విశ్వనాథ్‌పై ఆగ్రహించిన ఎన్టీఆర్‌

ABN , First Publish Date - 2023-02-04T04:32:12+05:30 IST

చిత్ర పరిశ్రమలోకి రాకముందు నుంచే ఎన్టీఆర్‌ తో విశ్వనాథ్‌కు పరిచయం ఉంది.

విశ్వనాథ్‌పై ఆగ్రహించిన ఎన్టీఆర్‌

చిత్ర పరిశ్రమలోకి రాకముందు నుంచే ఎన్టీఆర్‌ తో విశ్వనాథ్‌కు పరిచయం ఉంది. గుంటూరు ఏ సీ కాలేజ్‌ లో ఇంటర్‌, హిందూ కాలేజ్‌లో డిగ్రి చదివారు విశ్వనాథ్‌. హిందూ కాలేజ్‌లో ఎన్టీఆర్‌ ఆయనకు సీనియర్‌. చదువు పూర్తయిన తర్వాత గుంటూరు సబ్‌ రిజిస్ర్టార్‌ ఆఫీస్‌ లో ఉద్యోగిగా చేరారు ఎన్టీఆర్‌. ఆయన రోజూ విజయవాడ నుంచి ట్రైన్‌ లో గుంటూరు వస్తుండే వారు. కాలేజీకి వెళ్ళడం కోసం అదే ట్రైన్‌ ఎక్కేవారు విశ్వనాథ్‌. అలా రైలు పరిచయం వీరిద్దరిది. ఆ తర్వాత ఎన్టీఆర్‌ మద్రాస్‌ వెళ్లి సినిమా హీరో అయ్యారు. విశ్వనాథ్‌ వాహినీ స్టూడియోలో సౌండ్‌ ఇంజనీర్‌ గా చేరారు. వాహినీ స్టూడియోలో తరచూ కలుసుకుంటూ పాత పరిచయం కొనసాగించారు ఇద్దరూ. ఎన్టీఆర్‌, విశ్వనాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన నాలుగో చిత్రం ‘చిన్ననాటి స్నేహితులు’. ఈ చిత్రనిర్మాణంలో జరిగిన ఓ సంఘటన కారణంగా ఎన్టీఆర్‌, విశ్వనాథ్‌ల మధ్య దూరం పెరిగింది. ఈ చిత్రం కోసం ఓ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. కూలింగ్‌ గ్లాసె్‌సతో ఎన్టీఆర్‌ సెట్‌లోకి వచ్చారు. ‘ఇది సెంటిమెంట్‌ సీన్‌ కనుక నల్ల కళ్లజోడు ఉంటే బాగుండదు’ అని అభ్యంతరం చెప్పారు విశ్వనాథ్‌. పరవాలేదు బాగుంటుందని ఎన్టీఆర్‌ అన్నారు. దీని గురించి వారిద్దరి మధ్య వాదన పెరిగింది. ఇదంతా గమనించిన నిర్మాత డి.వి.ఎస్‌. రాజు విశ్వనాథ్‌కు నచ్చజెప్పారు. నల్లకళ్లజోడుతోనే ఎన్టీఆర్‌ ఆ షాట్‌లో పాల్గొన్నారు. ఈ సంఘటన కారణంగా విశ్వనాథ్‌ మీద ఎన్టీఆర్‌ ఆగ్రహించారు. నిజం చెప్పాలంటే ఎస్‌ వి ఎస్‌ ఫిల్మ్స్‌ నిర్మించిన డబ్బుకు లోకం దాసోహం చిత్రానికి విశ్వనాధ్‌ దర్శకత్వం వహించాలి. ఈ చిత్ర కథ తయారయ్యే వరకు ఆయన ఉన్నారు. కానీ ఎన్టీఆర్‌ ఆగ్రహానికి గురి కావడంతో విశ్వనాథ్‌ను తీసేసి యోగానంద్‌ను దర్శకుడిగా పెట్టుకున్నారు ఎస్‌ వి ఎస్‌ ఫిల్మ్స్‌ అధినేతలు. ఇది జరిగిన దాదాపు 14 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్‌ తనయుడు బాలకృష్ణతో జననీ జన్మభూమి చిత్రాన్ని రూపొందించారు విశ్వనాథ్‌. అయితే ఈ చిత్రం ప్లాప్‌ అయ్యింది.

Updated Date - 2023-02-04T04:35:12+05:30 IST