Rules Ranjan at the end of the month : నెలాఖరుకు రూల్స్‌ రంజన్‌

ABN , First Publish Date - 2023-09-05T02:21:58+05:30 IST

కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘రూల్స్‌ రంజన్‌’. నేహాశెట్టి కథానాయిక. రత్నం కృష్ణ దర్శకుడు. ఏ. ఎం రత్నం సమర్పణలో దివ్యాంగ్‌ లవానియా, మురళీకృష్ణ వేమూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది...

Rules Ranjan at the end of the month : నెలాఖరుకు రూల్స్‌ రంజన్‌

కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘రూల్స్‌ రంజన్‌’. నేహాశెట్టి కథానాయిక. రత్నం కృష్ణ దర్శకుడు. ఏ. ఎం రత్నం సమర్పణలో దివ్యాంగ్‌ లవానియా, మురళీకృష్ణ వేమూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ‘రూల్స్‌ రంజన్‌’ను ఈ నెల 28న విడుదల చేస్తున్నట్లు ఏ. ఎం రత్నం తెలిపారు. ఈ సందర్భంగా కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ ‘కృష్ణ కథ చెపుతున్నప్పుడు రెండు గంటల పాటు నవ్వుతూనే ఉన్నాను. ఇందులో నేను మనోరంజన్‌ అనే పాత్ర పోషించాను. అందరూ ఈ పాత్రకు కనెక్ట్‌ అవుతారు. ఏ. ఎం రత్నం గారు మా సినిమా సమర్పకులుగా ఉన్నందుకు ఆనందంగా ఉంది’ అన్నారు. నేహాశెట్టి మాట్లాడుతూ ‘‘సమ్మోహనుడా’ పాటకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనకు ఎంతో సంతోషంగా ఉంది. ‘డీజే టిల్లు’లో రాధిక పాత్రలా ఈ సినిమాలో నేను పోషించిన సనా పాత్ర కూడా అంతలా ప్రేక్షకులను మెప్పిస్తుంది’ అని చెప్పారు. రత్నం కృష్ణ మాట్లాడుతూ ‘ప్రేక్షకులకు మంచి వినోదాత్మక చిత్రం అందించాలని ‘రూల్స్‌ రంజన్‌’ చేశాను. కుటుంబం, స్నేహితులతో చూసి ఆనందించదగ్గ చిత్రమిది. కథ నచ్చి దివ్యాంగ్‌, మురళీ నిర్మించడానికి ముందుకొచ్చారు’ అని తెలిపారు. ‘ఏ. ఎం రత్నం గారి ఆశీస్సులతో మేము ముందడుగు వేశాం. కథ విన్నప్పుడే ‘రూల్స్‌ రంజన్‌’ బ్లాక్‌బస్టర్‌ అవుతుందని నమ్మకం కలిగింది’ అని నిర్మాతలు చెప్పారు.

ఎన్నికల ముందు వీరమల్లు

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రంపై వస్తున్న రూమర్స్‌ అన్నీ అవాస్తవాలని నిర్మాత ఏ. ఎం రత్నం తెలిపారు. ‘హరిహర వీరమల్లు’ సుదీర్ఘ కాలం పాటు షూటింగ్‌ దశలోనే ఉండడానికి కారణం సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతుండమేనని తెలిపారు. ఈ సినిమాపై పవన్‌ కల్యాణ్‌ ఆసక్తి చూపడం లేదనే వార్తలను కొట్టి పారేశారు. ఈ ఏడాది చివరికల్లా షూటింగ్‌ పూర్తి చేసి, ఎన్నికల ముందు సినిమాను విడుదల చేస్తామని చెప్పారు. పార్టీని నడిపేందుకు అవసరమైన ఖర్చులను భరించేందుకే పవన్‌ కల్యాణ్‌ వరుసగా సినిమాలు చేస్తున్నాడని అన్నారు.

Updated Date - 2023-09-05T02:21:58+05:30 IST