Deepfake: నిన్న రష్మిక నేడు కట్రినా రేపు...?

ABN , First Publish Date - 2023-11-08T01:09:53+05:30 IST

మార్ఫింగ్‌ చేసిన అశ్లీల వీడియోలు, నగ్న ఫొటోలు...చాలాకాలంగా హీరోయిన్లు ఎదుర్కొంటున్న ఇబ్బందికరమైన సమస్య. తాజాగా టాలీవుడ్‌ హీరోయిన్‌ రష్మిక మందన్నకు సంబంధించి ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌ అయింది...

Deepfake: నిన్న రష్మిక నేడు కట్రినా రేపు...?

సెలబ్రిటీలు లక్ష్యంగా సైబర్‌ నేరగాళ్ల అరాచకం

మార్ఫింగ్‌ చేసిన అశ్లీల వీడియోలు, నగ్న ఫొటోలు...చాలాకాలంగా హీరోయిన్లు ఎదుర్కొంటున్న ఇబ్బందికరమైన సమస్య. తాజాగా టాలీవుడ్‌ హీరోయిన్‌ రష్మిక మందన్నకు సంబంధించి ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌ అయింది. ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) టెక్నాలజీ రాకతో డీప్‌ ఫేకింగ్‌ టెక్నాలజీని ఉపయోగించి సైబర్‌ నేరగాళ్లు మరింత విజృంభిస్తున్నారు. అసలు ఎవరో, నకిలీ ఎవరో కూడా పోల్చుకోలేని రీతిలో డీప్‌ ఫేక్‌ వీడియోలను రూపొందించి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. హీరోయిన్లు, సెలబ్రిటీ మహిళలు, టీనేజ్‌ అమ్మాయిలను లక్ష్యంగా చేసుకొని వారి పరువు బజారుకీడ్చుతున్నారు.

రష్మిక డీప్‌ ఫేక్‌ వీడియో మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమను షాక్‌కు గురి చేసింది. పలువురు సినీ ప్రముఖులు ఈ దుశ్చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న రష్మిక, నేడు కట్రినా రేపు మరెవరో అంటూ ఇలాంటి తప్పుడు వీడియోలను రూపొందించి వైరల్‌ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పలువురు రాజకీయ నాయకులు, కేంద్రమంత్రులు సైతం రష్మికకు మద్దతుగా నిలిచారు.

కట్రినా ఫేక్‌ ఫొటో వైరల్‌

రష్మిక డీఫ్‌ ఫేక్‌ వీడియో షాక్‌ నుంచి సినీవర్గాలు తేరుకొనే లోపే తాజాగా బాలీవుడ్‌ నటి కట్రినా కైఫ్‌ నటించిన ‘టైగర్‌-3’ సినిమాకు సంబంధించిన డీప్‌ ఫేక్‌ ఫొటో ఒకటి వైరల్‌గా మారింది. ఒరిజినల్‌ ఫొటోలో కట్రినా తెల్లటి టవల్‌ ధరించి హాలీవుడ్‌ స్టంట్‌ మన్‌తో ఫైట్‌ చేస్తున్నారు. అయితే ఇప్పుడు వైరల్‌ అవుతున్న ఎడిట్‌ చేసిన ఫొటోలో ఆమె టవల్‌కు బదులుగా లో-కట్‌ వైట్‌ టాప్‌, మ్యాచింగ్‌ బాటమ్‌ ధరించి కనిపించారు. ఏఐ సాంకేతికతను ఉపయోగించి ఈ ఇమేజ్‌ను మార్చినట్లు తెలుస్తోంది. కైఫ్‌ డీప్‌ ఫేక్‌ ఫొటోపై పలువురు నెటిజన్లు సోషల్‌ మీడియాలో ఘాటుగా స్పందిస్తున్నారు. ఇలాంటి చర్యలు సిగ్గుచేటని, ఒక మహిళ ఫొటోను మార్ఫింగ్‌ చేయడానికి ఏఐని ఉపయోగించడం క్రిమినల్‌ నేరమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలు ఏం జరిగింది?

