ఒకేసారి ఐదు సినిమాలు ఒక సంచలనం

ABN , First Publish Date - 2023-10-31T06:13:17+05:30 IST

‘ఒక సినిమా తీయడానికే చాలా ఇబ్బందులు పడుతున్న ఈ రోజుల్లో ఒకేసారి ఐదు సినిమాలు తీస్తుండడడం నిజంగా ఒక సంచలనం’ అన్నారు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం...

ఒకేసారి ఐదు సినిమాలు ఒక సంచలనం

‘ఒక సినిమా తీయడానికే చాలా ఇబ్బందులు పడుతున్న ఈ రోజుల్లో ఒకేసారి ఐదు సినిమాలు తీస్తుండడడం నిజంగా ఒక సంచలనం’ అన్నారు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం. కంచర్ల ఉపేంద్ర హీరోగా, సావిత్రీకృష్ణ హీరోయిన్‌గా నటించిన ‘ఉపేంద్రగాడి అడ్డా’ చిత్రం ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఆర్యన్‌ సుభాన్‌ ఎస్‌.కె. దర్శకత్వంలో కంచర్ల అచ్యుతరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ వేడుకలోనే హీరో ఉపేంద్ర నటిస్తున్న మిగిలిన నాలుగు చిత్రాల టీజర్లను కూడా విడుదల చేశారు. అలాగే ‘ఉపేంద్రగాడి అడ్డా’ ట్రైలర్‌ను, నరసింహ నంది దర్శకత్వంలో ఈ నిర్మాత తీయబోయే ఆరవ చిత్రం ‘1920 భీముని పట్నం’ చిత్రం పోస్టర్‌ను కూడా బ్రహ్మానందం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘తన కుమారుడిని హీరోగా పరిచయం చేయడమే కాదు నిర్మాత అచ్యుతరావుగారు ఓ ఫ్యాక్టరీలా ఒకేసారి ఐదు చిత్రాలు తీస్తుండడం అభినందనీయం. పరిశ్రమను నమ్ముకున్న వారికి అవకాశాలు ఇచ్చి, ఆ రకంగా వారికి భోజనం పెడుతున్నారు. తన కుమారుడి పట్ల ఆయనకున్న ప్రేమకు ఇది నిదర్శనం. హీరోగా ఉపేంద్రకు మంచి భవిష్యత్‌ ఉండాలని ఆశీర్వదిస్తున్నాను’ అన్నారు. నిర్మాత కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ ‘మంచి కథలను ఎంపిక చేసుకుని టాలెంట్‌ను గుర్తించి ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ఈ సినిమాలు తీస్తున్నాం. మా సినిమాల ద్వారా వచ్చే లాభాలను కూడా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తాం. మా పెద్దబ్బాయి జయంతి సందర్భంగా నవంబర్‌ మొదటి వారంలో ‘ఉపేంద్రగాడి అడ్డా’ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం.’ అని చెప్పారు. తన పుట్టిన రోజు సందర్బంగా తండ్రి అచ్యుతరావు ఐదు సినిమాల టీజర్స్‌ విడుదల చేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇంత భారీగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని హీరో ఉపేంద్ర చెప్పారు. తన పుట్టినరోజున ఇదో వెల కట్టలేని భారీ బహుమతి అని ఆయన తెలిపారు. నిర్మాత ఇచ్చిన సహకారం వల్ల ఈ సినిమాను ఎంతో వేగంగా పూర్తి చేసినట్లు దర్శకుడు ఆర్యన్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో సహ నిర్మాతలు కంచర్ల సుబ్బలక్మి, కంచర్ల సునీత, మిగిలిన సినిమాల దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-31T06:13:17+05:30 IST