ఫిబ్రవరి...హౌస్‌ఫుల్!
ABN , First Publish Date - 2023-01-31T00:25:02+05:30 IST
యేడాదిలో అతి చిన్న నెల ఫిబ్రవరి. లీపు సంవత్సరం మినహాయిస్తే 28 రోజులే ఉంటాయి. అయితేనేం... చిత్రసీమకు సందడి తీసుకురావడానికి అవి చాలు కదా...

28 రోజుల్లో 17 చిత్రాలు
యేడాదిలో అతి చిన్న నెల ఫిబ్రవరి. లీపు సంవత్సరం మినహాయిస్తే 28 రోజులే ఉంటాయి. అయితేనేం... చిత్రసీమకు సందడి తీసుకురావడానికి అవి చాలు కదా..?! నిర్మాతలు ఇలానే ఆలోచించారు. అందుకే ఈనెలలో ఏకంగా 17 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. సాధారణంగా కొత్త యేడాది ప్రారంభంలో అంటే... సంక్రాంతికి వరుసగా సినిమాలు విడుదల అవుతాయి.
ఆ ఊపు నెలంతా కనిపిస్తుంది. ఫిబ్రవరిలో కొత్త సినిమాల హవా తగ్గుతుంది. మళ్లీ వేసవి సెలవుల్లో జోరుగా సినిమాలొస్తాయి. అయితే ఈ యేడాది అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఫిబ్రవరిలోనూ బాక్సాఫీసు కళకళలాడబోతోంది. ఓ రకంగా ఇది మినీ సంక్రాంతి అనుకోవాలి.
ఫిబ్రవరి 3 నుంచే సినిమాల హడావుడి ప్రారంభం కాబోతోంది. సందీప్ కిషన్ ‘మైఖేల్’, సుహాస్ నటించిన ‘రైటర్ పద్మభూషణ్’ ఆ రోజే వస్తున్నాయి. సందీప్ కిషన్ ఈసారి పాన్ ఇండియా ఆడియన్స్‌ని టార్గెట్ చేశాడు. ‘మైఖేల్’ దక్షిణాదిన అన్ని భాషల్లోనూ విడుదల అవుతోంది. హిందీలోనూ ఈ చిత్రాన్ని డబ్ చేస్తున్నారు. యాక్షన్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. సందీప్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందించారు. విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్ ప్రధాన పాత్రలు పోషించడం విశేషం. సుహాస్ మరోసారి వినోదాలు పంచడానికి సిద్ధమయ్యాడు. ‘రైటర్ పద్మభూషణ్’ సున్నితమైన కామెడీతో సాగే సినిమా అని, అయితే పతాక దృశ్యాల్లో వచ్చే ట్విస్ట్ ఆశ్చర్యపరుస్తుందని చిత్రబృందం చెప్పింది. ఈ సినిమా విడుదలకు ముందే రెండు తెలుగు రాష్ర్టాల్లోని ప్రధాన పట్టణాలలో ప్రీమియర్లు ప్రదర్శిస్తున్నారు.
మలయాళంలో మంచి విజయాన్ని అందుకొన్న చిత్రం ‘కప్పేలా’. తెలుగులో బుట్టబొమ్మగా విడుదల చేస్తున్నారు. సితార ఎంటర్టైన్‌మెంట్స్ సంస్థ రూపొందించి చిత్రమిది. జనవరిలోనే విడుదల కావాల్సింది. కొన్ని కారణాల వల్ల ఓ వారం ఆలస్యంగా తీసుకొస్తున్నారు. ప్రచార చిత్రాలు, పాటలూ ఆకట్టుకొన్నాయి. సినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ‘వేయ్ దరువేయ్’, ‘రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం’, ‘ప్రేమదేశం’ చిత్రాలనూ ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేద్దామనుకొంటున్నారు. ఈ చిత్రాల రిలీజ్ డేట్‌పై క్లారిటీ రావాల్సివుంది.
‘బింబిసార’తో ఓ మంచి విజయాన్ని అందుకొన్నారు కల్యాణ్ రామ్. ఈ సినిమాతో ఆయన ఫామ్‌లోకి వచ్చారు. ఇప్పుడు ఆయన చేస్తున్న ‘అమిగో్‌స’పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఫిబ్రవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేయడం విశేషం. స్నేహం, శత్రుత్వం నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ ముగ్గురూ స్నేహితులా? శత్రువులా? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ప్రచార చిత్రాలు మాత్రం చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తున్నాయి. ‘బ్రేక్ అవుట్’, ‘చెడ్డీ గ్యాంగ్ తమాషా’, ‘సాల్మన్’ చిత్రాల్నీ ఫిబ్రవరి రెండో వారంలోనే విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
గుణశేఖర్ - సమంత కాంబినేషన్‌లో రూపుదిద్దుకొన్న చిత్రం ‘శాకులంతం’. ఈ చిత్ర నిర్మాణంలో దిల్ రాజు భాగస్వామి. అత్యంత భారీ బడ్జెట్‌తో, వ్యయ ప్రయాసలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. త్రీడీలో ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతుల్ని పంచడానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 17న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మణిశర్మ స్వర పరిచిన బాణీలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ధనుష్ ‘సార్’ని సైతం 17నే విడుదల చేద్దామనుకొన్నారు. అయితే ఈ డేట్ మారే అవకాశం ఉంది. విశ్వక్‌సేన్ కథానాయకుడిగా నటించిన ‘దమ్కీ’ కూడా ఇదే రోజున రానుంది. ఇందులో విశ్వక్ ద్విపాత్రాభినయం చేయడమే కాదు, దర్శకుడిగానూ బాధ్యతలు స్వీకరించాడు. కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. 17న ఈ చిత్రం విడుదల కానుంది. తిరుమల తిరుపతి నేపథ్యంలో సాగే కథ ఇది. ట్రైలర్‌లో ఫన్ బాగా
పండింది. వెండి తెరపై కూడా అదే వర్కవుట్ అయితే.. సినిమా హిట్టే.
మొత్తానికి ఫిబ్రవరిలో కొత్త సినిమాల హడావుడితో... డేట్లన్నీ హౌస్‌ఫుల్ అయిపోయాయి. థియేటర్ల ముందు కూడా హౌస్‌ఫుల్ బోర్డు పడితే - నిర్మాతలు, పరిశ్రమ ఫుల్ హ్యాపీ. మరి ఫిబ్రవరిలో తెలుగు సినిమా జాతకం ఎలా ఉండబోతోందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.