జైలర్‌తో జైలర్ పోటీ!
ABN , First Publish Date - 2023-08-09T04:04:12+05:30 IST
తమిళ సూపర్ స్ఠార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ చిత్రం ఈ గురువారం విడుదలవుతోంది. మలయాళంలో ‘జైలర్’ పేరుతోనే మరో చిత్రం తయారైంది. ఆ సినిమాను కూడా ఆగస్టు 10నే విడుదల...

తమిళ సూపర్ స్ఠార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ చిత్రం ఈ గురువారం విడుదలవుతోంది. మలయాళంలో ‘జైలర్’ పేరుతోనే మరో చిత్రం తయారైంది. ఆ సినిమాను కూడా ఆగస్టు 10నే విడుదల చేస్తామని ఆ చిత్ర నిర్మాతలు ప్రకటించడంతో ఒకే పేరుతో వస్తున్న ఈ రెండు చిత్రాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. రజనీకాంత్ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంది. శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ వంటి భారీ తారాగణం ఉంది. ఈ సినిమా తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇక మలయాళ ‘జైలర్’ విషయానికి వస్తే చాలా తక్కువ బడ్జెట్‌తో తయారైంది. సక్కీర్ మదత్తిల్ ఆ చిత్రానికి దర్శకుడు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలని అనుకున్నాడో ఏమో సక్కీర్ రజనీకాంత్‌తోనే పోటీకి దిగాడు. ఆయన నటించిన ‘జైలర్’ విడుదల రోజునే తన ‘జైలర్’ చిత్రాన్ని విడుదల చేస్తానని ప్రకటించడంతో యుద్ధం మొదలైంది. అయితే సక్కీర్ పోటీకి సిద్ధమైనా కేరళలోని ఎగ్జిబిటర్స్ మాత్రం అందుకు సిద్దంగా లేరు. రజనీకాంత్ ‘జైలర్’ చిత్రం కేరళలో 400 థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది. తన సినిమా కు కనీసం 75 థియేటర్లు కావాలని సక్కీర్ అడిగితే, 42 మాత్రమే ఇవ్వగలమని ఎగ్జిబిటర్స్ చెప్పి చేతులు ఎత్తేశారు. దాంతో తన చిత్రం విడుదలను వాయిదా వేశారు సక్కీరు. ఈ నెల 18న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అయితే రజనీకాంత్ ‘జైలర్’ టైటిల్‌ను మార్చి కేరళలో విడుదల చేయాలని సన్ పిక్చర్స్ వారిని సక్కీర్ కోరారు . రెండేళ్ల క్రితమే అంటే తమిళ ‘జైలర్’ అనౌన్స్ చేయడానికి ముందే తను ‘జైలర్’ టైటిల్‌ను రిజిస్టర్ చేసినట్లు వెల్లడించారు. కానీ సక్కీర్ అభ్యర్థనను సన్ పిక్చర్స్ పట్టించుకోకపోవడంతో న్యాయస్థానంలోనే ఈ విషయం తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు.