R.Narayanamurthy : పేపర్‌ లీకేజీ జాతీయ విపత్తు కంటే ప్రమాదం

ABN , First Publish Date - 2023-06-06T02:16:33+05:30 IST

డప్పు సినిమాల గుండె చప్పుడు, ఉద్యమ చిత్రాల ఊపిరి... ఆర్‌.నారాయణమూర్తి. కర్షకుడి సమస్యే తన కథా వస్తువు. కార్మికుడి ఆకలి కేకే... తన సినిమాకి సంగీతం. విప్లవం ఆయన ఇంటిపేరు. పోరాటం తన తీరు...

R.Narayanamurthy : పేపర్‌ లీకేజీ జాతీయ విపత్తు కంటే ప్రమాదం

డప్పు సినిమాల గుండె చప్పుడు, ఉద్యమ చిత్రాల ఊపిరి... ఆర్‌.నారాయణమూర్తి. కర్షకుడి సమస్యే తన కథా వస్తువు. కార్మికుడి ఆకలి కేకే... తన సినిమాకి సంగీతం. విప్లవం ఆయన ఇంటిపేరు. పోరాటం తన తీరు. హంగులూ, ఆర్భాటాలే సినిమాల్ని నడిపిస్తున్న ఈ తరుణంలోనూ దీనుల కన్నీటి గాథల్ని వెండి తెరపై ఆవిష్కరిస్తున్న నిరంతర శ్రామికుడాయన. ట్రెండ్‌ మారినా, తన పంథా మార్చుకోని నైజమే ఆర్‌. నారాయణమూర్తిని ప్రత్యేకంగా నిలబెడుతోంది. ఈకోవలో ఆయన నుంచి వస్తున్న మరో చిత్రం ‘యూనివర్సిటీ’ ఈ శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా పీపుల్స్‌ స్టార్‌ ఏమన్నారంటే..

ఈ ‘యూనివర్సిటీ’ ఎందుకోసం? ఎవరి కోసం?

విద్యార్థుల కోసం. వారి భవిత కోసం. యువ శక్తిని సరిగా ఉపయోగించుకోని ఏ దేశానికీ సరైన భవిష్యత్తు ఉండదు. వాళ్లని సరైన దిశలో నడిపించే బాధ్యత ప్రభుత్వాలదే. ఈరోజు చూడండి. విద్య పూర్తిగా వ్యాపారమైపోయింది. ఎం.సెట్‌ ఫలితాలొస్తే చాలు.. ‘మాది ఫస్ట్‌ ర్యాంకు’ అంటే ‘మాదే ఫస్టు ర్యాంకు’ అని విద్యాసంస్థలన్నీ కొట్టుకుంటాయి. అమీర్‌పేట్‌కి వెళ్లి చూడండి. ఒక్క కోచింగ్‌ సెంటర్‌ కూడా ఖాళీగా ఉండదు. లక్షలకు లక్షలు డొనేషన్లు కట్టి సీట్లు కొంటున్నారు. విద్యా సంస్థలేమో ఈ ర్యాంకుల గోలలో పడిపోయి మాస్‌ కాపీయింగ్‌కి పాల్పడుతున్నాయి. పేపర్లు లీకైపోతున్నాయి. ఇది ఏపీ, తెలంగాణ సమస్య కాదు. యావత్‌ దేశంలో ఇదే తంతు. ఎక్కడ చూసినా ఇదే తీరు. పేపర్‌ లీకేజ్‌ అనేది జాతీయ విపత్తు కంటే ప్రమాదకరంగా మారింది. ఆ విషయాన్నే ఈ సినిమాలో చూపించాం. కొన్ని పరిష్కార మార్గాలూ చెప్పాం.

ప్రైవేటు కాలేజీలకు దీటుగా ప్రభుత్వ కాలేజీలూ సక్రమంగా పని చేస్తే ఈ సమస్య ఉండదు కదా?

