పెళ్లి చేసుకొన్నారా? లేదా?

ABN , First Publish Date - 2023-03-11T00:57:14+05:30 IST

సీనియర్‌ నటుడు నరేశ్‌, పవిత్రా లోకేశ్‌ మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘మేమిద్దరం మంచి స్నేహితులం’ అంటూ నరేశ్‌ చాలాసార్లు చెప్పారు.

పెళ్లి చేసుకొన్నారా? లేదా?

సీనియర్‌ నటుడు నరేశ్‌, పవిత్రా లోకేశ్‌ మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘మేమిద్దరం మంచి స్నేహితులం’ అంటూ నరేశ్‌ చాలాసార్లు చెప్పారు. ‘మేం త్వరలో కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నాం’ అంటూ ఆమధ్య ఓ వీడియో కూడా విడుదల చేశారు. అప్పటి నుంచీ నరేశ్‌, పవిత్ర పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. శుక్రవారం ఉదయం నరేశ్‌ పెళ్లి వీడియోని విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘‘ఒక పవిత్ర బంధం.. రెండు మనసులు.. మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. మీ ఆశీస్సులు కోరుకొంటూ నరేశ్‌, పవిత్ర’’ అంటూ కామెంట్‌ కూడా జోడించారు. దాంతో.. నరేశ్‌, పవిత్రల పెళ్లయిపోయిందనుకొన్నారంతా. కానీ తీరా చూస్తే నరేశ్‌ మాట మార్చి.. అందరినీ గందరగోళంలో పడేశారు. శుక్రవారం సాయంత్రం ఓ సినిమా వేడుకకు నరేశ్‌ హాజరయ్యారు. ‘పెళ్లి భోజనం ఎప్పుడు పెడతారు’ అని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానం ఇవ్వలేదు. ‘‘పెళ్లి అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం. నేనెప్పుడూ మీడియాకు అందుబాటులో ఉండే వ్యక్తినే. త్వరలో ప్రత్యేకంగా ఓ ప్రెస్‌ మీట్‌ పెట్టి అన్ని విషయాలూ వెల్లడిస్తా’’ అన్నారు. నరేశ్‌ విడుదల చేసిన పెళ్లి వీడియోలో చాలా విషయాలు క్లారిటీగా లేవు. పెళ్లి ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది? అనేది చెప్పలేదు. దానికి తోడు.. వీడియో పూర్తిగా సినిమాటిక్‌గా సాగిపోయింది. దాంతో ఇదంతా సినిమా కోసం ప్రచారమేమో అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మాజీ భార్య రమ్యతో నరేశ్‌ వివాదాలు ఇంకా సమసిపోలేదు. ఈ నేపథ్యంలో మరో పెళ్లి చేసుకొంటే నరేశ్‌కి చట్టపరంగా కొత్త తలనొప్పులు వస్తాయనీ, అందుకే ఈ విషయంలో మీడియానీ, సన్నిహితుల్ని, మాజీ భార్యని సైతం నరేశ్‌ అయోమయానికి గురి చేస్తున్నారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

Updated Date - 2023-03-11T00:57:16+05:30 IST