విచిత్రమైన కథాంశంతో కోటబొమ్మాళి
ABN , First Publish Date - 2023-11-22T00:28:46+05:30 IST
శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘కోటబొమ్మాళి పీఎస్’. తేజ మార్ని దర్శకత్వంలో బన్నీవాస్, విద్యా కొప్పినీడు నిర్మించారు...

శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘కోటబొమ్మాళి పీఎస్’. తేజ మార్ని దర్శకత్వంలో బన్నీవాస్, విద్యా కొప్పినీడు నిర్మించారు. ఈ నెల 24న విడుదలవుతోంది. ఇటీవలే చిత్రబృందం ‘కోట బొమ్మాళి పీఎస్ ప్రచారసభ’ పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘పోలీసులని పోలీసులే పట్టుకోవాలనే ఒక విచిత్రమైన కథాంశంతో ‘కోటబొమ్మాళి పీఎస్’ తెరకెక్కింది. ఈ సినిమాలో కథే హీరో. పోలీసుల్ని రాజకీయనాయకులు ఎలా వాడుకుంటారు అనేది చెప్పడానికి ఈ సినిమా తీశాం. అంతే తప్ప పోలీసులు, రాజకీయనాయకులను కించపరిచేలా సినిమా ఉండదు. మా సంస్థ నుంచి మరింత మంది నిర్మాతలు కూడా రావాలని కోరుకుంటున్నాను’ అన్నారు. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘శ్రీకాంత్ గారిని నేను ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్‌కు లాక్కెళ్లడం వల్ల ‘కోటబొమ్మాళి పీఎస్’ షూటింగ్ ఆలస్యమైంది. మంచి కాన్సెప్ట్‌తో తయారుచేసుకున్న కమర్షియల్ మూవీ ఇది. ‘లింగిడి’ సాంగ్ తర్వాత భారీగా అంచనాలు పెరిగాయి’ అని అన్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ ‘‘కోటబొమ్మాళి పీఎస్’ నా కెరీర్‌లో ఒక ప్రత్యేక చిత్రం. ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రేక్షకులకు కొత్త తరహా చిత్రం చూసిన అనుభూతిని ఇస్తుంది’ అని చెప్పారు. బన్నీవాస్ మాట్లాడుతూ ‘అల్లు అరవింద్ గారు ఇచ్చిన ధైర్యంతో ఈ సినిమాలో కొన్ని విషయాలు సూటిగా చెప్పాం. ఒక చిన్న ఘటన పెద్ద సమస్యగా మారి ఎన్నికలను ఎలా శాసించగలిగింది అనేది ఈ సినిమాలో చూపించాం’ అని తెలిపారు. కష్టపడి, ఇష్టపడి ప్రేక్షకులకు అందరికీ నచ్చాలని ఈ సినిమా చేశామని రాహుల్ విజయ్ చెప్పారు. లింగిడి సాంగ్‌లో నటించడం చాలా గొప్పగా అనిపించింది అని శివానీ రాజశేఖర్ అన్నారు. ఇప్పుడున్న సిస్టమ్‌లో పోలీసులు ఎలా నలిగిపోతున్నారనేది ఈ సినిమాలో చూపించాం అని తేజ మార్ని తెలిపారు. ‘నేను ట్రైలర్ చూశాను, సినిమా మంచి హిట్ అవుతుంది’ అని దర్శకుడు బోయపాటి శ్రీను చెప్పారు.