Pathaan box office : బాక్సాఫీస్‌ దుమ్ము దులుపుతున్న పఠాన్‌

ABN , First Publish Date - 2023-02-01T03:29:22+05:30 IST

దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ‘పఠాన్‌’ చిత్రంతో వెండితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చిన షారూఖ్‌ఖాన్‌ వసూళ్ల సునామీని సృష్టిస్తున్నాడు. గత నెల 25న విడుదలైన ఈ చిత్రం తొలి ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 600 కోట్ల వసూళ్లకు చేరువైంది...

Pathaan box office : బాక్సాఫీస్‌ దుమ్ము దులుపుతున్న  పఠాన్‌

పలు వివాదాల మధ్య థియేటర్లలోకి అడుగుపెట్టిన ‘పఠాన్‌’ బాక్సాఫీసు దగ్గర విజయ పతాక ఎగురవేశాడు. సెన్సార్‌ కత్తెరలు, సినిమాను ఆడనివ్వమనే హెచ్చరికలు, షారూఖ్‌ పని అయిపోయిందనే విమర్శలు... అన్నీ చిన్నబోయేలా చేసి గడ్డుకాలంలో బాలీవుడ్‌కు ఓ భారీ విజయంతో ఊరటనిచ్చిన చిత్రమిది. చరిత్ర సృష్టించే వసూళ్ల దిశగా దూసుకెళుతున్న ‘పఠాన్‌’ షారూఖ్‌ఖాన్‌ స్టార్‌డమ్‌కు తిరుగులేదనే సంకేతంతో పాటు హిందీ చిత్రపరిశ్రమకు మంచికాలం ముందుందనే నమ్మకాన్ని ఇచ్చింది.

దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ‘పఠాన్‌’ చిత్రంతో వెండితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చిన షారూఖ్‌ఖాన్‌ వసూళ్ల సునామీని సృష్టిస్తున్నాడు. గత నెల 25న విడుదలైన ఈ చిత్రం తొలి ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 600 కోట్ల వసూళ్లకు చేరువైంది. బాలీవుడ్‌ దిగ్గజ నిర్మాణ సంస్థ యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌కు కూడా ఈ ఏడాది ఇదే తొలి భారీ చిత్రం. కరోనా దెబ్బ, కొన్నేళ్ల నుంచి ఎదురవుతున్న వరుస అపజయాలతో కుదేలైన యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌కు ఈ సినిమా వసూళ్ల పరంగా భారీ లాభాలను తెచ్చింది. ఇవి ఇలానే నిలకడగా కొనసాగితే ఇంకో వారంలో అత్యధిక వసూళ్లను సాధించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కేజీఎఫ్‌ 2’ లాంటి అగ్రచిత్రాల సరసన ‘పఠాన్‌’ చేరిక ఖాయం. అలాగే షారూఖ్‌ ఆల్‌టైమ్‌ హిట్స్‌ జాబితాలో ఈ చిత్రం చేరుతుందనీ అంచనా వేస్తున్నారు.

ప్రతికూల ప్రచారం కలిసొచ్చిందా?