నూటికి నూరు పాళ్లూ నిజం. కానీ ‘గవర్నమెంటు స్కూలు ఓ స్కూలు కాదు. గవర్నమెంటు ఆసుపత్రి ఓ ఆసుపత్రి కాదు..’ అన్నట్టు తయారైంది వ్యవహారం. సరైన మౌళిక వసతులు కరవయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలూ, రాజకీయ నాయకుల వారసులూ ప్రైవేటు స్కూళ్ల వైపు, ప్రైవేటు ఆసుపత్రులవైపూ పరుగులు పెడుతున్నారు. ‘మా బిడ్డల భవిష్యత్తు ప్రైవేటు కాలేజీల్లోనే బాగుంటుందేమో’ అనుకొని తల్లిదండ్రులు కూడా తమ స్థోమతకు మించి ఖర్చు పెట్టి సీట్లు కొంటున్నారు. చాలామందివి తెలుగు మీడియం చదువులే. వాళ్లలో తెలివైన వాళ్లు ఉన్నా, ఇంగ్లిషు మీడియం పిల్లలతో పోటీ పడలేకపోతున్నారు. అందుకే ఉద్యోగాల వేటలో వెనుకబడుతున్నారు. ఉద్యోగ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ జరుగుతోంది. అక్కడ పేపర్లు లీకైపోతున్నాయి. ఒకరి బదులుగా మరొకరు పరీక్షలు రాస్తున్నారు. దాంతో చదువుకొన్న వాళ్లకు, కష్టపడుతున్న వాళ్లకూ ఉద్యోగాలు రావడం లేదు. అక్రమ మార్గాల్లో వెళ్లిన వాళ్లకే ఉద్యోగాలు దక్కుతున్నాయి. వాళ్లే మన డాక్టర్లు, ఇంజనీర్లు. అలాంటప్పుడు ఈ దేశం ఎలా బాగుపడుతుంది? ఎలా ముందుకు వెళ్తుంది? ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటు పరమైపోతున్నాయి. అక్కడ రిజర్వేషన్‌లు అడిగే నాధుడు లేడు. ఎన్ని కమీషన్లు సిఫార్సు చేసినా, ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్లు ఓ కలగానే మిగిలిపోయింది.

ఇప్పటి సినిమాల్లో హంగులూ, ఆర్భాటాలకే పెద్దపీట. మీ కథల్లో అవేం ఉండవు. మరి జనాల్ని ఆకర్షించేది ఎలా..?

కన్నీటినే కథలుగా చెబుతున్నవాడ్ని. హంగులూ ఆర్భాటాలూ నాకెందుకు.? మొన్న ‘బలగం’ అనే సినిమా వచ్చింది. అందులో హంగులేమున్నాయి. గుండెని తడిపే సన్నివేశాలు, సంఘర్షణ ఉంటే చాలు. నా సినిమాల్లో అవి తప్పకుండా ఉంటాయి. కథల్లో జీవితం ఉంటే చాలు ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతారు.

మీకున్న పరిచయాల్ని ఉపయోగించుకొంటే, పేరున్న నటీనటులు మీ సినిమాల్లో నటించడానికి ముందుకొస్తారు. మరి ఆ అవకాశాన్ని వాడుకోరెందుకు?

ఇది వరకు నా చిత్రాల్లో కొంతమంది పేరున్న వాళ్లు నటించారు. ఇప్పటికీ నేను అడిగితే ఎవ్వరూ కాదనరు. కానీ నేనెప్పుడూ నా పాత్రకు ఎవరు కావాలో వాళ్లనే తీసుకొంటా. నేనూ ఒకప్పుడు వేషం కోసం.. ఊరొదిలి వచ్చినవాడినే. నాలా చాలామంది అవకాశాల కోసం ఆశగా ఎదురు చూస్తుంటారు. వాళ్లని సినిమాలో తీసుకొంటే నాకో సంతృప్తి ఉంటుంది. నాదంతే డిఫరెంట్‌ స్కూల్‌. ఈ స్కూల్‌ని ఎప్పటి నుంచో అలవాటు పడిపోయాను. ఇక ఆ అలవాటు మారదు.

Updated Date - 2023-06-06T02:16:33+05:30 IST