అఖిల్‌ నుంచి చాలా నేర్చుకున్నా

ABN , First Publish Date - 2023-04-28T01:32:01+05:30 IST

ముంబైలోని థానేలో ఫిజియోథెరపిస్ట్‌గా పని చేస్తున్న సాక్షి వైద్య ‘ఏజెంట్‌’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు.

అఖిల్‌ నుంచి చాలా నేర్చుకున్నా

ముంబైలోని థానేలో ఫిజియోథెరపిస్ట్‌గా పని చేస్తున్న సాక్షి వైద్య ‘ఏజెంట్‌’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. అఖిల్‌ అక్కినేని నటించిన ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా సాక్షి పాత్రికేయులతో మాట్లాడారు. ‘కొవిడ్‌ సమయంలో మా కాలేజ్‌ కూడా లాక్‌ డౌన్‌లోకి వెళ్లి పోయింది. ఖాళీగా ఉండడం ఎందుకని సోషల్‌ మీడియాలో రీల్స్‌ చేశాను. వాటిల్లో కొన్ని వైరల్‌ అయ్యాయి. ముంబైలో కొన్ని ఆడిషన్స్‌ ఇచ్చాను. అక్కడ అవకాశాలు వచ్చాయి కానీ నాకు నచ్చలేదు. ఆ తర్వాత ‘ఏజెంట్‌’లో అవకాశం వచ్చింది. ఆడిషన్‌ చేసి హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు’. దర్శకుడు సురేందర్‌రెడ్డి బాగా సపోర్ట్‌ చేశారు’ అని చెప్పారు సాక్షి.

‘ఇందులో ఏజెంట్‌కు ప్రేయసిగా కనిపిస్తా. చిత్రంలో నాది కీలకమైన పాత్ర. తెలుగులో తొలిసారే పెద్ద సినిమా చేసే అవకాశం రావడం నిజంగా లక్కే. అఖిల్‌ చాలా హంబుల్‌. తన నుంచి ఎంతో నేర్చుకున్నా. నాకు భరతనాట్యం తెలుసు. అందుకే స్టెప్స్‌ త్వరగా నేర్చుకోగలిగా.’ అన్నారు సాక్షి.

‘ఏజెంట్‌ మాసీవ్‌ థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుందనీ, తప్పకుండా అందరూ థియేటర్‌లోనే చూడాలని సాక్షి కోరారు. వరుణ్‌తేజ్‌తో ఓ సినిమా చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

Updated Date - 2023-04-28T01:32:23+05:30 IST