నాకు నేనే కొత్తగా కనిపించా!

ABN , First Publish Date - 2023-05-04T03:08:12+05:30 IST

కామెడీ హీరోయిజానికి కేరాఫ్‌ అడ్రస్స్‌గా నిలిచిన కథానాయకుడు అల్లరి నరేశ్‌. అయితే ‘నాంది’ నుంచి ఆయన ప్రయాణం మారింది...

నాకు నేనే కొత్తగా కనిపించా!

కామెడీ హీరోయిజానికి కేరాఫ్‌ అడ్రస్స్‌గా నిలిచిన కథానాయకుడు అల్లరి నరేశ్‌. అయితే ‘నాంది’ నుంచి ఆయన ప్రయాణం మారింది. సీరియస్‌ కథల వైపు నరేశ్‌ దృష్టి మళ్లింది. ‘ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం’ సైతం నరేశ్‌ని కొత్తగా చూపించింది. ఇప్పుడు ‘ఉగ్రం’తో మరో ప్రయత్నం చేశారు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా నరేశ్‌ ఈ సినిమా గురించి ఏం చెప్పారంటే..?

  • ‘‘నాంది తరవాత విజయ్‌తో చేసిన సినిమా ఇది. ‘నాంది’ సమయానికి అలాంటి కథలు నాకు కొత్త. ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అనే అనుమానాలు ఉండేవి. ‘నాంది’తో మా నమ్మకం నిజమైంది. మంచి విజయాన్ని అందించారు. అంతకు మించిన సినిమా ఇవ్వాలన్న దృక్పథంతో ‘ఉగ్రం’ చేశాం. తెరపై నాకు నేనే కొత్తగా కనిపించా. నటుడిగా నాకు ఎంత పేరొస్తుందన్నది పక్కన పెట్టండి. ఈ సినిమా చూసొచ్చాక టెక్నీషియన్స్‌ గురించి గొప్పగా మాట్లాడుకొంటారు’’.

  • ‘‘ఈ సినిమా కథేమిటన్నది ముందే టీజర్‌లోనూ, ట్రైలర్‌లోనూ చెప్పేశాం. ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే.. పోలీస్‌ దగ్గరకు వెళ్తారు. అలాంటిది పోలీసుకే సమస్య వస్తే ఏం చేస్తాడన్నది కథ. నా పాత్ర మూడు కోణాల్లో సాగుతుంది. ఇందులో యాక్షన్‌, ఫైట్లు.. అన్నీ చేశా. ఫైట్లు నాకు కొత్త కాదు. కాకపోతే ఇది వరకు చేసినవన్నీ అల్లరి ఫైట్లే. ఈసారి అలా కాదు. ఫైట్లో ఓ ఎమోషన్‌ కనిపిస్తుంది’’.

  • ‘‘సింపతీ పాత్రలు నాకు ముందు నుంచీ బాగా వర్కవుట్‌ అయ్యాయి. ‘గమ్యం’, ‘శంభో శివశంభో..’ లాంటి చిత్రాలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ‘మహర్షి’తో నా ప్రయాణం మారింది. ‘గమ్యం’ తరవాత దర్శకులు, రచయితలు నన్ను చూసే దృష్టి కోణం మారింది. కామెడీ కథలు బాగా తగ్గిపోయాయి. అందరూ మాస్‌, హారర్‌ కథలే చేసుకొంటున్నారు. అందుకే నేనూ మెల్లగా వాటికి దూరమాయ్యా. అయితే.. ఓ మంచి కామెడీ కథ వస్తే తప్పకుండా చేస్తా. ఎందుకంటే.. వరుసగా సీరియస్‌ కథలు చేస్తే మళ్లీ రొటీన్‌ ఫీలవుతారు’’

Updated Date - 2023-05-04T03:08:12+05:30 IST