ఆత్మాభిమానం భానుమతి ఆభరణం
ABN , First Publish Date - 2023-09-07T02:26:48+05:30 IST
ఎల్లలు లేని ప్రతిభకు ... డాక్టర్ భానుమతీ రామకృష్ణ నిదర్శనం. ఆ రోజుల్లో తెలుగు చిత్రపరిశ్రమలో ఈ పేరు ధైర్యానికి పర్యాయపదం. అసలు ఆ పేరులోనే గాంభీర్యం ఉంది. అది ఆవిడ ప్రతి కదలికలో, చేసే ప్రతి పనిలో సుస్పష్టంగా కనిపించేది.

ఎల్లలు లేని ప్రతిభకు ... డాక్టర్ భానుమతీ రామకృష్ణ నిదర్శనం. ఆ రోజుల్లో తెలుగు చిత్రపరిశ్రమలో ఈ పేరు ధైర్యానికి పర్యాయపదం. అసలు ఆ పేరులోనే గాంభీర్యం ఉంది. అది ఆవిడ ప్రతి కదలికలో, చేసే ప్రతి పనిలో సుస్పష్టంగా కనిపించేది.
భానుమతి నటి మాత్రమే కాదు.. రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు, దర్శకురాలు, నిర్మాత, స్టూడియో అధినేత.. ఇలా ప్రతి శాఖలోనూ తన ప్రజ్ఞను చాటుకున్న అరుదైన వ్యక్తి. పలు విధాలుగా ఇలా తన ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన నటి భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే వేరొకరు కనిపించరు. అహంభావాన్ని కూడా అందంగా ప్రదర్శించగలిగిన నేర్పు భానుమతికి మాత్రమే సొంతం. ఇందుకు ఆవిడ బహుముఖ ప్రజ్ఞ కంచు కవచంలా నిలిచి ప్రతిభకు మరిన్ని మెరుగులు దిద్దింది. ఇన్ని శాఖల్లో ప్రావీణ్యం సంపాదించుకున్నా తన గౌరవానికి ఏ మాత్రం భంగం వాటిల్లకుండా క్రమశిక్షణతో మెలిగిన అరుదైన వ్యక్తితం ఆవిడది. తన ప్రతిభను దక్షిణ దేశపు సరిహద్దులు దాటించి ఉత్తర ప్రాంతంలోనూ అభినందనలు అందుకున్నారు
1924 సెప్టెంబర్ ఏడున సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన భానుమతి 14 ఏళ్ల వయసులో తొలి చిత్రం ‘వరవిక్రయం’లో నటించారు. 20 ఏళ్ల వయసులో రామకృష్ణను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. . 21వ ఏటా నిర్మాతగా మారారు. 25 ఏళ్లకు తన ఏకైక కుమారుడు భరణి పేరు మీద స్టూడియో నిర్మించారు. 28 ఏళ్లకు దర్శకురాలిగా మారారు.
అయితే ఇవేమీ ఆవిడ కోరుకున్నవి కావు. సాదాసీదా మధ్యతరగతి ఇల్లాలిగా, పిల్లా పాపలతో సంసారం సాగించాలనేది భానుమతి కోరికగా ఉండేది. తను ఒకటి తలిస్తే దైవం వేరే రకంగా ఆమె జీవితాన్ని మలిచాడు. అయితే తను ఎంత బజీగా ఉన్నా కోరుకున్న గృహిణి జీవితాన్ని హాయిగా గడిపేశారు
‘వరవిక్రయం’తో చిత్రరంగ ప్రవేశం
సి.పుల్లయ్య ‘వరవిక్రయం’(1939). అందులో కాళింది పాత్ర కోసం ఓ కొత్త నటిని అన్వేషిస్తున్నారు. భానుమతి విషయం ఆయనకు స్నేహితుల ద్వారా తెలిసింది. అయితే . సినిమాలో అవకాశం అనగానే భానుమతి తండ్రి సుబ్బయ్య మొదట ఒప్పుకోలేదు కానీ ‘లవకుశ’ సినిమా తీసిన దర్శకుడని తెలియగానే కాస్త మెత్తబడ్డారు. అయితే భానుమతి నటించాలంటే కొన్ని షరతులకు అంగీకరించాల్సిందే అన్నారు. అన్నింట్లోకి ముఖ్యమైంది.. భానుమతి పక్కన హీరో ఎవరూ ఉండకూడదన్నది. ఆమె ఒంటి మీద మగవాళ్లెవరూ చేయి