అవకతవక పథకాలు

ABN , First Publish Date - 2023-06-22T03:12:45+05:30 IST

ప్రజలకు మంచి చేస్తున్నట్లుగా కనిపించే కొన్ని ప్రభుత్వ పథకాలు చాలా సందర్భాల్లో ప్రజల జీవితాలను బాగు చేయడానికి బదులు వారి జీవితాలతో చెలగాటమాడుతుంటాయి...

అవకతవక పథకాలు

ప్రజలకు మంచి చేస్తున్నట్లుగా కనిపించే కొన్ని ప్రభుత్వ పథకాలు చాలా సందర్భాల్లో ప్రజల జీవితాలను బాగు చేయడానికి బదులు వారి జీవితాలతో చెలగాటమాడుతుంటాయి. అలా కేంద్రప్రభుత్వం ప్రారంభించిన జనధన పథకం ఒకానొక గ్రామంలో ఓ పేదవాడి జీవితాన్ని, అతన్ని కుటుంబాన్నీ ఎలా విపత్తుల పాలు చేసిందీ అనే ఇతివృత్తంతో రూపుదిద్దుకొన్న చిత్రం ‘భీమదేవరపల్లి బ్రాంచ’. అభిరామ్‌, రూపా శ్రీనివాస్‌ హీరోహీరోయిన్లుగా నటించారు. రమేశ చెప్పాల దర్శకత్వంలో కీర్తిలత బత్తిన, రాజా నరేంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ద్వారా ఈ నెల 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన కీర్తిలత మాట్లాడుతూ ‘ఆద్యంతం ఆసక్తికరంగా, ఉత్కంఠభరితమైన మలుపులతో , ఎమోషనల్‌ సన్నివేశాలతో సినిమా ఉంటుంది. ఓ దినపత్రికలో వచ్చిన వార్తను చదివాక తయారు చేసుకున్న కథ ఇది. ప్రభుత్వ పథకాల రూపంలో ఎదురయ్యే విపత్కర పరిస్థితులను సాధ్యమైనంతవరకూ సజీవంగా చూపించడానికి ప్రయత్నించాం. పథకాల వెనుక జరుగుతున్న అవకతవకలను ప్రజలకు తెలియజెప్పాలనే సంకల్పంతోనే ఈ సినిమా తీశాం’ అన్నారు. ‘బలగం’ చిత్రంతో గుర్తింపు పొందిన కొందరు నటీనటులు, కొత్త నటీనటులు మరికొందరు చిత్రంలో నటించారనీ, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనే రీతిలో సినిమా రూపొందిందనీ మరో నిర్మాత రాజా నరేంద్ర చెప్పారు.

Updated Date - 2023-06-22T03:12:45+05:30 IST