‘అక్క’గా మారుతున్న కీర్తి సురేశ్
ABN, First Publish Date - 2023-11-26T01:58:31+05:30
అటు సినిమాలు, ఇటు ఓటీటీ అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు స్టార్లు. వెబ్ సిరీ్‌సలపై బాగా ఫోకస్ పెడుతున్నారు. ఇప్పుడు కీర్తి సురేశ్ కూడా అదే బాటలో ప్రయాణం చేస్తోంది.
అటు సినిమాలు, ఇటు ఓటీటీ అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు స్టార్లు. వెబ్ సిరీ్‌సలపై బాగా ఫోకస్ పెడుతున్నారు. ఇప్పుడు కీర్తి సురేశ్ కూడా అదే బాటలో ప్రయాణం చేస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించే కొత్త వెబ్ సిరీ్‌సలో నటించడానికి సంతకాలు చేసింది. ఈ వెబ్ సిరీ్‌సకి ‘అక్క’ అనే టైటిల్ నిర్ణయించినట్టు టాక్. రాధికా ఆప్టే మరో కీలక పాత్రధారి. కీర్తి, రాధిక ఇద్దరూ అక్కాచెల్లెళ్లుగా నటించే అవకాశం వుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ ఈమధ్య ఓటీటీపై గట్టిగా దృష్టి పెట్టింది. ‘ది రైల్వే మెన్’, ‘మండల మర్డర్స్’ అనే రెండు వెబ్‌సిరీ్‌సలను నిర్మించింది. రెండిటికీ ఓటీటీలో మంచి ఆదరణ లభించింది. ఇది యశ్ రాజ్ చేసే మూడో ప్రయత్నం. ఈ సిరీస్‌కి ధర్మరాజ్ దర్శకత్వం వహిస్తారు.ఆదిత్య చోప్రా నిర్మాత. ‘‘ఈ రోజుల్లో సినిమా - ఓటీటీ రెండింటినీ వేరుగా చూడలేం. వెబ్ సిరీస్ నుంచి కూడా స్టార్లు పుట్టుకొస్తున్నారు. మన ప్రతిభను నూటికి నూరుపాళ్లూ ఆవిష్కరించుకొనే అవకాశాన్ని వెబ్ సిరీ్‌సలు అందిస్తున్నాయి. అందుకే ఓటీటీ నుంచి మంచి కథలు నన్ను వెదుక్కొంటూ ఎప్పుడొస్తాయా? అని నేను కూడా ఎదురు చూస్తున్నా. అది ఈ వెబ్ సిరీస్ ద్వారా లభించింది’’ అని చెప్పుకొచ్చింది కీర్తి. ప్రస్తుతం కీర్తి సురేశ్ ‘రివాల్వర్ రీటా’, ‘సైరన్’ చిత్రాలతో బిజీగా ఉంది.