ఓ వైపు బాలీవుడ్‌లో ముగ్గురు ఖాన్‌లు సల్మాన్‌, షారూఖ్‌, ఆమిర్‌ఖాన్‌ నటించిన చిత్రాలు పేలవ ప్రదర్శన కారణంగా ఖాన్‌ త్రయం పనైపోయిందనే విమర్శల జోరు పెరిగింది. షారూఖ్‌ నటించిన గత చిత్రం ‘జీరో’ అట్టర్‌ఫ్లాప్‌ అయింది. ఆ తర్వాత ఆయన నుంచి సినిమా రావడానికి ఐదేళ్లు పట్టింది. గతేడాది కుమారుడు ఆర్యన్‌ డ్రగ్స్‌ వ్యవహారం షారూఖ్‌ కుటుంబాన్ని కుదిపేసింది. ఇలాంటి నేపథ్యంలో ‘పఠాన్‌’ చిత్రం టైటిల్‌ ప్రకటించిన నాటి నుంచి సినిమాపై వెక్కిరింతలు మొదలయ్యాయి. అలాగే దీపికా పదుకొనే కాషాయ రంగు బికినీతో సినిమాపై వ్యతిరేకత తారాస్థాయికి చేరింది. హిందూ సంస్థల హెచ్చరికల నేపథ్యంలో సెన్సార్‌ బోర్డ్‌ తన కత్తెరకు పదునుపెట్టింది. అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఏకంగా కొన్ని సన్నివేశాలను తొలగించారు. ‘పఠాన్‌’ సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామనే బెదిరింపులు మరోవైపు.. ఇలా అనేక ఒత్తిళ్ల మధ్య సినిమాను విడుదల చేశారు. అయితే ఈ నెగెటివ్‌ పబ్లిసిటీ సినిమాకు బాగా కలిసొచ్చింది. విడుదలకు కొన్ని రోజుల ముందు నుంచే అడ్వాన్స్‌ బుకింగ్‌తో పఠాన్‌ అదరగొట్టాడు. ఇతర సినిమాలతో పోల్చితే చాలా ఎక్కువ సంఖ్యలో టికెట్లు అమ్ముడయ్యాయి. సాధారణంగా చాలా సినిమాలకు శని, ఆదివారాలు బాగున్నా, సోమవారం కలెక్షన్లు భారీగా పడిపోతాయి. ఎన్నో హిట్‌ చిత్రాలకు కూడా ఇలానే జరిగింది. కానీ ‘పఠాన్‌’ ఈ గండం గట్టెక్కింది. సోమవారం కూడా వసూళ్లు పెద్దగా పడిపోలేదు. హిందీ, డబ్బింగ్‌ వెర్షన్‌ కలిపి రూ. 26 కోట్లు వసూలు చేయగా, విదేశాల్లో రూ. 16 కోట్ల వసూళ్లను సాధించింది.

అతి తక్కువ పారితోషికం

‘పఠాన్‌’ సినిమాకు షారూఖ్‌ఖాన్‌ తీసుకున్న పారితోషికం కూడా వార్తల్లో నిలిచింది. ఇప్పుడు దక్షిణాది అగ్రహీరోలే సినిమాకు వందేసి కోట్లు పుచ్చుకుంటున్నారు. ఆ లెక్కన బాలీవుడ్‌ అగ్రహీరో షారూఖ్‌ఖాన్‌ పారితోషికం ఎంతుంటుందో ఓ అంచనా వేసుకోవచ్చు. కానీ ‘పఠాన్‌’ సినిమా కోసం షారూఖ్‌ పుచ్చుకున్న పారితోషికం కేవలం రూ. 40 కోట్లు మాత్రమే అనేది బాలీవుడ్‌ ట్రేడ్‌ వర్గాల మాట. అయితే ఇందులో ఓ మతలబు ఉంది. పారితోషికంతో పాటు లాభాల్లోనూ వాటా ఇచ్చే ఒప్పందంపైనే షారూఖ్‌ ఈ ప్రాజెక్ట్‌ను అంగీకరించారట. ‘పఠాన్‌’ సూపర్‌హిట్టవ్వడంతో పారితోషికంతో పాటు పెద్దమొత్తమే షారూఖ్‌ చేతికి అందనుందట. ఈ చిత్రంలో షారూఖ్‌ కు జంటగా దీపికా పదుకోన్‌ న టించారు. జాన్‌ అబ్రహం ప్రతినాయక పాత్రను పోషించారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించారు.

పఠాన్‌కు ప్రత్యేకాకర్షణ

సినిమా విజయానికి ఉపయోగపడుతుందునుకున్న ఏ చిన్న అంశాన్ని ‘పఠాన్‌’ టీమ్‌ వదులుకోలేదు. ఈ చిత్రంలో సల్మాన్‌ఖాన్‌ అతిథిపాత్రలో మెరవడం కూడా అందులో బాగమే. ఓ ప్రమాధంలో చిక్కుకున్న పఠాన్‌ను కాపాడేందుకు సల్మాన్‌ఖాన్‌ రంగంలోకి దిగుతాడు. ‘టైగర్‌’ పాత్రలో వచ్చి అతన్ని కాపాడి మళ్లీ తన సాయం అవసరమైనప్పుడు కబురు పంపమని పఠాన్‌కి చెప్పి వె ళ్లిపోతాడు. ఆ కొద్ది నిమిషాల యాక్షన్‌ సీక్వెన్స్‌లో సల్మాన్‌ కనిపించడం సినమాకు ప్రత్యేకాకర్షణగా నిలిచింది. సల్మాన్‌ఖాన్‌ నటించే ‘టైగర్‌’ సీక్వెల్‌లో పఠాన్‌ పాత్రలో షారూఖ్‌ కనిపించనున్నారు.

Updated Date - 2023-02-01T05:34:08+05:30 IST