గ్యాప్ ఎందుకు వస్తుందో నాకే తెలీదు
ABN, First Publish Date - 2023-04-04T03:52:48+05:30
అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో సుశాంత్. కథానాయకుడిగా ఒకట్రెండు విజయాలు అందాయి. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా టర్న్ తీసుకొన్నారు. ‘అల వైకుంఠపురములో’ ఓ కీలకమైన పాత్ర పోషించారు...
అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో సుశాంత్. కథానాయకుడిగా ఒకట్రెండు విజయాలు అందాయి. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా టర్న్ తీసుకొన్నారు. ‘అల వైకుంఠపురములో’ ఓ కీలకమైన పాత్ర పోషించారు. ఇప్పుడు ‘రావణాసుర’లోనూ అవకాశం చిక్కింది. రవితేజ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ఈనెల 7న ‘రావణాసుర’ విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సుశాంత్ చెప్పిన కబుర్లు.
‘‘చాలా ఆసక్తికరమైన కథ ఇది. సినిమాలో కొత్త అంశాలు ఎన్నో ఉన్నాయి. అవి కచ్చితంగా థ్రిల్ కలిగిస్తాయి. ఏ పాత్ర కూడా ప్రేక్షకుల అంచనాలకు అందదు. రాముడు ఎవరో, రావణుడు ఎవరో ఓ ఫజిల్‌లా ఉంటుంది’’
‘‘నేను చేసిన ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’లో కాస్త సస్పెన్స్, థ్రిల్ ఉంటాయి. కానీ పూర్తి స్తాయి థ్రిల్లర్ మాత్రం ‘రావణాసుర’. నటుడిగా నాకు రకరకాల పాత్రలు చేయాలని ఉంటుంది. ఆ అవకాశం ప్రతీసారీ రాదు. వచ్చినప్పుడు మాత్రం వదలకూడదు. నటుడిగా నన్ను నేను కొత్తగా చూసుకొనే అవకాశం ఈ పాత్రలో ఉందనిపించింది. అందుకే వెంటనే ఒప్పుకొన్నా’’
‘‘ఈ సినిమా విజయంపై నాకు ఎలాంటి డౌటూ లేదు. కానీ ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తారో చూడాలన్న ఆసక్తి ఉంది. ఎందుకంటే ఇలాంటి కథ ఇంత వరకూ తెలుగు స్ర్కీన్‌పై రాలేదు. అందుకే ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుంది. ‘రావణాసుర’ హిట్ అయితే ఈ జోనర్‌లో మరిన్ని సినిమాలు వస్తాయి’’
‘‘అక్కినేని కుటుంబం నుంచి రావడం నిజంగా నా అదృష్టమే. నాకొచ్చిన చిత్రాలకు, పాత్రలకు న్యాయం చేశాననిపించింది. కెరీర్‌లో అనుకోకుండా గ్యాప్‌లు వచ్చేశాయి. అవెందుకు వచ్చాయో నాకే తెలీదు. ‘చిలసౌ’ తరవాత విరామం లేకుండా సినిమాలు చేద్దామనుకొన్నా. కానీ సడన్‌గా కరోనా వచ్చి ప్రణాళికలన్నీ అల్లకల్లోలం చేసేసింది’’
‘‘అల వైకుంఠపురములో నాకో టర్నింగ్ పాయింట్. ఈ సినిమా వల్ల నార్త్‌లోనూ నాకు గుర్తింపు దక్కింది. మళ్లీ అలాంటి పాత్రలు నా దగ్గరకు చాలా వచ్చాయి. కానీ చేయలేదు. ‘రావణాసుర’లో క్యారెక్టర్‌కు నేను బాగా కనెక్ట్ అయ్యా. అందుకే ఒప్పుకొన్నా. ‘భోళా శంకర్’లోనూ ఓ మంచి పాత్ర చేస్తున్నా. సోలో హీరోగా ఓ సినిమా ఓకే అయ్యింది. ఇక మీదట విరామాలు లేకుండా సినిమాలు చేయాలన్నది నా ఆలోచన’’