రేజ్‌ని వాడుకోవాలని చూస్తే.. సీక్వెల్స్‌ ఆడవు. అంతకు మించిన విషయం పార్ట్‌ 2లో ఏదో ఉండాలి. లేదంటే... పల్టీలు కొట్టడం ఖాయం. అందుకే గతంలో ఇలాంటి ప్రయత్నాలు జరిగినా, సరైన ఫలితాలు రాలేదు. 2022లో ‘హిట్‌’, ‘కార్తికేయ’ చిత్రాల సీక్వెల్స్‌ మంచి విజయాల్ని అందుకొన్నాయి. ‘కేజీఎఫ్‌ 2’ భారీ విజయాన్ని అందుకొంది. అందుకే ఇప్పుడు మరోసారి సీక్వెల్స్‌ జాతర మొదలైపోయింది.

2021 డిసెంబరులో వచ్చిన ‘పుష్ప’ ఎంత పెద్ద విజయాన్ని అందుకొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటి నుంచీ ‘పుష్ప 2’ కోసం వెయిటింగ్‌లో పడిపోయారు అభిమానులు. 2022 డిసెంబరులో ‘పుష్ప 2’ వస్తుందని అప్పట్లో చెప్పారు కానీ, వీలు కాలేదు. ప్రస్తుతం ‘పుష్ప 2’ చిత్రీకరణ శర వేగంగా సాగుతోంది. ఈ యేడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాకి దాదాపుగా రూ.400 కోట్ల బడ్జెట్‌ కేటాయించారని ఓ టాక్‌. 2022లో విజయవంతమైన చిత్రాల జాబితాలో ‘బింబిసార’ ఒకటి. ఈ చిత్రానికి పార్ట్‌ 2 తీస్తామని దర్శక నిర్మాతలు ఎప్పుడో చెప్పేశారు. ఇప్పుడు అందుకు ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. కల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకొంటుంది. నిజానికి 2022లోనే ఈ చిత్రానికి కొబ్బరికాయ్‌ కొట్టాలి. కానీ కల్యాణ్‌ రామ్‌ ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్ల కుదర్లేదు. ‘బింబిసార’తో పోలిస్తే, బడ్జెట్‌ విషయంలోనూ, కాస్టింగ్‌ విషయంలోనూ ‘బింబిసార 2’ ఎన్నో రెట్లు పెద్దగా ఉండబోతోంది.

కమల్‌ హాసన్‌ - శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘భారతీయుడు’ దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ‘భారతీయుడు’ వచ్చి పాతికేళ్లు దాటేసింది. ఇంత సుదీర్ఘ విరామం తరవాత దీనికి కొనసాగింపు సినిమా తీస్తున్నారు. ఈ ప్రాజెక్టు కూడా ఎప్పుడో పూర్తి కావాల్సింది. కానీ నిర్మాతలతో శంకర్‌కి వివాదాలు తలెత్తడంతో ఆలస్యమైంది. ‘విక్రమ్‌’ ఇచ్చిన స్ఫూర్తితో కమల్‌ హాసన్‌ ఆగిపోయిన ‘భారతీయుడు’ చిత్రాన్ని మళ్లీ పట్టాలెక్కించారు.

నాని నిర్మాతగా రూపొందించిన ‘హిట్‌’ పేరుకు తగ్గట్టే మంచి విజయాన్ని అందుకొంది. ఈ విజయంతో ‘హిట్‌’ బ్రాండ్‌ని ఫ్రాంచైజీగా మార్చే ఆలోచన మొదలైంది. ‘హిట్‌ 2’ని అడవిశేష్‌తో పట్టాలెక్కించిన నాని... రెండో ప్రయత్నంలోనూ హిట్‌ అందుకొన్నాడు. ఇప్పుడు ‘హిట్‌ 3’లో నానినే స్వయంగా కథానాయకుడిగా నటిస్తున్నాడు. హిట్‌ 3, 4, 5.. ఇలా ఏడెనిమిది భాగాలుగా రూపొందించాలన్నది నాని ప్లాన్‌. సో... ప్రతీ యేడాది ఈ ఫ్రాంచైజీ నుంచి ఓ సినిమా ఆశించొచ్చు. 2022లో చిన్న సినిమాల్లో పెద్ద విజయంగా ‘డీజే టిల్లు’ని చెప్పొచ్చు. టిల్లు క్యారెక్టరైజేషన్‌, అందులో సిద్దు జొన్నలగడ్డ నటన.. ప్రేక్షకులకు బాగా నచ్చేశాయి. ఇలాంటి క్యారెక్టర్‌తో ఎన్ని సినిమాలైనా చేయొచ్చన్న భరోసా కలిగించింది. అందుకే ఇప్పుడు దీనికి రెండో భాగం సెట్స్‌పైకి వెళ్లింది. ఈసారి కూడా హిట్టు కొడితే.. టిల్లు క్యారెక్టర్‌ కూడా ఓ ఫ్రాంచైజీగా మారే అవకాశం పుష్కలంగా ఉంది. ‘కార్తికేయ’ ఎంత పెద్ద హిట్టయ్యిందో.. అంతకు పది రెట్ల విజయం ‘కార్తికేయ 2’తో అందుకొన్నాడు నిఖిల్‌. ఇప్పుడు ఈ సినిమాతో తాను పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయాడు. ‘కార్తికేయ 3’ని ఇంత కంటే పెద్ద స్థాయిలో, త్రీడీలో.. రూపొందించాలని ప్లాన్‌. అందుకు సంబంధించిన కథ కూడా సిద్ధంగా ఉంది. ఈ యేడాదే ఈ చిత్రం పట్టాలెక్కబోతోంది. కన్నడ ‘కాంతార’ దేశ వ్యాప్తంగా సంచనలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌ కూడా ఉంటుందని చిత్రబృందం ఇటీవలే ప్రకటించింది. అయితే ఈ సీక్వెల్‌ మొదలవ్వడానికి మాత్రం కొంచెం సమయం పడుతుందట. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌ 2’, ‘7 బై జీ బృందావన కాలనీ 2’ ఇవి కూడా కూడా చర్చల దశలో ఉన్నాయి.

సీక్వెల్‌ ఆలోచన రావడం పెద్ద విషయం ఏమీ కాదు. ఓ విజయవంతమైన చిత్రానికి కొనసాగింపు వస్తోందంటే కచ్చితంగా ప్రేక్షకుల్లో అటెన్షన్‌ పెరుగుతుంది. కానీ... ఆ అంచనాలను తట్టుకొని నిలబడగలిగే సత్తా.. సీక్వెల్‌ కథల్లో ఉండాలి. ఓ కథ, కాన్సెప్ట్‌ ఓసారి విజయవంతం అయినంత మాత్రాన ప్రతీసారీ.. అదే స్థాయిలో ఆడాలని రూలేం లేదు. పార్ట్‌ 2 అని పెట్టినప్పుడు రెండింతల కష్టం ఉంటుంది. అదే స్థాయిలో కష్టపడకపోతే... ప్రేక్షకుల్ని మెప్పించడం చాలా కష్టం. ఈ విషయాన్ని గత ఫలితాలు నిరూపించాయి. అయితే.. ఆ తప్పుల్ని సరిదిద్దుకొంటే, ఇంకాస్త బాధ్యతతో పని చేస్తే మాత్రం విజయం తథ్యం.

Updated Date - 2023-01-03T00:26:42+05:30 IST