కథానాయిక గా రష్మిక మందన్న కెరీర్‌ ప్రస్తుతం మాంచి ఊపు మీద కొనసాగుతోంది. ఇటు సౌత్‌లో అటు బాలీవుడ్‌లో వరుస చిత్రాలు చేస్తున్నారు. అగ్రహీరోలతో జతకడుతున్నారు. ‘పుష్ప’ చిత్రంలో శ్రీవల్లి పాత్రతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. పాపులారిటీ ఉండడంతో సైబర్‌ నేరగాళ్లకు ఆమె లక్ష్యంగా మారారు. ఫేక్‌ వీడియో చేసి వదిలారు. ఈ వీడియోలో ఉన్న అసలు వ్యక్తి జరాపటేల్‌. ఈమె బ్రిటిష్‌ ఇండియన్‌. తను ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా పాపులర్‌. కృత్రిమమేధ సాయంతో సైబర్‌ నేరగాళ్లు జరా పటేల్‌ శరీరానికి రష్మిక ముఖాన్ని కలిపి ఓ వీడియోను రూపొందించారు. ఇందులో పొట్టి డ్రెస్‌లో ఎదభాగం కనిపించేలా రష్మిక లిఫ్ట్‌లోపల నిలబడి ఉన్నారు. అచ్చం రష్మికలానే ఉండడంతో నిజమైన వీడియోనే అని చాలా మంది పొరపడ్డారు. ‘బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి కురచ దుస్తులు వేయడం ఏంటి?, మరీ ఇంత హాట్‌గా కనిపించాలా?’ అని చాలామంది నెటిజన్లు రష్మికను తప్పు పట్టారు. దీంతో స్వయంగా ర ష్మిక స్పందించాల్సి వచ్చింది. ఆ వీడియోలో ఉన్నది తను కాదు అది డీప్‌ఫేక్‌ వీడియో అని క్లారిటీ వచ్చింది.

అప్పడు జరిగి ఉంటే తట్టుకునేదాన్ని కాదేమో

డీప్‌ ఫేక్‌ వీడియోపై రష్మిక సోషల్‌ మీడియాలో స్పందించారు. ‘ఇలాంటి (డీప్‌ ఫేక్‌ వీడియో)వాటి గురించి మాట్లాడాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ఉంది. ఇలాంటివాటివల్ల నాకే కాదు ప్రతి ఒక్కరికీ చాలా భయంగా ఉంది. నా కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఇప్పుడు నాకు మద్దతుగా నిలిచారు. కానీ ఇదే విషయం నేను స్కూల్‌, కాలేజ్‌లో ఉన్నప్పుడు జరిగి ఉంటే, నేను తట్టుకోగలనో లేదో నా ఊహకే అందడం లేదు. ఇలాంటి సమస్య మనలో మరింత మందికి ఎదురవక మునుపే దీన్ని పరిష్కరించాలి’ అని పేర్కొన్నారు.

ఈ వీడియోపై జరా పటేల్‌ కూడా స్పందించారు. రష్మికకు తన సానుభూతి తెలిపారు. ‘ప్రముఖ నటి ముఖాన్ని ఉపయోగించి ఎవరో డీప్‌ ఫేక్‌ వీడియోను తయారుచేశారు. ఆ వీడియోను చూసి చాలా ఆందోళన చెందాను. ఈ వీడియోతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ సంఘటన నన్ను చాలా ఆవేదనకు గురి చేసింద’న్నారు. ఇంటర్నెట్‌లో అమ్మాయిలు, మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇకపై సోషల్‌ మీడియాలో ఏదైనా పోస్ట్‌ చేయాలంటే అమ్మాయిలు భయపడాల్సి వస్తోంది. ఇంటర్నెట్‌లో ఉన్నదంతా నిజం కాదు, అసత్యాలను వ్యాప్తి చేసేముందు దయచేసి ఒక్కసారి ఆలోచించండి’ అని జరా నెటిజన్లను కోరారు.

అంతా ఫేక్‌ : ఓ వైపు కృత్రిమ మేధ ద్వారా శాస్త్ర సాంకేతిక రంగాల్లో పలు విప్లవాత్మక ఆవిష్కరణలు జరుగుతున్నాయి. కానీ మరికొందరు ఈ సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్నారు. రష్మిక ఉదంతంతో కృత్రిమమేధలోని మరో భయంకర కోణంపై ఆందోళన మొదలైంది. దీని ద్వారా సైబర్‌ నేరగాళ్లు ఒరిజినల్‌ వీడియోలు, ఫొటోల స్థానంలో నకిలీ ఇమేజ్‌లు, వీడియోలు రూపొందిస్తున్నారు. మార్ఫింగ్‌ వీడియోలను కొంత వరకూ గుర్తించవచ్చు. కానీ ఏఐ సాయంతో రూపొందిన వీడియోల్లో ఉన్నది అసలు వ్యక్తులా కాదా అని గుర్తుపట్టడం చాలా కష్టం. మెషీన్‌ లెర్నింగ్‌ టూల్స్‌ ద్వారా న్యూరల్‌ నెట్‌వర్క్‌లను ఉపయోగించి, అసలు వీడియోల స్థానంలో ఫేక్‌ వీడియోలను సైబర్‌ నేరగాళ్లు తయారుచేస్తున్నారు. ముఖం అచ్చుగుద్దినట్లు దించడానికి ఫేషియల్‌ మ్యాపింగ్‌ టెక్నాలజీ వాడుతున్నారు. గొంతు కూడా అలాగే ఉండేందుకు వాయిస్‌ మ్యాచింగ్‌ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. జరాపటేల్‌ వీడియోను రష్మిక ముఖంతో ఈ విధానంలోనే డీప్‌ ఫేక్‌ వీడియోగా తయారుచేశారు. ఇలాంటి వీడియోలను కట్టడి చేయడం ప్రభుత్వం, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ల వల్ల కావడం లేదు. ఇప్పటికే అమల్లో ఉన్న మూడేళ్ల జైలుశిక్ష, లక్ష రూపాయల జరిమానా లాంటి చట్టాలను కఠినంగా అమలు చేయడం ద్వారా మాత్రమే దీన్ని కొంతమేర అయినా అరికట్టవచ్చని సైబర్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


