ఎన్‌ఐఏ నుంచి ఎలాంటి సమన్లు అందలేదు
ABN, First Publish Date - 2023-08-30T04:51:32+05:30
డ్రగ్స్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణకు సంబంధించి తనకు సమన్లు జారీ అయ్యాయంటూ వస్తున్న వార్తలను నటి వరలక్ష్మి ఖండించారు. ఈ మేరకు ఆమె మంగళవారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు...
డ్రగ్స్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణకు సంబంధించి తనకు సమన్లు జారీ అయ్యాయంటూ వస్తున్న వార్తలను నటి వరలక్ష్మి ఖండించారు. ఈ మేరకు ఆమె మంగళవారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. తనకెలాంటి సమన్లు జారీ కాలేదని, విచారణకు హాజరు కావాలంటూ తనను ఏ దర్యాప్తు సంస్థా పిలవలేదని ఆమె స్పష్టం చేశారు. ఆదిలింగం అనే వ్యక్తి తన వద్ద మూడేళ్ల క్రితం కొద్దికాలం మాత్రమే ఫ్రీలాన్స్ మేనేజర్‌గా పని చేశాడని, ఆ తరువాత అతనితో తనకెలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ వార్తలు తనను దిగ్ర్భాంతికి గురి చేశాయని, ఒకవేళ ప్రభుత్వానికి సహకరించాల్సిన అవకాశం వస్తే తాను సంతోషిస్తానన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా సెలబ్రిటీలను వార్తలోకి లాగడం తనను నిరాశపరిచిందని వరలక్ష్మి పేర్కొన్నారు. గతంలో కేరళ రాష్ట్రంలోని విళింజియం బీచ్‌లో 300 కేజీల హెరాయిన్, ఏకే 47 తుపాకీ, తూటాల అక్రమ రవాణా కేసులో ఆదిలింగం అనే వ్యక్తిని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టిన అధికారులు.. అతనికి డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా కీలక నేత గుణశేఖరన్‌తో సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. పైగా డ్రగ్స్ స్మగ్లింగ్‌లో లభించిన నిధులను ఆదిలింగం సినిమాలకు పెట్టుబడిగా పెట్టినట్లు ఎన్‌ఐఏ విచారణలో తేలింది. ఇదిలా వుండగా ఆదిలింగం నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌కు ఫ్రీలాన్స్ మేనేజర్‌గా కూడా పనిచేశారు. దీంతో ఆదిలింగం గురించి వివరాల సేకరణలో భాగంగా వరలక్ష్మికి ఎన్‌ఐఏ ఈ సమన్లు పంపిందంటూ వస్తున్న వార్తలు కోలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతున్నాయి.
ఆంధ్రజ్యోతి, చెన్నై