Dussehra movie celebrations : దసరా సినీ సంబరాలు
ABN , First Publish Date - 2023-10-25T01:39:01+05:30 IST
దసరా పర్వదినాన చిత్రసీమ కొత్త సినిమా కబుర్లతో కళకళలాడిపోయింది. కొత్త కాంబినేషన్లు క్లాప్ కొట్టుకొన్నాయి. పోస్టర్లు మిరిమిట్లు గొలిపాయి. పాటలు, టీజర్లు సందడి చేశాయి...

దసరా పర్వదినాన చిత్రసీమ కొత్త సినిమా కబుర్లతో కళకళలాడిపోయింది. కొత్త కాంబినేషన్లు క్లాప్ కొట్టుకొన్నాయి. పోస్టర్లు మిరిమిట్లు గొలిపాయి. పాటలు, టీజర్లు సందడి చేశాయి. ఈ విజయదశమి రోజున ఏ పని మొదలెట్టినా విజయం తథ్యమన్న సెంటిమెంట్‌తో... టాలీవుడ్ సానుకూల దృక్పథంతో అడుగు వేసింది. కొత్త కబుర్లు మోసుకొచ్చింది. ఈ విశేష మాలిక ఇది!
క్లాప్.. క్లాప్!
చిరంజీవి - వశిష్ట కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం సోమవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి రాఘవేంద్రరావు క్లాప్‌కొట్టారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చంద్రబోస్ పాటలు రాస్తున్నారు. కీరవాణి, చంద్రబోస్ కలయికలో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలైపోయాయి. ఈ చిత్రంలో ఆరు పాటలుంటాయని కీరవాణి చెప్పారు. ఓ అరుదైన చిత్రానికి పాటలు రాసే అవకాశం దక్కిందని చంద్రబోస్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘అంటే.. సుందరానికి’ తరవాత నాని - వివేక్ ఆత్రేయ కాంబోలో మరో సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. దీనికి ‘సరిపోదా.. శనివారం’ అనే టైటిల్ ఖరారు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తొలి సన్నివేశానికి వి.వి.వినాయక్ క్లాప్ కొట్టారు. ప్రియాంకా అరుణ్ మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్.జె.సూర్య కీలక పాత్రఽధారి. డి.వి.వి.దానయ్య నిర్మాత.
పోస్టర్లూ.. పాటలు
పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఓజీ’ చిత్రాలు ఇప్పుడు సెట్స్‌పై ఉన్నాయి. వాటికి సంబంధించిన లుక్స్ పండగ సందర్భంగా బయటకు వచ్చాయి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న పవన్.. యాక్షన్ మోడ్‌లో ఉన్నాడు. ‘ఓజీ’లుక్‌లో పవన్ తీక్షణమైన చూపులు ఆకట్టుకొంటున్నాయి. మహేశ్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నుంచి కూడా ఓ కొత్త పోస్టర్ విడుదలైంది. తొలి పాటని త్వరలోనే వినిపిస్తామని చిత్రబృందం ప్రకటించింది. రామ్ చరణ్ - శంకర్ కాంబోలో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా నుంచి తొలి పాటని దీపావళికి విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఓ ఆసక్తికరమైన పోస్టర్ అభిమానులతో పంచుకొంది. కల్యాణ్ రామ్ కొత్త సినిమా ‘డెవిల్’ నుంచి ఓ స్టైలీష్ పోస్టర్‌ని దసరా కానుకగా విడుదల చేశారు. కార్తి కొత్త సినిమా ‘జపాన్’ నుంచి తొలి పాట రిలీజ్ చేశారు. అను ఇమ్మానియేల్ కథానాయిక. రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది. తేజా సజ్జా ‘హనుమాన్’ అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ఈలోగా.. దసరా రోజున ఈ సినిమా నుంచి ఓ పోస్టర్ వదిలారు. సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘హరోం హర’ పోస్టర్ కూడా దసరా రోజునే బయటకు వచ్చింది. రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా ‘బబుల్‌గమ్’ అనే సినిమాతో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి తొలి గీతాన్ని నవంబరు 3న విడుదల చేస్తారు. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూరుస్తున్నారు. శివ కందుకూరి కొత్త సినిమా ‘భూతద్దం భాస్కర్’ నుంచి ‘కాకా నీ చూపే టెక్కా’ అనే గీతాన్ని దసరా రోజున రిలీజ్ చేశారు. రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాట మంచి హుషారుగా సాగిపోయింది.