‘లియో’కు థియేటర్ల సమస్య లేదు

ABN , First Publish Date - 2023-10-18T02:59:26+05:30 IST

తమిళ హీరో విజయ్‌, దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొన్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘లియో’ ఈ గురువారం విడుదల కానుంది. తమిళంలో లలిత్‌కుమార్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో...

‘లియో’కు థియేటర్ల సమస్య లేదు

తమిళ హీరో విజయ్‌, దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొన్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘లియో’ ఈ గురువారం విడుదల కానుంది. తమిళంలో లలిత్‌కుమార్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ ‘ ఈ నెల 19న సినిమాను విడుదల చేస్తున్నాం. దసరా సెలవుల్లో అందరినీ అలరించే సినిమా అవుతుంది. తెలుగులో టైటిల్‌ విషయంలో చిన్న సమస్య వచ్చింది. ఆ టైటిల్‌ను వేరొకరు రిజిస్టర్‌ చేశారట. వారు మమ్మల్ని సంప్రదించకుండా నేరుగా కోర్టుని ఆశయ్రించారు. వాళ్లతో మాట్లాడుతున్నాం. సమస్య పరిష్కారం అవుతుంది. ఈ నెల 19నే తెలుగులో కూడా విడుదలవుతుంది’ అని చెప్పారు. థియేటర్ల సమస్య లేదని ఆయన చెబుతూ ‘‘భగవంత్‌ కేసరి’, ‘టైగర్‌ నాగేశ్వరరావు’, ‘లియో’ చిత్రాల విడుదలకు ఎటువంటి సమస్య లేకుండా ఏ సినిమాకు కావాల్సినన్ని థియేటర్లు వాళ్లకు కేటాయించారు. మా సినిమాతో పాటు ఆ రెండు చిత్రాలు కూడా హిట్‌ కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు. తమిళంలో తమ సంస్థ నిర్మించిన ‘వాతి’(సార్‌) చిత్రాన్ని లలిత్‌కుమార్‌ రిలీజ్‌ చేశారనీ, ఆ సమయంలో ఏర్పడిన అనుబందంతో ఇప్పుడు ‘లియో’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నట్లు నాగవంశీ చెప్పారు. దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ నిరాశ పరచడని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. మహేశ్‌తో నిర్మిస్తున్న ‘గుంటూరు కారం’ మొదటి పాటను ఎప్పుడు విడుదల చేసేదీ దసరా సమయంలో తెలియజేస్తామన్నారు.

Updated Date - 2023-10-18T02:59:26+05:30 IST