మ్యూజిక్ అనేది ఓ టెక్నిక్... టెక్నాలజీ కాదు..
ABN, First Publish Date - 2023-02-15T00:24:26+05:30
సినిమా పాటలనీ ముందుగా నేను విన్న తరువాతనే మీరు వింటారు’ అని అన్నారు సుప్రసిద్ధ సంగీత దర్శకులు ఇళయరాజా. ఈ నెల 26వ తేదీన గచ్చిబౌలి స్టేడియంలో రాజా లైవ్ ఇన్ కాన్సర్ట్‌ను ఆయన చేయబోతున్నారు...
సినిమా పాటలనీ ముందుగా నేను విన్న తరువాతనే మీరు వింటారు’ అని అన్నారు సుప్రసిద్ధ సంగీత దర్శకులు ఇళయరాజా. ఈ నెల 26వ తేదీన గచ్చిబౌలి స్టేడియంలో రాజా లైవ్ ఇన్ కాన్సర్ట్‌ను ఆయన చేయబోతున్నారు. హైదరాబాద్ టాకీస్ సంస్థ చేస్తోన్న ఈ కార్యక్రమ విశేషాలను తెలియజేయడానికి టీ-హబ్‌లో ఓ సమావేశం ఏర్పాటుచేశారు. తెలంగాణా ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, గాయని సునీత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇళయరాజా మాట్లాడుతూ ప్రతి తల్లి తన బిడ్డలకు రుచికరమైన ఆహారాన్ని అందించాలని తపిస్తుంటుంది. అలా అమ్మలా మీకు మంచి సంగీతం అందించాలని చేసిన ప్రయత్నం కారణంగానే నా నుంచి మంచి పాటలు వచ్చాయి. నేను చేసిన పాటలన్నీ అభిమానుల కోసమే. ఈ నెల 26న హైదరాబాద్ వస్తున్నది కూడా ఆ అభిమానుల కోసమే. దాదాపు 80 మంది సింగర్స్, ఆర్కెస్ట్రా బృందంతో మళ్లీ హైదరాబాద్ వస్తా. ఆ రోజు హైదరాబాద్ మొత్తం అక్కడే ఉండాలి. పాటలతో అదిరిపోవాలి. ’అని ఆయన అన్నారు.
‘అప్పటి యువతే కాదు ఇప్పటి యువత కూడా ఇళయరాజా పాటలకు బాగా కనెక్ట్ అవుతుంటారు. ఇదెలా సాధ్యం?’ అని ప్రశ్నిస్తే, ‘అందరూ మనుషులే కదా’ అని నవ్వేశారు ఇళయరాజా. ‘ఇప్పుడంతా టెక్నాలజీ, టెక్నాలజీ అంటున్నారు. మ్యూజిక్ మాత్రం టెక్నాలజీ కాదు.. అది ఓ టెక్నిక్.. ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే అది టెక్నాలజీ. మ్యూజిక్ కంపోజర్ ఏం అనుకుంటాడో దాన్ని బయటకు తీసుకురాగలిగే టెక్నిక్ సంగీతం. టెక్నిక్ లేకపోతే టెక్నాలజీ లేదు. మ్యూజిక్ కంపోజర్ పాట ఇచ్చాడు కాబట్టే ప్రోగ్రామింగ్ చేసి పాటలను ఇస్తున్నారు. పాట లేకపోతే వారు ప్రోగ్రామింగ్ ఎలా చేస్తారు?’ అని ఇళయరాజా ప్రశ్నించారు.