త్రీడీ ఆలోచన దిల్‌రాజుదే!
ABN , First Publish Date - 2023-03-29T02:37:42+05:30 IST
గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శాకుంతలం’. సమంత ప్రధాన పాత్రధారి. నీలిమ గుణ నిర్మాత. దిల్‌రాజు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ట్రైలర్ ఆవిష్కరించారు...

గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శాకుంతలం’. సమంత ప్రధాన పాత్రధారి. నీలిమ గుణ నిర్మాత. దిల్‌రాజు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ట్రైలర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గుణశేఖర్ మాట్లాడుతూ ‘‘సమంత ప్రాణం పెట్టి చేసిన సినిమా ఇది. కాళిదాసు రాసిన ‘అభిజ్ఞాన శాకుంతలం’లో చిన్న చిన్న మార్పులు చేసి, విజువల్ వండర్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాం. దిల్ రాజు లాంటి మేకర్ తోడవ్వడం అదనపు బలాన్ని ఇచ్చింద’’న్నారు. దిల్ రాజు మాట్లాడుతూ ‘‘నా స్వార్థం కోసమే ఈ సినిమాలో భాగం పంచుకొన్నా. తెలుగు సినిమా స్థాయి పెరిగింది. విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా అద్భుతాలు చేస్తున్నాం. అదెలాగో తెలుసుకోవడానికి ‘శాకుంతలం’లో భాగమయ్యా. 2 గంటల 19 నిమిషాల నిడివి ఉన్న చిత్రమిది. ఎక్కడా బోర్ కొట్టద’’న్నారు. నీలిమ గుణ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాని త్రీడీలో తీసుకురావాలన్నది దిల్‌రాజు గారి ఆలోచనే. అప్పుడు చాలా భయపడ్డాం. కానీ ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే ఆయన ఆలోచన ఎంత గొప్పదో అర్థం అవుతోంద’’న్నారు. ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు.