Pan India is losing count! : పాన్ ఇండియా లెక్క తప్పుతోంది!
ABN , First Publish Date - 2023-11-01T03:32:09+05:30 IST
పాన్ ఇండియా సినిమా అనేది ప్రస్తుతం ఓ పరిభాష అయిపోయింది. ఏ సినిమా మొదలెట్టినా.. మాది పాన్ ఇండియా సినిమా.. అంటూ ఢంకా బజాయించి చెబుతున్నారు దర్శక నిర్మాతలు. అన్నట్టుగానే...

పాన్ ఇండియా సినిమా అనేది ప్రస్తుతం ఓ పరిభాష అయిపోయింది. ఏ సినిమా మొదలెట్టినా.. మాది పాన్ ఇండియా సినిమా.. అంటూ ఢంకా బజాయించి చెబుతున్నారు దర్శక నిర్మాతలు. అన్నట్టుగానే... అన్ని రకాల భాషల్లోనూ టైటిళ్లు మార్చి పోస్టర్లు దంచి కొడుతున్నారు. కానీ విడుదల సమయంలో మాత్రం తెలుగుకే పరిమితం అవుతున్నారు. మిగిలిన భాషల్లో విడుదల చేసినా.. కొన్ని ప్రింట్లతోనే సరిపెడుతున్నారు. ఒకవేళ భారీ స్థాయిలో విడుదల చేసినా... అక్కడ వసూళ్లు రావడం లేదు. కొన్నాళ్లుగా చిత్రసీమలో కనిపిస్తోన్న పోకడ ఇది. భారీ చిత్రాలకు సైతం పాన్ ఇండియా మార్కెట్లో అడ్రస్సులు గల్లంతవుతున్నాయి.
పోస్టర్ పైనే మారుతున్న భాషలు ఫ ఎక్కడా కానరాని వసూళ్లు
పాన్ ఇండియా అనేది ఓ లక్కీ లాటరీ అయిపోయింది. ఏ సినిమా ఎన్ని భాషల్లోనూ ఆడుతుందో, ఏది వసూళ్లు రాబట్టుకొంటుందో చెప్పలేని పరిస్థితి. పుష్పకి నార్త్‌లో మంచి వసూళ్లు దక్కాయి. అయితే.. ఈ సినిమాకి ఈ స్థాయి కలక్షన్లు వస్తాయని చిత్రబృందమే ఊహించలేదు. కనీసం.. పాన్ ఇండియా స్థాయిలో గట్టిగా ప్రమోషన్లు చేయలేదు. కానీ... నార్త్‌లో భారీ వసూళ్లు దక్కించుకొంది. అల్లు అర్జున్‌కి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. ఇప్పుడు ‘పుష్ప2’ కోసం బాలీవుడ్ సైతం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ‘కార్తికేయ2’ పరిస్థితీ అంతే. ఈసినిమా కాస్త లేటుగా బాలీవుడ్‌కి వెళ్లింది. అక్కడ ఊహించని స్థాయిలో వసూళ్లు దక్కించుకొంది. ఈ రెండు చిత్రాలూ.. తెలుగు సినిమా ‘పాన్ ఇండియా’ కలలకు కొత్త రెక్కలిచ్చాయి. ఆ తరవాత వచ్చిన ప్రతీ సినిమా.. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ సీమల్లో సత్తా చూపించాలని భావించింది. కానీ... ఏ సినిమాకీ ఆశించిన స్థాయిలో వసూళ్లు దక్కలేదు.
లైగర్‌తో.. విజయ్ దేవరకొండ బాలీవుడ్‌లో తన సత్తా చూపించాలని భావించాడు. మైక్ టైసన్ లాంటి సెలబ్రెటీని సినిమాలో తీసుకోవడానికి ప్రధాన కారణం అదే. కానీ.. లైగర్ లెక్క తప్పింది. బాలీవుడ్‌లో ఈ సినిమాని ఎవరూ పట్టించుకోలేదు. ఆఖరికి తెలుగులోనూ వసూళ్లు సాధించలేకపోయింది. ఇటీవల విడుదలైన ‘ఖుషి’కి సైతం హిందీ వెర్షన్ విడుదల చేస్తామని చెప్పారు. కానీ... ఆ ప్రయత్నాలేం సజావుగా సాగినట్టు కనిపించలేదు. అన్ని భాషల్లోనూ పాటలు విడుదల చేసి హడావుడి చేసినా, థియేట్రికల్ రిలీజ్ విషయంలో మాత్రం చిత్రబృందం పెద్దగా ఆసక్తి చూపించలేదు.
