ఎన్టీఆర్‌ పేరు ఉంటేనా..?

ABN , First Publish Date - 2023-01-25T01:39:55+05:30 IST

ఆస్కార్‌ బరిలో ‘నాటు నాటు’ పాట ఉందన్న ఉత్సాహం ఓవైపు ఊపేస్తోంటే.. ఉత్తమ నటుడి విభాగంలో ఎన్టీఆర్‌ పేరు లేకపోవడం కాస్త నిరాశకు గురి చేసింది...

ఎన్టీఆర్‌ పేరు ఉంటేనా..?

ఆస్కార్‌ బరిలో ‘నాటు నాటు’ పాట ఉందన్న ఉత్సాహం ఓవైపు ఊపేస్తోంటే.. ఉత్తమ నటుడి విభాగంలో ఎన్టీఆర్‌ పేరు లేకపోవడం కాస్త నిరాశకు గురి చేసింది. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో భీమ్‌గా ఎన్టీఆర్‌ విజృంభించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ నటనకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసలు దక్కాయి. పులిని బంధించేటప్పుడు తారక్‌ చూపించిన రౌద్రం, ‘కొమరం భీముడో..’ పాటలోని కరుణ రసం, ‘నాటు నాటు’ పాటలోని వేగం.. ఇవన్నీ అభిమానులకు తెగ నచ్చేశాయి. ఆస్కార్‌లో ఉత్తమ నటుడి విభాగంలో ప్రైవేటు ఎంట్రీ ద్వారా ఎన్టీఆర్‌ నామినేషన్లలో నిలబడ్డాడు. విదేశీ పత్రికలు సైతం ఈసారి ఆస్కార్‌ బెస్ట్‌ యాక్టర్‌ కేటరిగిలో మిగిలిన నటులకు ఎన్టీఆర్‌ గట్టి పోటీ ఇవ్వబోతున్నాడని, టాప్‌ 10 లిస్టులో ఎన్టీఆర్‌ ఉంటాడని, నామినేషన్‌లో చోటు దక్కినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కథనాలు రాశాయి. వాటితో ఎన్టీఆర్‌ అభిమానుల్లో ఆశలు మరింత పెరిగిపోయాయి. అందుకే ఆస్కార్‌ నామినేషన్ల జాబితా కోసం తెలుగువాళ్లంతా ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే.. ఈ జాబితాలో ఎన్టీఆర్‌కి చోటు దక్కలేదు. ఆస్టిన్‌ బట్లర్‌, కొలిన్‌ ఫార్రెల్‌, బ్రెండన్‌ ఫ్రాసెర్‌, పాల్‌ మోస్కర్‌, బిల్‌ నిగీ ఈ జాబితా నుంచి పోటీలో నిలిచారు. నిజంగా ఎన్టీఆర్‌ పేరు షార్ట్‌ లిస్టులో ఉండి ఉంటే.. ఆ ఉత్సాహం మరో స్థాయిలో ఉండి ఉండేది. అయినా ఫర్వాలేదు. ఓ తెలుగు నటుడు ఆస్కార్‌ వరకూ వెళ్లాడు. చివరి వరకూ గట్టి పోటీ ఇచ్చాడు. ఆస్కార్‌ నామినేషన్ల రూపంలో దక్కిన ప్రచారం వల్ల ఎన్టీఆర్‌ పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మరింతగా పాపులర్‌ అయిపోయింది.

Updated Date - 2023-01-25T01:39:55+05:30 IST