Nandi Awards: తెలుగు సినిమాకు మళ్లీ అవార్డుల కళ రాబోతుందా?

ABN , Publish Date - Dec 30 , 2023 | 09:07 PM

తెలుగు సినిమాకు మళ్లీ నంది అవార్డుల కళ రాబోతుందా అంటే తప్పనిసరిగా వస్తాయని చెబుతున్నారు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వి బి ఎంటర్టైన్మెంట్స్‌ విష్ణు బొప్పన ఆధ్వర్యంలో వెండితెర అవార్డ్స్‌ (2023) పదవ వార్షికోత్సవం వేడుక ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు మంత్రి అతిథిగా హాజరయ్యారు.

Nandi Awards: తెలుగు సినిమాకు మళ్లీ అవార్డుల కళ రాబోతుందా?

తెలుగు సినిమాకు మళ్లీ నంది అవార్డుల (Nandi Awards) కళ రాబోతుందా అంటే తప్పనిసరిగా వస్తాయని చెబుతున్నారు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(komatireddy venkat reddy) . వి బి ఎంటర్టైన్మెంట్స్‌ విష్ణు బొప్పన ఆధ్వర్యంలో వెండితెర అవార్డ్స్‌ (2023) పదవ వార్షికోత్సవం వేడుక ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు మంత్రి అతిథిగా హాజరయ్యారు. నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న  సీనియర్‌ నటుడు మురళీమోహనను (muralimohan) మంత్రి  సన్మానించారు. 50 ఏళ్ల నట జీవితాన్ని పురస్కరించుకుని ‘నటసింహ చక్రవర్తి’ బిరుదు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "మురళీమోహనతో నాకున్న అనుబంధంతో ఈ వేడుకకు వచ్చాను. మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని సన్మానించడం ఆనందంగా ఉంది. ఆయన్ను నటుడిగా, రాజకీయ నాయకుడిగా, బయట మంచి వ్యక్తిగా చూశా. అలాంటి వ్యక్తికి ఇలాంటి సన్మానాలు ఎన్నో జరగాలి" అని అన్నారు. 

మురళీమోహన మాట్లాడుతూ  "ఈ వేదికగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నన్ను సన్మానించడం ఆనందంగా ఉంది. తెలుగు ఇండస్ట్రీలో  నటీనటులు, సాంకేతిక నిపుణుల కష్టానికి గుర్తింపుగా అవార్డులు ఇవ్వడం అనేది ఎన్నో ఏళ్లగా జరుగుతోంది.. ఎన్టీఆర్‌ గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుంచి నంది అవార్డులకున్న విశిష్టత మనకు తెలుసు.  కానీ తెలుగు రాష్ట్రం రెండుగా  విడిపోయిన తర్వాత  ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డుల గురించి పట్టించుకోవడం లేదు.  ఇప్పుడు తెలంగాణలో పరిపాలన చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం అవార్డుల వరవడిని మొదలుపెట్టాలని, ప్రతి ఏటా అవార్డుల వేడుక ఘనంగా జరగాలని కోరుకుంటున్నాను’’ అని మంత్రికి విజ్ఞప్తి చేశారు. మురళీమోహన్‌ విజ్ఞప్తికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. నంది అవార్డుల విషయాన్ని ముఖ్యమంత్రితో మాట్లాడతాను. మా గవర్నమెంట్‌ కచ్చితంగా అవార్డుల వేడుక నిర్వహిస్తుంది. తెలుగు రాష్ట్రాలు వేరైనా మనమంతా ఒకటే. కొన్ని సంవత్సరాలుగా ఇవ్వాల్సిన అవార్డులు అన్నింటిని  కచ్చితంగా ఇచ్చే విధంగా మా గవర్నమెంట్‌ చేస్తుంది’’ అని తెలిపారు. 

వి బి ఎంటర్టైన్మెంట్స్‌ నిర్వహించిన ఈ వేడుకలో ఈ ఏడాది  వికలాంగులకు సినిమాటోగ్రఫీ మంత్రి చేతుల మీదుగా  చెక్కులు అందజేశారు.  హను రాఘవపూడి, టి.  ప్రసన్నకుమార్‌,  వశిష్ట, కమెడియన్‌ శ్రీనివాస్‌ రెడి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - Dec 30 , 2023 | 09:07 PM