సొంతంగా డబ్బింగ్‌ చెప్పాలని షరతు పెట్టారు

ABN , First Publish Date - 2023-01-19T01:10:49+05:30 IST

‘‘నేను ఎన్నో తెలుగు సినిమాలు చూశాను. కానీ తెలుగు సినిమాలో నటించే అవకాశం వస్తుందని ఊహించలేదు. డబ్బింగ్‌ సినిమాలతో నేను తెలుగు ప్రేక్షకులకు...

సొంతంగా డబ్బింగ్‌ చెప్పాలని షరతు పెట్టారు

‘‘నేను ఎన్నో తెలుగు సినిమాలు చూశాను. కానీ తెలుగు సినిమాలో నటించే అవకాశం వస్తుందని ఊహించలేదు. డబ్బింగ్‌ సినిమాలతో నేను తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని నటుడు అర్జున్‌దాస్‌ అన్నారు. అనికా సురేంద్రన్‌, సూర్య వశిష్ట, అర్జున్‌దాస్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘బుట్టబొమ్మ’. శౌరి చంద్రశేఖర్‌ రమేశ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. జనవరి 26న ఈ చిత్రం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా అర్జున్‌దాస్‌ ‘బుట్టబొమ్మ’ విశేషాలను పంచుకున్నారు. ‘తెలుగు ప్రేక్షకులకు బుట్టబొమ్మ కొత్త అనుభూతిని ఇస్తుంది. నిర్మాత వంశీ పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. ఫోన్‌ చేసి ఈ సినిమా గురించి చెప్పారు. ‘ఈ సినిమా మీరు తప్పకుండా చేయాలి’ అని ఆయన అడిగారు. తర్వాత దర్శకుడు రమేశ్‌ చెన్నై వచ్చి నన్ను కలిసి, కథ చెప్పారు. ఈ సినిమా మాతృక ‘కప్పేలా’ ఓటీటీలో ఉంది. అయినా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని వంశీ నమ్మారు. అందుకే రీమేక్‌ చేశారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లు కథలో మార్పులు చేశారు. ఇందులో నా పాత్ర పేరు ఆర్‌.కె. నా పాత్రగురించి ఇంతకంటే ఎక్కువ చెబితే సినిమాలో ఫీల్‌ మిస్సవుతారు. నా గొంతును ప్రేక్షకులు చాలా ఇష్టపడుతున్నారు. ‘బుట్టబొమ్మ’ చిత్రానికి తెలుగులో తొలిసారి డబ్బింగ్‌ చెబుతున్నాను. నేను ఈ సినిమా అంగీకరించేటప్పుడే సొంతంగా డబ్బింగ్‌ చెప్పాలని వంశీ షరతు పెట్టారు. అన్ని రకాల పాత్రలు చేయడానికి నేను సిద్ధం. కొత్తదనం ఉంటే నెగిటివ్‌ రోల్స్‌ అయినా చేస్తాను. ఒక్కో సినిమా తర్వాత ఆ ప్రభావంతో ఒక్కో తరహా పాత్రలు వస్తున్నాయి’ అని అర్జున్‌దాస్‌ చెప్పారు.

Updated Date - 2023-01-19T01:10:52+05:30 IST