వేయకూడదన్నది రెండో షరతు. (తన కూతురిపై చిత్రీకరించే ప్రేమ సన్నివేశాల్లో కౌగిలింతలు ఉండకూడదని సుబ్బయ్య పెట్టిన షరతు ప్రభావం ఆమె సినీ జీవితంపై చాలా కాలం పనిచేసింది. ఆ తరువాతి కాలంలో కూడా ఆమెని కౌగిలించుకోవడానికి హీరోలు సంశయించేవారు) అన్నింటికీ పుల్లయ్య అంగీకరించడంతో ఆ సినిమాలో ‘కాళింది’ పాత్రను భానుమతి పోషించారు. అనంతరం పుల్లయ్య దర్శకత్వం వహించిన మరో చిత్రం ‘మాలతీ మాధవం’ (1940)లో మాలతి పాత్రను ఆమె పోషించారు. నటిగా అనుభవం లేకపోయినా చక్కని కంఠస్వరం కలిగి ఉండటంతో ఆ వేషం ఆమెని వరించింది. ఈ చిత్రం దెబ్బతిన్నా, భానుమతి పాటలు బాగున్నాయని అందరూ మెచ్చుకున్నారు. మొదటి, రెండు చిత్రాల్లోలా కాకుండా ‘ధర్మపత్ని’ సినిమాలోని ఉమ పాత్రను భానుమతి స్వేచ్ఛగా నటించగలిగారంటే దానికి దర్శకుడు పి.పుల్లయ్య కూడా కొంత కారణం. విషాదభరిత పాత్రలకు తప్ప భానుమతి పనికిరాదేమో అనే ముద్ర ఆమె మీద పడే సమయంలో వాటికి భిన్నమైన పాత్ర ఇందులో పోషించి పేరు తెచ్చుకున్నారు.
రామ‘కృష్ణప్రేమ’
భానుమతి జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం ‘కృష్ణప్రేమ’(1943). ఆ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న పాలువాయి రామకృష్ణతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, వారి పెళ్లికి దారి తీసింది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా 1943 ఆగస్టు 8న మద్రాసు చైనా బజారులో ఉన్న బైరాగి మఠ దేవాలయంలో వీళ్లిద్దరి పెళ్లి జరిగింది. పెళ్లి తరవాత కొంతకాలం నటనకు దూరంగా ఉన్నా, భర్త ప్రోత్సాహంతో తిరిగి ‘స్వర్గసీమ’ చిత్రం నుంచి ఆమె నటించడం ప్రారంభించారు. వీరి ఏకైక తనయుడు భరణి పేరు మీద చిత్ర నిర్మాణ సంస్థను, స్టూడియోను ఏర్పాటు చేసి ఎన్నో వైవిథ్యమైన చిత్రాలను నిర్మించారు ఈ దంపతులు. భానుమతి తరంలో అగ్రహీరోలుగా ఉన్న ఎన్టీఆర్, ఏయన్నార్ భరణి చిత్రాల్లో హీరోలుగా నటించారు. ఈ సంస్థలో ఏయన్నార్ పర్మనెంట్ హీరో కాగా, ‘చండీరాణి’, ‘చింతామణి’, ‘వివాహబంధం’, ‘అమ్మాయి పెళ్లి’ చిత్రాల్లో ఎన్టీఆర్ నటించారు. భానుమతి నటించిన చివరి చిత్రం 1998లో వచ్చిన ‘పెళ్లికానుక’.
అదీ ఆమె వ్యక్తిత్వం
తన నటనతో ఎదుట ఉన్న నటీనటులను డామినేట్ చేసేవారు భానుమతి. తన వ్యక్తిత్వానికి తగ్గట్లుగా పాత్ర ఉంటేనే ఆమె నటించడానికి అంగీకరించేవారు. కథానాయిక పాత్ర నుంచి బామ్మ పాత్ర వరకూ భానుమతి ఏ పాత్ర పోషించినా అందులో ఆమె ఆధిక్యతే కనిపిస్తుంది.
అరుదైన గౌరవాలు, తన ప్రతిభకు తగినన్ని పురస్కారాలు పొంది, తెలుగు సినిమాకు బహుమతిగా మిగిలిన భానుమతి 2005 డిసెంబర్ 25న కన్నుమూశారు. భానుమతి బతికి ఉన్నన్నాళ్లూ అందరూ ఆవిడను పొగరుబోతు అన్నారు. చనిపోయాక వారే అది ఆత్మాభిమానం అన్నారు.
అప్పుడది నిజం.. ఇప్పుడిది నిజం!
(ఇది భానుమతి శత జయంతి సంవత్సరం)