నాకంటూ ఓ శైలి ఏర్పరచుకుంటాను

ABN , First Publish Date - 2023-11-29T01:14:02+05:30 IST

‘నన్ను హీరోగా పరిచయం చేస్తూ మా నాన్న అచ్యుతరావుగారు ఐదు సినిమాలు తీస్తుండడం నిజంగా నా అదృష్టం. తప్పకుండా నా ప్రతిభ నిరూపించుకుంటాను. ఒక కొత్త హీరో ప్రేక్షకులకు దగ్గరయ్యే...

నాకంటూ ఓ శైలి ఏర్పరచుకుంటాను

‘నన్ను హీరోగా పరిచయం చేస్తూ మా నాన్న అచ్యుతరావుగారు ఐదు సినిమాలు తీస్తుండడం నిజంగా నా అదృష్టం. తప్పకుండా నా ప్రతిభ నిరూపించుకుంటాను. ఒక కొత్త హీరో ప్రేక్షకులకు దగ్గరయ్యే అన్ని అంశాలూ ‘ఉపేంద్రగాడి అడ్డా’ చిత్రంలో ఉన్నాయి’ అన్నారు కంచర్ల ఉపేంద్ర. ఆయన హీరోగా నటించిన ‘ఉపేంద్రగాడి అడ్డా’ చిత్రం డిసెంబర్‌ ఒకటిన విడుదలవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘ఒక రోజు వైజాగ్‌ కళాకారుల పిక్నిక్‌కు ఛీఫ్‌ గెస్ట్‌గా వెళ్లాను. అక్కడ ఓ దర్శకుడు నన్ను చూసి హీరోలా ఉన్నావని మెచ్చుకుని ఒక కథ చెప్పడం, అది నాకూ, మా నాన్నగారికీ నచ్చడంతో సినిమాల్లోకి రావడం జరిగింది. గత ఏడాది పవన్‌కల్యాణ్‌గారి పుట్టిన రోజున నా తొలి చిత్రం ‘కంచర్ల’ షూటింగ్‌ మొదలైంది. అలా మిగిలిన నాలుగు చిత్రాలూ వరుసగా మొదలయ్యాయి’ అన్నారాయన. ‘ఉపేంద్రగాడి అడ్డా’ చిత్రం యూత్‌ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌. మంచి సందేశం కూడా ఉంది, ప్రతి వారికీ కనెక్ట్‌ అయ్యే సినిమా. ఆర్యన్‌ కె సుభాన్‌ దీనికి దర్శకత్వం వహించారు. ఉపేంద్ర అనే పేరు కలిగిన వారు ఉన్నత స్థానాల్లో ఉన్నారనీ, వారి లాగా నా జీవితం బాగుండాలని మా అమ్మగారు ‘ఉపేంద్ర’ అనే పేరు పెట్టారు. మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇలాంటి పేరు ఉన్న వాళ్ల సంఖ్య తక్కువ. హీరోగా నాకంటూ ఓ శైలిని ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నాను’ అన్నారు ఉపేంద్ర. ‘మా నాన్నగారు నేను హీరోగా 11 సినిమాలు తీయాలని అనుకుంటున్నారు. ఇప్పటికి నాలుగు సినిమాలు మొదలై 70 శాతం పూర్తయ్యాయి. ఐదో సినిమాగా మొదలైన ‘ఉపేంద్రగాడి అడ్డా’ మొదట విడుదలవుతోంది. ఆరో సినిమా ‘1920 భీమునిపట్నం’ వచ్చే నెలలో మొదలవుతుంది. కొత్త దర్శకులను, నటీనటులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే నాన్నగారు చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పారు. అలాగే ఆయన ఉపకార్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు’ అని చెప్పారు. తన తదుపరి చిత్రం సంక్రాంతికి విడుదలవుతుందనీ, కొత్త వారిని ఆదరించాలి, కంటెంట్‌ ఉన్న సినిమాలను విజయవంతం చేయాలని ఉపేంద్ర కోరారు.

Updated Date - 2023-11-29T01:14:04+05:30 IST