New heroines are coming : కొత్త హీరోయిన్లు వస్తున్నారు
ABN , First Publish Date - 2023-08-09T04:15:56+05:30 IST
బాలీవుడ్‌లో స్టార్‌కిడ్స్ హవా గురించి తెలిసిందే. వారసత్వాన్ని అడ్డం పెట్టుకొని పరిశ్రమలో స్థానం సంపాదించారనే విమర్శలు ఉన్నా వారి జోరు తగ్గడం లేదు. బాలీవుడ్‌లో అగ్ర స్థాయి దక్కించుకున్న...

బాలీవుడ్‌లో స్టార్‌కిడ్స్ హవా గురించి తెలిసిందే. వారసత్వాన్ని అడ్డం పెట్టుకొని పరిశ్రమలో స్థానం సంపాదించారనే విమర్శలు ఉన్నా వారి జోరు తగ్గడం లేదు. బాలీవుడ్‌లో అగ్ర స్థాయి దక్కించుకున్న హీరోలు, హీరోయిన్ల వారసులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడే అదే కోవలో పలువురు సినీ ప్రముఖుల కూతుళ్లు హీరోయిన్స్‌గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.
‘కేజీఎఫ్ 2’చిత్రంలో ప్రధాన మంత్రి పాత్రలో ఫైర్ చూపించారు ప్రముఖ బాలీవుడ్ నటి రవీనాటాండన్. యశ్‌కు పోటీగా నటించి ప్రశంసలు అందుకున్నారు. 90ల్లో బాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా వెలిగిపోయారు. తర్వాత నిర్మాత అనిల్ తడానీని ఆమె వివాహం చేసుకున్నారు. వీరి కూతురు రాషా ఇప్పుడు వెండితెర ఎంట్రీకి సిద్ధమయ్యారు. అజయ్ దేవగణ్ మేనల్లుడు అమన్ దేవ్‌గణ్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాతో రాషా టాండన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. అజయ్ దేవ్‌గణ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. రాషా గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. తైక్వాండోలో బ్లాక్‌బెల్ట్ సాధించారు. సంగీతంలో ప్రవేశం ఉంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రాషా అందం అణుకువలో అమ్మను మించి పోయిందని, స్టార్ హీరోయిన్‌లకు ఏ మాత్రం తీసిపోదని అప్పుడే అభిమానులు ప్రశంసిస్తున్నారు.
తండ్రి నిర్మాతగా
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్‌ఖాన్ తనయ సుహానా ఖాన్ వెండితెర ఎంట్రీకి రంగం సిద్ధం అయింది. జోయా అక్తర్ దర్శకత్వంలో ‘ది ఆర్చిస్’ అనే చిత్రంలో ఆమె నటిస్తున్నారు. నవంబర్‌లో ఓటీటీలో విడుదలవుతోంది. 1964 నేపథ్యంలో సాగే కథ ఇది. సుహానా వెండితెర ఎంట్రీ కోసం షారూఖ్ భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ టాక్. తనకు ‘పఠాన్’ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌తో కలసి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారట. ఇందులో షారూఖ్ అతిథి పాత్రలో నటిస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారు.
రోషన్ కుటుంబం నుంచి
హృతిక్ రోషన్ సోదరి, రాజేశ్ రోషన్ కూతురు పష్మినా రోషన్ బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ‘ఇష్క్ విష్క్ 2’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. షాహిద్‌కపూర్, అమృతరావు జంటగా నటించిన ‘ఇష్క్ విష్క్’కు ఇది సీక్వెల్. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. పష్మినా ఈ చిత్రంలో జిబ్రాన్‌ఖాన్‌కు జోడీగా కనిపించబోతున్నారు.
అమ్మబాటలో
ప్రముఖ నటి పూనమ్ ధిల్లోన్, నిర్మాత అశోక్ తకేరియా కుమార్తె పలోమా ‘దోనో’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంతోనే ప్రముఖ దర్శకుడు సూరజ్ ఆర్. బర్జాత్యా కుమారుడు అవ్నీష్ ఎస్. బర్జాత్యా దర్శకుడిగా, సన్నీడియోల్ చిన్న కుమారుడు రాజీవ్ డియోల్ హీరోగా పరిచయం అవుతున్నారు.