National Awards Festival : జాతీయ పురస్కారాల పండగ
ABN , First Publish Date - 2023-10-18T03:08:00+05:30 IST
జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కన్నులపండగగా జరిగింది. ఈసారి తెలుగు చిత్రాలు పలు విభాగాల్లో పురస్కారాలను కైవసం చేసుకోవడంతో పలువురు...

జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కన్నులపండగగా జరిగింది. ఈసారి తెలుగు చిత్రాలు పలు విభాగాల్లో పురస్కారాలను కైవసం చేసుకోవడంతో పలువురు తెలుగు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో తళుక్కున మెరిశారు. 2021 గానూ పురస్కార విజేతల వివరాలను ఇటీవలే కేంద్రం ప్రకటించింది. విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలను ప్రదానం చేశారు. టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు. ఈ వేడుకకు ఆయన సతీమణి అల్లు స్నేహ కూడా హాజరయ్యారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం ఆరు విభాగాల్లో జాతీయ పురస్కారాలను గెలుచుకుంది. ఉత్తమ వినోదాత్మక చిత్రం విభాగంలో దర్శకుడు రాజమౌళి పురస్కారాన్ని అందుకున్నారు. ఉత్తమ కొరియోగ్రాఫర్ (నాటు నాటు)గా ప్రేమ్ రక్షిత్, ఉత్తమ సంగీత దర్శకుడు (నేపథ్య సంగీతం) ఎం.ఎం. కీరవాణి, గాయకుడిగా కాలభైరవ (కొమరం భీముడో), ఉత్తమ యాక్షన్ డైరెక్టర్ కింగ్ సోలమన్, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్‌కు గాను శ్రీనివాస్ మోహన్ రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు స్వీకరించారు. ఉత్తమ గేయ రచయిత(కొండపొలం-ధమ్ ధమ్)గా చంద్రబోస్ పురస్కారం అందుకున్నారు. ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ (పాటలు-పుష్ప), ఉత్తమ తెలుగు చిత్రం ‘ఉప్పెన’కి గాను నిర్మాత నవీన్, దర్శకుడు బుచ్చిబాబు అవార్డు అందుకున్నారు. ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం (ది కశ్మీర్ ఫైల్స్)కు గాను నిర్మాత అభిషేక్ అగర్వాల్ అవార్డు స్వీకరించారు. ఉత్తమ చిత్ర విమర్శకుడి పురస్కారాన్ని ఎం. పురుషోత్తమాచార్యులు అందుకున్నారు. జాతీయ ఉత్తమ చిత్రం ‘రాకెట్రీ’కి గానూ మాధవన్, ఉత్తమ గాయని (ఇరవిన్ నిహాల్)గా శ్రేయాఘోషల్ పురస్కారాలను అందుకున్నారు. బాలీవుడ్ కథానాయికలు అలియాభట్, కృతీసనన్ సంయుక్తంగా ఉత్తమ నటి పురస్కారాన్ని స్వీకరించారు.
అలియాభట్ తన పెళ్లి నాటి చీరను ధరించి సందడి చేశారు. ఆమె పురస్కారాన్ని అందుకుంటున్న క్షణాలను భర్త రణ్‌బీర్‌కపూర్ కెమెరాలో బంధించి మురిసిపోయారు. బాలీవుడ్ సీనియర్ నటి వహీదా రెహ్మాన్‌కు దాదా సాహెబ్ ఫాల్కే జీవన సాఫల్య పురస్కారాన్ని ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు పురస్కారాలను అందుకున్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.