Releases in Sankranti : సంక్రాంతి సెగ మామూలుగా లేదు
ABN , First Publish Date - 2023-08-08T03:55:11+05:30 IST
సంక్రాంతి 2024.. అబ్బో ఇంకా చాలా రోజులు ఉంది. నిజమే. మరో వీ నెలల సమయం. ఈలోగా చాలా పనులు చక్కబెట్టుకోవొచ్చు. కానీ సినిమా వాళ్లు అలా అనుకోవడం లేదు...

సంక్రాంతి 2024.. అబ్బో ఇంకా చాలా రోజులు ఉంది. నిజమే. మరో వీ నెలల సమయం. ఈలోగా చాలా పనులు చక్కబెట్టుకోవొచ్చు. కానీ సినిమా వాళ్లు అలా అనుకోవడం లేదు. పండక్కి ఏ సినిమాలు తీసుకురావాలి? ఎలాంటి సినిమాల్ని వదలాలి? అనే కసరత్తులు ఎప్పుడో మొదలెట్టేశారు. పైకి చెప్పడం లేదు కానీ, బడా సినిమాల కళ్లన్నీ... సంక్రాంతిమీదే. వచ్చే యేడాది.. సంక్రాంతి సెగ ఓ రేంజ్‌లో ఉండబోతోంది. ఓరకంగా.. ఇది పరిశ్రమకు మంచి పరిణామం. మరో రకంగా ఇబ్బంది కూడా.
ఈ యేడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి విడుదలయ్యాయి. ఇవి రెండూ మంచి విజయాల్ని అందుకొన్నాయి. స్టార్ బలం ఈ సినిమాలకు కలిసొచ్చింది. అయితే సంక్రాంతి సీజన్‌లో విడుదల చేయడం మరింత ప్లస్ అయ్యింది. ఈ సీజన్ స్పెషాలిటీ అదే. యావరేజ్ సినిమాల్ని హిట్ చేస్తుంది. హిట్ సినిమాల్ని సూపర్ హిట్లుగా మారుస్తుంది. అందుకే సంక్రాంతిపైనే అందరి గురి. 2024లో కూడా ఆ సందడి మరింతగా కనిపించబోతోంది. ఈసారి కనీసం వ సినిమాలైనా థియేటర్ల ముందుకు రాబోతున్నాయి. అన్నీ టాప్ హీరోల చిత్రాలే.
2024 సంక్రాంతికి వస్తున్నామంటూ.. ‘ప్రాజెక్ట్ కె’ (కల్కి) ఇది వరకే ప్రకటించేసింది. జనవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. రిలీజ్ డేట్‌లో మార్పులు ఉంటాయని బయట ప్రచారం జరుగుతోంది. కానీ చిత్రబృందం మాత్రం జనవరికే ఫిక్సయినట్టు సమాచారం. మహేశ్‌బాబు - త్రివిక్రమ్ ‘గుంటూరు కారం’ టార్గెట్ కూడా పండక్కే. అయితే ఈ సినిమా షూటింగ్ నిదానంగా సాగుతోంది. సంక్రాంతికల్లా రెడీ అవుతుందా? లేదా? అనే అనుమానాలు ఉన్నాయి. ఇన్ సైడ్ వర్గాలు మాత్రం నవంబరు నాటికి షూటింగ్ పూర్తయిపోతుందని, జనవరి మొదటి వారంలో ఫస్ట్ కాపీ కూడా రెడీగా ఉంటుందని, త్రివిక్రమ్ ఆమేరకు ప్రణాళికలు సిద్దం చేశారని అంటున్నారు.
ఈ యేడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా సందడి చేసిన చిరు... 2024 సంక్రాంతికీ కర్చీఫ్ వేశారు. చిరంజీవి కథానాయకుడిగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. భోళా శంకర్ తరవాత చిరు పట్టాలెక్కించే చిత్రమిదే. దీన్ని సంక్రాంతికి విడుదల చేస్తారు. మరో కథానాయకుడిగా శర్వానంద్ లేదా సిద్దు జొన్నలగడ్డ నటించే అవకాశం ఉంది. ఇది పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రం కాబట్టి.. సంక్రాంతి అనువైన సమయం అని చిరు భావిస్తున్నారు. దిల్‌రాజుకి సంక్రాంతి సెంటిమెంట్ పుష్కలంగా ఉంది. సంక్రాంతికి ఆయన బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలన్నీ హిట్టే. ఈసారీ.. ఆయన ఈ పండగని టార్గెట్ చేశారు. విజయ్ దేవరకొండ - పరశురామ్ కాంబినేషన్‌లో ఓ చిత్రం పట్టాలెక్కనుంది. మృణాళ్ ఠాకూర్ కథానాయిక. 2024 సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. రవితేజ కొత్త సినిమా ‘ఈగల్’ సైతం ఈ బరిలో నిలవబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వీటన్నింటి మధ్య ‘హనుమాన్’ని సైతం విడుదల చేస్తారని టాక్. 2024 జనవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. నితిన్-వక్కంతం వంశీ కాంబోలో రూపుదిద్దుకొంటున్న ‘ఎగస్ట్రా’ ఈ క్రిస్మ్‌సకి రావాలి. కానీ... ఈ సినిమా కూడా జనవరికి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి పొంగల్ పోటీలో ఉన్న సినిమాలివి. అయితే ఈ లిస్టు మరింత పెరిగే అవకాశం ఉంది. ఒకేసారి ఇన్ని క్రేజీ సినిమాలు రావడం సంతోషమే. అయితే.. అన్ని సినిమాలకూ థియేటర్లు దొరుకుతాయా? అనే అనుమానాలు నెలకొన్నాయి. కొన్నిసార్లు ‘మేం వస్తున్నాం.. వచ్చేస్తున్నాం’ అని ప్రకటించి, చివరి నిమిషంలో డ్రాప్ అవుతుంటారు. అలాంటప్పుడు ఏయే సినిమాలు వస్తాయి? ఏవి రావు? అనే విషయంలో గందరగోళం నెలకొని ఉంటుంది. పెద్ద సినిమాలన్నీ భారీ స్థాయిలో థియేటర్లు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఆ సమయంలో థియేటర్ల సమస్య తలెత్తుతుంది. ఓ మాదిరి చిత్రాలకు ఏమాత్రం అవకాశం రాదు. సినిమా సిద్ధమైనా సంక్రాంతికి విడుదల చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. ఒకవేళ పోటీ పడి వచ్చినా.. పెద్ద సినిమాల ధాటికి నలిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ విషయంలో నిర్మాతలంతా ఓసారి పునరాలోచించుకొంటే మంచిది. సంక్రాంతి ఎంత గొప్ప సీజన్ అయినా.. ఒకేసారి ఇన్ని సినిమాలకు చోటు కల్పించడం చాలా కష్టం. మిగిలిన చిత్రాలు మరో మంచి డేట్ అట్టిపెట్టుకోవడం శ్రేయస్కరం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.