Music director Raj passed away : సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూత
ABN , First Publish Date - 2023-05-22T03:46:36+05:30 IST
సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. తెలుగు సినిమా రంగంలో తనదైన ముద్రవేసిన సంగీత దర్శకుడు రాజ్ (68) ఆదివారం కన్నుమూశారు. హైదరాబాద్, కూకట్‌పల్లిలోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు...

సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. తెలుగు సినిమా రంగంలో తనదైన ముద్రవేసిన సంగీత దర్శకుడు రాజ్ (68) ఆదివారం కన్నుమూశారు. హైదరాబాద్, కూకట్‌పల్లిలోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. రాజ్ కు భార్య ఉష, కుమార్తెలు దివ్య, దీప్తి, శ్వేత ఉన్నారు. ఆయన అంత్యక్రియలు సోమవారం ఫిలింనగర్, మహాప్రస్థానం శ్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
రాజ్ పూర్తిపేరు తోటకూర వెంకట సోమరాజు. వారి తండ్రి టి. వి రాజు కూడా సంగీత దర్శకులే. కెరీర్ ఆరంభం నుంచే రాజ్-కోటి కలసి పనిచేశారు. 80, 90వ దశకాల్లో తెలుగు ప్రజలను తమ సంగీతంతో అలరించారు. ‘ప్రళయ గర్జన’ చిత్రంతో వీరి సంగీత ప్రయాణం మొదలైంది. ‘యముడికి మొగుడు’ చిత్రంతో సంగీత దర్శకులుగా మంచి పేరు సంపాదించారు. ఇద్దరూ కలసి 150కు పైగా చిత్రాలకు సంగీతం అందించారు. ‘ముఠామేస్త్రి’, ‘బావా బావమరిది’, ‘గోవిందా గోవిందా’ లాంటి పలు చిత్రాలను తమ ప్రతిభతో మ్యూజికల్ హిట్స్‌గా నిలిపారు. పలు ప్రైవేట్ ఆల్బమ్స్ రూపొందించారు. ‘హలో బ్రదర్’ చిత్రానికి ఈ సంగీత ద్వయం నంది పురస్కారం అందుకొంది. అభిప్రాయ భేదాలతో కోటి నుంచి విడిపోయాక రాజ్ సొంతంగా కొన్ని సినిమాలకు సంగీతం అందించారు. కొన్ని సినిమాల్లో నటించారు. రాజ్ మరణంతో టాలీవుడ్ చిత్రపరిశ్రమలో విషాద చాయలు అలుముకున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం ప్రకటించారు.
సంగీత ప్రపంచానికి తీరని లోటు
ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ ఇకలేరనే వార్త దిగ్ర్భాంతికి గురి చేసింది. ఆయన ఎంతో ప్రతిభావంతుడు. నా కెరీర్ తొలినాళ్లలో వారందించిన బాణీలు ప్రజాదరణ పొందడమే గాక సినిమా విజయంలోనూ కీలకపాత్ర పోషించాయి. నన్ను ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి. ఆయన మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు.
చిరంజీవి
పాటల రూపంలో జీవించే ఉంటాడు
మేం ఇద్దరం ఎంతో కష్టపడి రాజ్-కోటి పేరుతో ఎన్నో సూపర్‌హిట్ సాంగ్స్ ఇచ్చాం. మరెన్నో సినిమాలకు కలసి నేపథ్య సంగీతం అందించాం. నా రాజ్ లేడంటే నా కుడిభుజం పోయినట్లే. మేము విడిపోయి ఉండాల్సింది కాదు. కాలప్రవాహంలో అలా జరిగింది. ఇప్పటికీ చాలామంది నన్ను రాజ్-కోటి అనే పిలుస్తారు. అది మేం ఇద్దరం సంపాదించుకున్న పేరు. ఈ రోజు నా రాజ్ లేకపోయినా సంగీత ప్రియుల గుండెల్లో మా పాటల రూపంలో ఎప్పటికీ జీవించే ఉంటాడు.
కోటి