సిటాడెల్‌ సెట్‌లోకి

ABN , First Publish Date - 2023-02-01T23:19:16+05:30 IST

తన అనారోగ్యంపై వస్తున్న వదంతులకు చెక్‌ పెడుతూ సమంత రంగంలోకి దిగారు. మయోసైటిస్‌ నుంచి కోలుకొని తిరిగి సెట్‌లోకి అడుగుపెట్టారు....

సిటాడెల్‌ సెట్‌లోకి

తన అనారోగ్యంపై వస్తున్న వదంతులకు చెక్‌ పెడుతూ సమంత రంగంలోకి దిగారు. మయోసైటిస్‌ నుంచి కోలుకొని తిరిగి సెట్‌లోకి అడుగుపెట్టారు. ముంబైలో జరుగుతున్న ‘సిటాడెల్‌’ వెబ్‌సిరీస్‌ చిత్రీకరణలో సమంత బుధవారం పాల్గొన్నారు. ఈ సిరీస్‌లో సమంత పోలీసాఫీసర్‌ పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె లుక్‌పోస్టర్‌ను టీమ్‌ సోషల్‌ మీడియాలో విడుదల చేయగా వైరల్‌ అయింది. ఇందులో బ్లాక్‌ ప్యాంట్‌, లెదర్‌ జాకెట్‌లో స్టైలిష్‌లుక్‌తో సమంత ఆకట్టుకున్నారు. ‘సమంత లుక్‌ అదుర్స్‌’ అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు

హాలీవుడ్‌ యాక్షన్‌ డైరెక్టర్స్‌ రూస్సో బ్రదర్స్‌ నిర్మించిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ ‘సిటాడెల్‌’. ఈ సిరీస్‌ను హిందీలో రాజ్‌ అండ్‌ డీకే ద్వయం రీమేక్‌ చేస్తున్నారు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో నిర్మిస్తోంది. రీమేక్‌లో సమంత బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హాలీవుడ్‌ వెర్షన్‌లో ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మాడెన్‌ లీడ్‌రోల్స్‌లో నటించారు. ఈ సందర్భంగా సమంతకు శుభాకాంక్షలు చెబుతూ ప్రియాంక చోప్రా ట్వీట్‌ చేశారు.

సమంత నటించిన హీరోయిన్‌ ఓరియంటెడ్‌ యాక్షన్‌ చిత్రం ‘యశోద’ సూపర్‌హిట్‌ అయింది. పాన్‌ ఇండియా చిత్రం ‘శాకుంతలం’తో ఆమె త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

సమంత క్షమాపణలు

సిటాడెల్‌ చిత్రీకరణలో పాల్గొంటున్న సమంతపై హీరో విజయ్‌ దేవరకొండ అభిమానులు సోషల్‌ మీడియాలో అసహనం వ్యక్తం చేశారు. విజయ్‌, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషీ’ సినిమా రూపొందుతోంది. రెండు షెడ్యూల్స్‌ పూర్తయ్యాయి. తర్వాత సమంత అనారోగ్యం వల్ల చిత్రీకరణ నిలిచిపోయింది. గతేడాది ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లింది. సమంత కోలుకోకపోవడంతో చిత్రీకరణ ఎప్పటికప్పుడు వాయిదాపడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ‘సిటాడెల్‌’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు మా ‘ఖుషీ’ సంగతేంట’ని విజయ్‌ అభిమానులు సమంతను ప్రశ్నిస్తున్నారు. తనవల్ల ‘ఖుషీ’ షూటింగ్‌ నిలిచిపోయినందుకు హీరో విజయ్‌ దేవరకొండ అభిమానులకు సమంత క్షమాపణలు చెప్పారు. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, ‘చాలా త్వరలోనే ‘ఖుషీ’ షూటింగ్‌ మొదలుపెడతామని’ ఆమె బదులిచ్చారు.

Updated Date - 2023-02-01T23:19:18+05:30 IST