Kida Cola is fun : కీడా కోలా మజా ఇస్తుంది

ABN , First Publish Date - 2023-10-31T06:15:11+05:30 IST

క్రైమ్‌ కామెడీ ఎలిమెంట్‌తో తరుణ్‌ భాస్కర్‌ తన మూడో చిత్రంగా అందిస్తున్న ‘కీడా కోలా’ నవంబర్‌ 3న విడుదల కానుంది. రానా సమర్పణలో కె వివేక్‌ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్‌, శ్రీనివాస్‌ కౌశిక్‌ నిర్మించారు...

Kida Cola is fun : కీడా కోలా మజా ఇస్తుంది

క్రైమ్‌ కామెడీ ఎలిమెంట్‌తో తరుణ్‌ భాస్కర్‌ తన మూడో చిత్రంగా అందిస్తున్న ‘కీడా కోలా’ నవంబర్‌ 3న విడుదల కానుంది. రానా సమర్పణలో కె వివేక్‌ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్‌, శ్రీనివాస్‌ కౌశిక్‌ నిర్మించారు. ఆదివారం రాత్రి జరిగిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు హీరో విజయ్‌ దేవరకొండ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ‘తరుణ్‌ భాస్కర్‌, నేను, నాగఅశ్విన్‌, సందీప్‌ రెడ్డి వంగా వేర్వేరు చోట్ల పెరిగినా సినిమా మా అందరినీ కలిపింది. ‘పెళ్లి చూపులు’ చిత్రంతో తరుణ్‌ భాస్కర్‌ నన్ను హీరోగా పరిచయం చేశాడు. తనపై, తన కథలపై అతనికి నమ్మకం ఎక్కువ. ఆ విషయంలో ఆయన్ని గౌరవిస్తాను. తరుణ్‌ భాస్కర్‌ ఇండస్ర్టీకి దొరికిన అదృష్టం. ‘కీడా కోలా’ కచ్చితంగా మజా ఇస్తుంది. థియేటర్స్‌లో ఎంజాయ్‌ చేయండి. మరో విషయం ఏమిటంటే తరుణ్‌ ఓ కథ చెప్పాడు. స్ర్కిప్ట్‌ లాక్‌ చేశాం. త్వరలోనే మా కాంబినేషన్‌లో ఆ సినిమా ఉంటుంది’ అన్నారు.

  • ‘క్రైమ్‌ కామెడీ నా ఫేవరెట్‌ జానర్‌. అందులో ఈ సినిమా తీసినందుకు ఆనందంగా ఫీల్‌ అవుతున్నాను. ఎన్ని సమస్యలు ఉన్నా నవ్వించాలనే ప్రయత్నమే ‘కీడా కోలా’ నిర్మాణం. ఇందులో అన్ని రకాల హాస్యం ఉంది. బ్రహ్మనందంగారు నటించడం మా అదృష్టం. ఈ సినిమా చూస్తున్నంత సేపూ నవ్వుతూనే ఉంటారు’ అన్నారు తరుణ్‌ భాస్కర్‌.. ఐదేళ్ల తర్వాత వస్తున్న తరుణ్‌ భాస్కర్‌ సినిమా ఇదనీ, ఆయనతో పని చేయడం తన డ్రీమ్‌ అనీ, అది ఈ సినిమాతో నెరవేరిందని చైతన్య రావు చెప్పారు.

  • ‘సాధారణంగా దర్శకులు హీరోలని లాంచ్‌ చేస్తారు. కానీ తరుణ్‌ మాత్రం నిర్మాతలని లాంచ్‌ చేశారు. సినిమా బాగా వచ్చింది’ అన్నారు నిర్మాతల్లో ఒకరైన సాయికృష్ణ. ఫ్రెండ్స్‌ అంతా కలసి ఈ సినిమా చేశామనీ, రెండు గంటల నాన్‌స్టాప్‌ ఎంటర్‌టైనర్‌ ఇదనీ మరో నిర్మాత శ్రీపాద్‌ చెప్పారు

  • బ్రహ్మనందం మాట్లాడుతూ ‘నన్ను వీల్‌ చైర్‌లో కూర్చోబెట్టి కామెడీ చేయించాలనే కొత్త ఆలోచన తరుణ్‌భాస్కర్‌కు వచ్చింది. జంధ్యాలగారి సినిమాలు చేస్తున్నప్పుడు కామెడీ ఎంత హాయిగా ఉండేదో ఈ సినిమాకి మళ్లీ అలాంటి అనుభూతి కలిగింది. స్పష్టమైన లక్ష్యం ఉన్న దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని నా నమ్మకం’ అన్నారు.

Updated Date - 2023-10-31T06:15:11+05:30 IST