దర్శకుడు కె. వాసు కన్నుమూత
ABN , First Publish Date - 2023-05-27T03:27:06+05:30 IST
తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ దర్శక నిర్మాత కె. వాసు (72)శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు.

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ దర్శక నిర్మాత కె. వాసు (72)శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కె. వాసు అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
సుప్రసిద్ధ దర్శక నిర్మాత ప్రత్యగాత్మ తనయుడే కె. వాసు. వారి బాబాయి. హేమాంబరధరరావు కూడా సుప్రసిద్ధ దర్శకులే. కుటుంబ నేపథ్యంతో సినిమాపై ఆసక్తి పెరగడంతో పదో తరగతితోనే చదవుకు స్వస్తి పలికి వాసు సినీ రంగంలోకి అడుగుపెట్టారు. తండ్రి సినీరంగంలోకి వద్దని వారించినా దర్శకుడవ్వాలనే లక్ష్యంతో వివిధ విభాగాల్లో పని చేస్తూ మంచి పట్టు సాధించారు.
ఎన్టీఆర్ ఆశీస్సులతో...
బాబాయి హేమాంబరధరరావు దగ్గర అప్రంటి్‌సగా పనిచేస్తున్న సందర్భంలో వాసు మహానటుడు ఎన్టీఆర్ కంట్లో పడ్డారు. ఆయన దర్శకత్వ శాఖకు చెందిన పలు మెళకువలను వివరించి చెప్పడమే గాకుండా బాగా కష్టపడి వృద్ధిలోకి రావాలని ఆశీర్వదించాడు. దర్శకుడిగా ఎనిమిదో చిత్రంతోనే తాను ఎంతగానో ఆరాధించిన ఎన్టీఆర్‌ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని అందుకున్నారు వాసు. ‘మాతో ఒక సినిమా చేసుకోండి బ్రదర్’ అని ఎన్టీఆర్ పిలిచి అవకాశం ఇచ్చారు. స్ర్కిప్ట్ నచ్చకపోయినా ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయాలనే కోరికతో ‘సరదా రాముడు’ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయినా తన అభిమాన హీరోను డైరెక్ట్ చేసిన ఆనందాన్ని కె. వాసుకు మిగిల్చింది.
మెగాస్టార్‌కి అవకాశం ఇచ్చారు
తొలి చిత్రం ‘ఆడపిల్లల తండ్రి’తో దర్శకుడిగా సూపర్‌హిట్ అందుకునేనాటికి వాసు వయసు 22. ఈ చిత్రంలో కృష్ణంరాజు హీరోగా నటించారు. విలన్ పాత్రల్లో గుర్తింపు తెచ్చుకున్న నాగభూషణంతో ఈ చిత్రంలో సాత్వికపాత్రలో నటింపజేసి శభాష్ అనిపించుకున్నారు. ఈ సినిమా విడుదలైన చాలా కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. దీంతో దర్శకుడిగా వాసుకు అవకాశాలు వరుస కట్టాయి. దర్శకుడిగా ఆయన రెండో చిత్రం ‘ప్రాణం ఖరీదు’. ఈ సినిమాతో చిరంజీవిని వెండితెరకు హీరోగా పరిచయం చేశారు. ఆ తర్వాత చిరంజీవితో ‘కోతల రాయుడు’ చిత్రం చేశారు. ఇది చిరంజీవికి సోలో హీరోగా తొలి శతదినోత్సవ చిత్రం. ఆ తర్వాత చిరంజీవి, కవిత హీరో హీరోయిన్లుగా ‘ఆరని మంటలు’ చిత్రాన్ని రూపొందించారు. చిరంజీవికి అది తొలి యాక్షన్ చిత్రం. ‘కొన్నేళ్ల క్రితం నేను చిరు పాత్రతో పరిచయం చేసిన ఆ కొత్త కుర్రాడు తర్వాత తెలుగు చలన చిత్ర రంగంలో నంబర్‌వన్‌గా ఎదుగుతాడని, దశాబ్దాల సంచలన చరిత్ర సృష్టిస్తాడని, తెలుగు సినిమా కమర్షియల్ స్టామినాను ఊహించని స్థాయికి తీసుకెళతాడని అప్పుడు నాకూ తెలియదు... చిరంజీవికీ తెలియదు’ అని ఓ సందర్భంలో మెగాస్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
భక్తి చిత్రాలతో
తెలుగు దర్శకుల్లో కె. వాసుకు దక్కిన మరో అరుదైన ఘనత భక్తి చిత్రాలతో సంచలన విజయాలను అందుకోవడం. ఆయన దర్శకత్వం వహించిన ‘శ్రీ షిర్డీసాయిబాబా మహత్యం’, ‘అయ్యప్పస్వామి మహత్యం’ తెలుగునాట ఘన విజయం అందుకున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రాల్లోని పాటలు ఇప్పటికి తెలుగు నేలపై వినిపిస్తూనే ఉన్నాయి. 2008లో విడుదలైన ‘గజిబిజి’ దర్శకుడిగా ఆయనకు చివరి చిత్రం.