అవతార్‌ 2 ను దాటేసిన పఠాన్‌

ABN , First Publish Date - 2023-01-27T04:50:29+05:30 IST

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ మరోసారి తన సత్తా చాటారు. బుధ వారం విడుదలైన ఆయన తాజా చిత్రం ‘పఠాన్‌’ బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డులు...

అవతార్‌ 2 ను దాటేసిన పఠాన్‌

  • తొలి రోజు వసూళ్లు రూ. 106 కోట్లు

  • ఓవర్సీస్‌లో నంబర్‌ వన్‌

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ మరోసారి తన సత్తా చాటారు. బుధ వారం విడుదలైన ఆయన తాజా చిత్రం ‘పఠాన్‌’ బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. సిద్దార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజున రూ. 106 కోట్ల గ్రాస్‌ వసూలు చేసి చరిత్ర సృష్టించింది. ఓ హిందీ చిత్రం ప్రీమియర్‌ షోలు ఏమీ వేయకుండా తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ వంద కోట్ల గ్రాస్‌ వసూలు చేయడం ఇదే ప్రథమం. గురువారమో, శుక్రవారమో కాకుండా బుధవారం నాడు విడుదలైన ‘పఠాన్‌’ ఈ స్థాయిలో వసూలు చేయడం ట్రేడ్‌ పండితుల్ని కూడా ఆశ్చర్య పరుస్తోంది. ఓవర్‌సీ్‌సలో ‘అవతార్‌ 2’ చిత్రం తొలి రోజున 10 మిలియన్‌ డాలర్లు వసూలు చేస్తే, ‘పఠాన్‌ ’ 13 మిలియన్‌ డాలర్లు కలెక్ట్‌ చేసి ముందంజలో ఉంది. అమెరికా, కెనడా, యుకెలలో ‘పఠాన్‌’ చిత్రం తొలి రోజు వసూళ్ల పరంగా మొదటి స్థానంలో ఉంది. అలాగే మనదేశంలో అన్ని భాషల్లో కలిపి రూ 57 కోట్లు (నెట్‌) వసూలు చేయడం కూడా మరో రికార్డ్‌. హిందీ వెర్షన్‌కు రూ 55 కోట్లు వసూలు కాగా, తెలుగు, తమిళ భాషల డబ్బింగ్‌ వెర్షన్స్‌ నుంచి మరో రెండు కోట్లు కలెక్ట్‌ అయ్యాయి. ఇంతవరకూ బాలీవుడ్‌లో హృతిక్‌ రోషన్‌ నటించిన ‘వార్‌’ (రూ 53.3 కోట్లు), ఆమిర్‌ఖాన్‌ ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌’ (రూ. 52 కోట్లు), కేజీఎఫ్‌ 2( రూ.53. 9 కోట్లు) చిత్రాలు తొలి రోజు వసూళ్ల పరంగా ముందంజలో ఉన్నాయి. ఇప్పుడు ‘పఠాన్‌’ చిత్రం వీటన్నింటినీ దాటేసింది. రెండో రోజు రూ 65 కోట్లు (నెట్‌) కలెక్ట్‌ చేయవచ్చని భావిస్తున్నారు. నాలుగేళ్ల తర్వాత వస్తున్న షారుఖ్‌ చిత్రం కావడం, దీపిక గ్లామర్‌, సినిమా మీద కాంట్రవర్సీ, మార్కెట్‌లో మరే పెద్ద సినిమా లేకపోవడం, వరుస సెలవులు .. ఇవన్నీ ‘పఠాన్‌’కు కలిసొచ్చాయి. కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ సినిమాలో అతిధి పాత్ర పోషించడం కూడా ఈ సినిమాకు అదనపు ఆకర్షణ అయింది.

Updated Date - 2023-01-27T04:50:31+05:30 IST