అభిమానుల గుండెల్లో ‘కెప్టెన్‌’

ABN , Publish Date - Dec 29 , 2023 | 12:30 AM

తమిళ సినీ, రాజకీయరంగాల్లో నాలుగు దశాబ్దాలకు పైగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు విజయకాంత్‌ మరణవార్తతో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో...

అభిమానుల గుండెల్లో ‘కెప్టెన్‌’

తమిళ సినీ, రాజకీయరంగాల్లో నాలుగు దశాబ్దాలకు పైగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు విజయకాంత్‌ మరణవార్తతో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఆయన కోలీవుడ్‌కు అందించిన సేవలను, నటుడిగా ఆయన ప్రయాణాన్ని ప్రముఖులు, సినీ ప్రియులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా విజయ్‌కాంత్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు...

అసలు పేరు విజయరాజ్‌ అళగర్‌స్వామి

విజయకాంత్‌ విలన్‌ పాత్రతోనే సినీ కెరీర్‌ను ప్రారంభించారు. 1979లో ఎంఏ ఖాజా దర్శకత్వం వహించిన ‘ఇనిక్కుం ఇళమై’ చిత్రంతో ఆయన సినీ ప్రస్థానం మొదలైంది. ఒక్కో పాత్ర చేస్తూ వచ్చిన విజయకాంత్‌.. ఆనక హీరోగా ఎదిగారు. ఈయన హీరోగా నటించిన ‘చట్టం ఒక ఇరుట్టరై’ చిత్రం 1981లో విడుదలైంది. ఈ సినిమా ఘన విజయం సాధించి.. ఆయన సినీ కెరీర్‌కు మైలురాయిగా నిలిచింది. 1984లో ఆయన ఏకంగా 18 చిత్రాల్లో నటించారు. విజయకాంత్‌ అసలు పేరు నారాయణన్‌ విజయరాజ్‌ అళగర్‌స్వామి. ఆ పేరుతో కలిసి రాలేదని జ్యోతిష్యుల సూచనల మేరకు విజయరాజ్‌లోని ‘రాజ్‌’ అనే పదాన్ని తొలగించి ‘కాంత్‌’ అని చేర్చుకున్నారు. అప్పటి నుంచి ఆయన విజయకాంత్‌గా సినీప్రపంచంలో సుస్థిరస్థానం సంపాదించుకున్నారు. 1989లో వచ్చిన ‘సెంధూర పూవే’ (తెలుగులో సింధూర పువ్వు) దక్షిణాది భాషల్లో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ చిత్రంలో విజయకాంత్‌ నటనకు తమిళనాడు ప్రభుత్వం ఉత్తమ నటుడిగా అవార్డుతో సత్కరించింది. విజయకాంత్‌ నటించిన చిత్రాల్లో ప్రధానంగా దేశభక్తిని పెంచే డైలాగులు, అవినీతి, అక్రమాలను అరికట్టే అంశాలు, సమాజ సందేశంతో కూడినవే అధికం. ఆయన 154 చిత్రాల్లో నటించారు. ఆయన పలు చిత్రాలను నిర్మించడంతో పాటు దర్శకత్వం కూడా వహించారు. చివరిగా ఆయన 2015లో రూపొందిన ‘సగప్తం’ చిత్రంలో నటించారు. ఆయన చిన్నకుమారుడు షణ్ముగపాండ్యన్‌ హీరోగా రూపొందిన ఈ చిత్రంలో విజయకాంత్‌ అతిథిపాత్ర పోషించారు. ‘కెప్టెన్‌ సినీ క్రియేషన్స్‌’ పతాకంపై ఆయన తన బావమరిది ఎల్‌కే సుధీ్‌షతో కలిసి 8 చిత్రాలు నిర్మించారు. 2010లో నిర్మితమైన ‘విరుదగిరి’ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహించారు. ఆయన నటించిన కెప్టెన్‌ ప్రభాకర్‌, సిందూర పువ్వు, పోలీసు అధికారి చిత్రాలు తెలుగులో కూడా విజయం సాధించాయి.

కెప్టెన్‌ పేరు ఎలా వచ్చిందంటే...

తమిళ ఇండస్ట్రీలో ‘పురట్చి కలైంజర్‌’గా గుర్తింపు పొందిన విజయకాంత్‌ వందో చిత్రం ‘కెప్టెన్‌ ప్రభాకరన్‌’. ఆ చిత్రం సూపర్‌డూపర్‌ హిట్టవ్వడంతో అప్పటి నుంచి అభిమానులు ఆయన్ని ముద్దుగా కెప్టెన్‌ అని పిలుచుకుంటున్నారు. ఆ పేరే చిరస్థాయిగా నిలిచిపోయింది. శ్రీలంకలో భాగంగా ఉన్న జాఫ్నా తమిళులను కష్టాల నుంచి గట్టెక్కించేందుకు తన వంతు సాయం చేసిన విజయకాంత్‌.. లంక తమిళుల హక్కుల కోసం పోరాడుతున్న ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్‌ పేరుతో తన వందో చిత్రాన్ని రూపొందించడం గమనార్హం. ప్రభాకరన్‌ అంటే విజయకాంత్‌కు విపరీతమైన అభిమానం. అంతేగాక తన పెద్ద కుమారుడికి కూడా విజయ్‌ ప్రభాకరన్‌ అని పేరు పెట్టారు.

