హనుమంతుడి స్ఫూర్తితో మహేశ్‌ బాబు పాత్ర

ABN , First Publish Date - 2023-04-13T03:38:04+05:30 IST

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి అంతర్జాతీయంగా ఖ్యాతి లభించడం, అందులోని ‘నాటునాటు’ పాటకు ఆస్కార్‌ అవార్డ్‌ రావడంతో చిత్ర దర్శకుడు రాజమౌళి పేరు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మారుమోగిపోతోంది...

హనుమంతుడి స్ఫూర్తితో మహేశ్‌ బాబు పాత్ర

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి అంతర్జాతీయంగా ఖ్యాతి లభించడం, అందులోని ‘నాటునాటు’ పాటకు ఆస్కార్‌ అవార్డ్‌ రావడంతో చిత్ర దర్శకుడు రాజమౌళి పేరు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మారుమోగిపోతోంది. ఆయన ఇప్పుడు మహేశ్‌బాబు హీరోగా రూపొందించే జంగిల్‌ అడ్వెంచర్‌ మేకింగ్‌ పై దృష్టి సారించారు. ప్రస్తుతం ఈ సినిమా స్ర్కిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. ఈ ఏడాది చివరకు షూటింగ్‌ మొదలయ్యే అవకాశం ఉంది. మహేశ్‌బాబు నటించే తొలి పాన్‌ ఇండియా సినిమా ఇదే. 2025లో విడుదల చేయాలనే ఆలోచన దర్శకనిర్మాతలకు ఉంది. రామాయణంలోని హనుమంతుడి స్ఫూర్తితో మహేశ్‌ బాబు క్యేరెక్టర్‌ ఉంటుందనే వార్త ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. మహా బలశాలి అయిన ఆంజనేయుడిలా ఈ సినిమాలో మహేశ్‌బాబు పాత్ర ఉంటుందని అంటున్నారు. కథ స్వరూపం ఇదీ అని పూర్తిగా తెలియకపోయినా అడవుల్లో అక్రమాలు జరిపే వారిపై విరుచుకు పడే రీతిలో మహేశ్‌ బాబు పాత్ర ఉంటుందని అంటున్నారు. హై బడ్జెట్‌తో భారీ స్థాయిలో రూపుదిద్దుకొనే ఈ సినిమా షూటింగ్‌ అమెజాన్‌ అడవుల్లో జరుగుతుందని సమాచారం. ఒక పక్క షూటింగ్‌కు ప్లాన్‌ చేసుకుంటూనే మరో పక్క సినిమాలోని కీలకమైన విఎ్‌ఫఎక్స్‌ వర్క్‌ను లాస్‌ఏంజెల్స్‌లోని ఓ స్టూడియోలో చేయించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రాజమౌళితో కలసి ఈ ప్రాజెక్ట్‌లో పనిచేయడానికి డిస్నీ, సోనీ వంటి అంతర్జాతీయ చిత్ర నిర్మాణ సంస్థలు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రపంచ స్థాయి సాంకేతిక సదుపాయాలు అందజేస్తామని ఈ రెండు సంస్థలు ఆయనకు ఆఫర్‌ ఇచ్చినట్లు తెలిసింది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఈ రెండు సంస్థల్లో రాజమౌళి దేనితో కలసి పనిచేస్తారనేది మరి కొద్ది రోజులలో తెలుస్తుంది.

Updated Date - 2023-04-13T03:38:06+05:30 IST