రవితేజ నటించిన తొలి పాన్ ఇండియా సినిమాగా ‘టైగర్ నాగేశ్వరరావు’కి భారీ ఎత్తున ప్రచారం చేశారు నిర్మాతలు. ఈ సినిమా కోసం రవితేజ తొలిసారి హిందీలో డబ్బింగ్ చెప్పారు. బాలీవుడ్ వెళ్లి గట్టిగా ప్రచారం చేశారు. అక్కడ కొన్ని షోలలోనూ పాల్గొన్నారు. కానీ... టైగర్ బాలీవుడ్‌లో నిలదొక్కుకోలేకపోయింది. అక్కడ కనీసం కోటి రూపాయల వసూళ్లు కూడా దక్కించుకోలేని పరిస్థితి. కొన్ని థియేటర్లలో రెండో రోజే సినిమాని తీసేశారని ట్రేడ్ వర్గాలు చెప్పాయి. కనీసం.. పబ్లిసిటీ ఖర్చులు కూడా రాలేదు. ‘కార్తికేయ2’ బాలీవుడ్‌లో మంచి వసూళ్లు సాధించడంతో.. నిఖిల్ తదుపరి చిత్రం ‘స్పై’ని సైతం బాలీవుడ్‌లో విడుదల చేశారు. అయితే ఈసారి... నిఖిల్‌కి నిరాశే ఎదుకైంది. ‘స్పై’ తెలుగులోనూ కాదు... బాలీవుడ్‌లోనూ డిజాస్టర్‌గా మిగిలింది. వరుణ్‌తేజ్ కూడా బాలీవుడ్‌లో తన సత్తా చూపించాలనుకొంటున్నాడు. తను నటించిన ‘గాండీవధారి అర్జున’ని బాలీవుడ్‌లో రిలీజ్ చేద్దామనుకొన్నారు. ఇది కూడా పాన్ ఇండియా సినిమా అనే ప్రచారం చేశారు. కానీ.. చివరి దశలో ఆ ప్రయత్నాన్ని విరమించుకొన్నారు. ఫ్యామిలీమెన్ వెబ్ సిరీస్ తరవాత సమంతకు బాలీవుడ్‌లో కాస్త పాపులారిటీ దక్కింది. దాన్ని క్యాష్ చేసుకొనే ప్రయత్నాలు చేశారు నిర్మాతలు. సమంత నటించిన ‘యశోద’, ‘శాకుంతలం’ చిత్రాల్ని హిందీలో నేరుగా విడుదల చేశారు. కానీ ప్రేక్షకులు ఈ సినిమాల్ని ఏమాత్రం పట్టించుకోలేదు.
పాన్ ఇండియా అనే ట్యాగ్ లైన్ తగిలించుకోవడం సులభమే. కానీ.. ఆ స్థాయిలో సినిమాకి ఆదరణ దక్కాలంటే మాత్రం కథలో సత్తా ఉండాల్సిందే. ప్రేక్షకుల అభిరుచులు ఒక్కో చోట ఒక్కోలా ఉంటాయి. తెలుగు ప్రేక్షకుల ఇష్టాలు వేరు, బాలీవుడ్ ప్రేక్షకుల ఆలోచనలు వేరు. తమిళ, కన్నడ, మలయాళ సీమల్లోనూ అంతే! పాన్ ఇండియా సినిమా తీయాలి, అన్ని చోట్లా మెప్పించాలి అనుకొని సినిమాలు తీస్తే.. అవి చెల్లవు. సినిమాలో ఏదో ఓ విషయానికి ప్రేక్షకులు ఆకర్షితులవుతుంటారు. అప్పుడు పాన్ ఇండియా ఆలోచనలు ఉన్నా, లేకున్నా.. ఆయా సినిమాలు అన్ని చోట్లా ఆదరణ పొందుతాయి. ‘కాంతార’ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టాలని ఆ దర్శక నిర్మాతలు ముందుగా అనుకోలేదు. సినిమా విడుదలై, హిట్టయ్యాక, మౌత్ టాక్‌ని బట్టి ఆ సినిమా అన్ని భాషల్లోనూ వెళ్లింది. అఖండ విజయాన్ని అందుకొంది. ఈ విషయాన్ని దర్శక నిర్మాతలు దృష్టిలో ఉంచుకొంటే మంచిది.