Even the remake will entertain the audience : రీమేక్ అయినా ప్రేక్షకులను అలరిస్తుంది
ABN , First Publish Date - 2023-08-07T03:46:40+05:30 IST
‘మంచి కంటెంట్ ఉన్న సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే తప్పేంటో నాకు తెలియట్లేదు. ఏ సినిమా అయినా నాకు నచ్చితేనే చేస్తాను. నచ్చితేనే చూస్తాను. భోళాశంకర్ కూడా నాకు నచ్చింది. మిమ్మల్ని కూడా అలరిస్తుంది’...

‘మంచి కంటెంట్ ఉన్న సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే తప్పేంటో నాకు తెలియట్లేదు. ఏ సినిమా అయినా నాకు నచ్చితేనే చేస్తాను. నచ్చితేనే చూస్తాను. భోళాశంకర్ కూడా నాకు నచ్చింది. మిమ్మల్ని కూడా అలరిస్తుంది’ అని చిరంజీవి అన్నారు. ఆయన హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన చిత్రమిది. తమన్నా, కీర్తిసురేశ్ కీలకపాత్రలు పోషించారు. ఈ నెల 11న విడుదలవుతోంది. ఆదివారం చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. చిరంజీవి మాట్లాడుతూ ‘‘వేదాళం’ సినిమా ఓటీటీలో లేదు కాబట్టి ఎవరూ చూసి ఉండరు. సూపర్‌హిట్ అవుతుందనే భరోసాతో ప్రతిరోజూ ఉత్సాహంతో షూటింగ్ చేశాం. మెహర్ రమేశ్ పరిశ్రమలో నాకు మరో తమ్ముడు. నేను గర్వపడేలా చేశాడు. మా రికమెండేషన్ లేకుండా, కష్టపడి పైకొచ్చాడు. ఈ సినిమాకు పూర్తి న్యాయం చేశాడు. పాత్ర నిడివి ఎంత ఉన్నా చిరంజీవితో చేస్తానని సుశాంత్ ముందుకొచ్చాడు. తమన్నా అద్భుతంగా నటించారు. ఈ రోజుల్లో గొప్ప నటి ఎవరంటే కీర్తిసురేశ్ పేరే చెప్పాలి. తనతో నటించడం నదిలో పడవ ప్రయాణంలా ఆహ్లాదంగా ఉంటుంది. మణిశర్మ గారి అబ్బాయి మహతి స్వర సాగర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాపై ఫ్యాషన్ ఉన్న నిర్మాత అనిల్. నా కెరీర్ ఏమవుతుందో అనే భయంతో తొలినాళ్లలో చిన్న చిన్న పాత్రలు కూడా చేశాను. ప్రేక్షకులే నాకు ప్రథమం. ఏం చేసినా వాళ్లని దృష్టిలో పెట్టుకొనే. ప్రేక్షకులు ఇచ్చిన ఎనర్జీ వల్లే బాగా నటించగలుగుతున్నాను. ఇండస్ట్రీకి ఇప్పుడు కొత్త రక్తం అవసరముంది’ అన్నారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘చిరంజీవి గారు చూడని సక్సెస్ లేదు. ఆయనతో సినిమాలు చేస్తూ పెరిగాను. కొన్నేళ్ల క్రితం చిరంజీవి గారు చేస్తున్న సేవలను కించపరిస్తే వారితో 12 ఏళ్లు పోరాడి జైలు శిక్ష వేయించే వరకూ ఊరుకోలేదు’ అని చెప్పారు.
మెహర్ రమేశ్ మాట్లాడుతూ ‘నేను మెగాస్టార్ అభిమానుల్లో నుంచి వచ్చాను. నాపైన మెగాస్టార్ అనే వెలుగు పడింది. ‘భోళాశంకర్’ నాకు పునర్జన్మ. ‘గ్యాంగ్‌లీడర్, రౌడీ అల్లుడు’ తర్వాత ఆ స్థాయిలో ఉంటుంది’ అని తెలిపారు. అనిల్ సుంకర మాట్లాడుతూ ‘చిరంజీవితో సినిమా చేయలనే కలను రమేశ్‌గారు నిజం చేశారు. చిరంజీవిగారు గొప్ప మానవతావాది. ‘భోళా శంకర్’ రూపంలో అభిమానులకు గిఫ్ట్ ఇస్తున్నాం’ అన్నారు. సుశాంత్ మాట్లాడుతూ ‘మెహర్ రమేశ్ ఈ సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డారు. నాది చిరుగాలిలా ఉండే అతిథి పాత్ర. తమన్నా నాకు సిస్టర్‌గా చేశారు. చిరంజీవిగారితో కలసి స్టెప్ వేయడం నా అదృష్టం’ అన్నారు. చిరంజీవి లాంటి గొప్ప నటుడి తో పనిచేయడం అరుదైన అవకాశమని కీర్తిసురేశ్ చెప్పారు.