తెలుగు కుటుంబం..

తమిళ సినీ, రాజకీయరంగాల్లో కీలకంగా వ్యవహరించిన విజయకాంత్‌ తెలుగు కుటుంబానికి చెందిన కమ్మనాయుడు. మదురైలో కేఎన్‌ అళగర్‌స్వామి, ఆండాళ్‌ దంపతులకు విజయకాంత్‌ 1952లో ఆగస్టు 25వ తేదీన జన్మించారు. విజయకాంత్‌కు ఆది నుంచే చదువు అబ్బలేదు. అందుకే ఆయన పదో తరగతి వరకు మాత్రమే చదివారు. ఆయన తన తండ్రితో కలిసి రైస్‌ మిల్లులో పనిచేశారు. ఆది నుంచి నటనపై అమితాసక్తి కలిగిన విజయ్‌కాంత్‌.. ఎంజీఆర్‌కు వీరాభిమాని. అందుకే ఆయన చిత్రాలన్నింటినీ వదలకుండా చూసేవారు. సినిమా అవకాశాల కోసం చెన్నైకు మకాం మార్చారు. పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ఆయన అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. 1979లో ‘అగల్‌ విళక్కు’ ద్వారా తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. అప్పటి నుంచి 2015 వరకు తన సినీ ప్రయాణాన్ని సాగించారు. 1990లో జనవరి 31వ తేదీన ప్రేమలతను విజయకాంత్‌ వివాహం చేసుకున్నారు.

మనసున్న మారాజు...

విజయకాంత్‌ గొప్ప మనసున్న వ్యక్తి. ఆకలిగొన్నవాళ్లకు అన్నం పెట్టడం కంటే మించినదేదీ లేదని ఆయన భావించేవారు. సినిమాల్లో అవకాశాలు రావడం మొదలైనప్పటి నుంచి ఆయన ప్రతిపూటా కనీసం వందమంది నిరుపేదలకు అన్నం పంపిణీ చేశాకే తను భోజనం చేసేవారు. ఈ దానగుణమే ఆయన్ని అనతికాలంలోనే నాయకుణ్ణి చేసింది. 1989లో ఈరోడ్‌, చెన్నై సాలిగ్రామంలో ఉచిత ఆసుపత్రులు ఏర్పాటు చేశారు. ప్రతి యేడాది వందలాదిమంది పేద విద్యార్థులకు విద్యా సహాయాలు, ఎంజీఆర్‌ డెఫ్‌ అండ్‌ డమ్‌ స్కూల్‌, లిటిల్‌ ఫ్లవర్‌ బ్లైండ్‌ స్కూళ్లకు భారీగా ఆర్థిక సహాయాలు అందించేవారు. రాష్ట్ర వ్యాప్తంగా 60కి పైగా కంప్యూటర్‌ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉచిత కళ్యాణ వేదికలతో అనేక పేద జంటలకు వివాహాలు జరిపించారు. గుజరాత్‌ భూకంపం, కార్గిల్‌ యుద్ధం, సునామీ, కుంభకోణం పాఠశాల అగ్నిప్రమాదం వంటి అనేక విషాద సమయాల్లో తన సొంత ఖర్చుతో బాధితులకు సాయం చేశారు. తనకు తొలిసారిగా సినిమాల్లో అవకాశం ఇచ్చిన దర్శకుడు ఏంఏ ఖాజా కుటుంబం బాగోగులను చివరి వరకు ఆయనే చూశారు. పండగొచ్చినా, పబ్బమొచ్చినా తొలిగా ఖాజా కుటుంబాన్ని కలిశాకే ఇతర కార్యక్రమాలు నిర్వహించేవారు. అంతేగాక ఒకప్పుడు స్థానిక టి.నగర్‌లోని రాజాబాదర్‌ వీధిలో వున్న విజయకాంత్‌ కార్యాలయానికి ఎవరు వెళ్లినా ఆదరించి భోజనం పెట్టేవారు. 2001లో శ్రీ ఆండాళ్‌ అళగర్‌ పేరుతో ఇంజనీరింగ్‌ కాలేజీని స్థాపించారు. ఈ కాలేజీకి విజయకాంత్‌ భార్య ప్రేమలత ఛైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు.

చెన్నై(ఆంధ్రజ్యోతి)

Updated Date - Dec 29 , 2023 | 12:30 AM