ఐదు భాషల్లో ఒకేసారి

ABN , First Publish Date - 2023-11-21T00:24:40+05:30 IST

కంచర్ల ఉపేంద్రను హీరోగా పరిచయం చేస్తూ రూపుదిద్దుకున్న చిత్రం ‘ఉపేంద్రగాడి అడ్డా’. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 1న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో...

ఐదు భాషల్లో ఒకేసారి

కంచర్ల ఉపేంద్రను హీరోగా పరిచయం చేస్తూ రూపుదిద్దుకున్న చిత్రం ‘ఉపేంద్రగాడి అడ్డా’. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 1న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నట్లు నిర్మాత కంచర్ల అచ్యుతరావు ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌లో తెలుగు నిర్మాతలమండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్‌ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ‘‘పరిశ్రమలోకి కొత్తగా వచ్చే నిర్మాతలు తమ కుమారుల్ని హీరోగా పరిచయం చేస్తూ ఒకే ఒక సినిమా తీస్తుంటారు. కానీ ఈ నిర్మాత అచ్యుతరావుగారు తన కుమారుడు ఉపేంద్రను హీరోగా పరిచయం చేస్తూ ఒకేసారి ఐదు సినిమాలు ప్రారంభించడం ఒక సంచలనం. ఉపేంద్ర దీనిని నిలబెట్టుకుని హీరోగా మంచి పేరు తెచ్చుకోవాలి’ అని ఆశీర్వదించారు. దర్శకుడు ఆర్యన్‌ సుభాన్‌ ఎస్‌.కె. మాట్లాడుతూ ‘మాస్‌, ఎంటర్‌టైనర్‌ అంశాలకు సందేశాన్ని మిళితం చేసిన సినిమా ఇది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలు ఇందులో ఉన్నాయి’ అన్నారు. కంచర్ల ఉపేంద్ర మాట్లాడుతూ ‘నన్ను హీరోగా పరిచయం చేస్తూ మా నాన్నగారు వరుసగా ఐదు చిత్రాలు నిర్మించడం నా అదృష్టం. తప్పకుండా నా ప్రతిభను నిరూపించుకుంటా’ అన్నారు. తన కెరీర్‌ను మలుపు తిప్పే సినిమా అవుతుందని హీరోయిన్‌ సావిత్రి కృష్ణ చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ ‘ఎన్నో ఏళ్లుగా విశాఖపట్నంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మేం తీస్తున్న సినిమాల ద్వారా వచ్చే లాభాలను ప్రజా సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తాం. మా బేనరు నుంచి ప్రతి నెలా ఒక సినిమాను విడుదల చేస్తాం’ అని తెలిపారు.

Updated Date - 2023-11-21T00:24:43+05:30 IST