సోషల్‌ ప్లాట్‌ఫామ్‌లదే బాధ్యత

రష్మిక మందన్న డీప్‌ ఫేక్‌ వీడియో వ్యవహారంపై కేంద్రం సీరియ్‌సగా స్పందించింది. ఇటువంటి వీడియోలను అడ్డుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందని పేర్కొంటూ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలకు కేంద్ర ఎలక్ర్టానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ ఒక రిమైండర్‌ను పంపింది. డీప్‌ ఫేక్‌ వంటి మార్ఫింగ్‌ వీడియోల తయారీ, వ్యాప్తికి సంబంధించిన చట్ట నిబంధనలు, జరిమానాలను అందులో గుర్తు చేసింది. కంప్యూటర్‌ వనరులను ఉపయోగించి మోసం చేసినందుకు విధించే శిక్షలను వివరించే ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం- 2000లోని సెక్షన్‌ 66డీని ఉదహరించింది. దీని ప్రకారం.. ఎవరైనా, ఏదైనా కమ్యూనికేషన్‌ పరికరం లేదా కంప్యూటర్‌ వనరులను ఉపయోగించి వ్యక్తులను మోసగిస్తే, వారికి మూడేళ్ల వరకూ జైలు శిక్షతో పాటు రూ.లక్ష వరకూ జరిమానా కూడా విధించవచ్చు. రష్మిక డీఫ్‌ ఫేక్‌ వీడియో వివాదాస్పదమైన నేపథ్యంలో సామాజిక మాధ్యమ ప్లాట్‌ఫాంలకు కేంద్రం ఈ మేరకు అడ్వైజరీ జారీ చేసింది.

గతంలోనూ మార్ఫింగ్‌ టెక్నాలజీని వాడి పలువురు హీరోయిన్లను అసభ్యకరరీతిలో చూపిస్తూ అశ్లీల వీడియోలు, నగ్న ఫొటోలు సృష్టించి ప్రచారంలోకి తెచ్చారు. బాలీవుడ్‌లో ఐశ్వర్యారాయ్‌ సహా పలువురు కథానాయికలకు ఈ బెడద తప్పలేదు. టాలీవుడ్‌లో సమంత, తమన్నా, సాయిపల్లవి, కాజల్‌ అగర్వాల్‌ సహా పలువురు తారల ఫేక్‌ వీడియోలను వైరల్‌ చేశారు. మహశ్‌బాబు కథానాయకుడిగా నటి స్తున్న ‘గుంటూరుకారం’ చిత్రం పోస్టర్‌ను సైతం ఏఐ సాయంతో సృష్టించి వైరల్‌ చేశారు. తర్వాత కానీ అది నకిలీ అని తెలియలేదు.

బాలీవుడ్‌ అగ్రనటుడు అమితాబ్‌బచ్చన్‌, అక్షయ్‌కుమార్‌, గాయని చిన్మయి సహా పలువురు సినీ ప్రముఖులు దీనిపై స్పందించారు. ఫేక్‌ వీడియోలను ప్రచారంలోకి తెస్తున్నవాళ్లను పట్టుకొని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.

టెక్నాలజీ దుర్వినియోగం చూస్తుంటే బాధగా ఉంది. భవిష్యత్తులో జరగబోయే మార్పులను ఊహిస్తుంటే భయంగా ఉంది. బాధితులకు రక్షణ కల్పించేందుకు కొత్త చట్టాన్ని తీసుకురావాలి. రష్మికకు మరింత ధైర్యం, బలం చేకూరాలి.

నాగచైతన్య

హీరోయిన్ల శరీర భాగాలను జూమ్‌ చేసి మరీ వీడియోలు తయారుచేస్తున్నారు. అసలీ సమాజం ఎటుపోతోంది. మేం నటులమే కావొచ్చు కానీ మనుషులం కూడా. మౌనంగా ఉండడానికి ఇది సమయం కాదు. ఈ సమస్యపై గొంతెత్తిన రష్మికకు కృతజ్ఞతలు.

మృణాల్‌ ఠాకూర్‌

Updated Date - 2023-11-08T10:54:01+05:30 IST