జన్మతో కాదు.. కర్మతో చిన్నా పెద్దా అవుతాం
ABN , First Publish Date - 2023-05-10T00:43:01+05:30 IST
శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ చిత్రం టీజర్ చూసి చాలా మంది పెదవి విరిచారు. రామాయణంలో పాత్రలను ఇలాగేనా చూపించడం అని మండిపడ్డారు...

శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ చిత్రం టీజర్ చూసి చాలా మంది పెదవి విరిచారు. రామాయణంలో పాత్రలను ఇలాగేనా చూపించడం అని మండిపడ్డారు. ఈ విమర్మలతో యూనిట్ అప్రమత్తమైంది. అందుకే కొంచెం సమయం తీసుకుని ట్రైలర్ రూపొందించారు. సోమవారం హైదరాబాద్ ఏ.ఎం.బి మాల్‌లో జరిగిన ట్రైలర్ ప్రీవ్యూ కు మూవీ టీమ్ హాజరైంది. హనుమంతుడి కోణం నుంచి సాగే కథలా ఈ ట్రైలర్ ఆరంభమైంది. ‘ఇది నా రాముడి కథ. ఆయన మనిషిగా పుట్టి భగవంతుడైన మహనీయుడు’ అంటూ హనుమంతుడి మాటలు నేపథ్యంలో వినిపిస్తుండగా సీతాపహరణం, వానర సైన్యంతో రాముడు లంక చేరడం, రామ రావణ యుద్ధ సన్నివేశాలు వంటివి చూపిస్తూ కథ సాగుతుంది. ఆధునిక టెక్నాలజీని వాడి ఈ సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారు. అలాగే ‘నా ప్రాణమే జానకిలో ఉంది. నా ప్రాణాలకన్నా మర్యాదే అధిక ప్రియమైనది’, ‘మనం జన్మతో కాదు.. చేసే కర్మతో చిన్నా పెద్దా అవుతాం’ అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగులు కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్‌లోని విజువల్ ఎఫెక్ట్స్ , పాత్రల పరిచయం అలరించాయి. సాంకేతికంగా అత్యున్నతంగా ‘ఆదిపురుష్’ ఉండబోతోందన్న భావనను ట్రైలర్ కలిగించింది. జూన్ 18న ఈ సినిమా విడుదల కానుంది. సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించిన ఈ చిత్రాన్ని టీ సిరీస్ సంస్థతో కలసి యూవీ క్రియేషన్స్ నిర్మించింది. ఓం రౌత్ దర్శకుడు.