బాయ్స్‌ హాస్టల్‌ అందర్నీ నవ్విస్తుంది

ABN , First Publish Date - 2023-08-24T02:49:09+05:30 IST

‘‘మంచి సినిమా వస్తే చాలు. ఆదరించే ప్రేక్షకులు మన దగ్గర ఉన్నారు. అందుకే కన్నడ చిత్రాన్ని తెలుగులో డబ్‌ చేశాం. ఇక్కడ కూడా ఈ చిత్రానికీ ఘన విజయం దక్కుతుందని నమ్ముతున్నా’’...

బాయ్స్‌ హాస్టల్‌ అందర్నీ నవ్విస్తుంది

‘‘మంచి సినిమా వస్తే చాలు. ఆదరించే ప్రేక్షకులు మన దగ్గర ఉన్నారు. అందుకే కన్నడ చిత్రాన్ని తెలుగులో డబ్‌ చేశాం. ఇక్కడ కూడా ఈ చిత్రానికీ ఘన విజయం దక్కుతుందని నమ్ముతున్నా’’ అన్నారు సుప్రియ. కన్నడలో సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘హుడుగారు బేకగిద్దరే’ చిత్రాన్ని తెలుగులో ఈనెల 26న ‘హాస్టల్‌ బాయ్స్‌’ పేరుతో విడుదల చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ పంపిణీ చేస్తోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుప్రియ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా చూస్తున్నంతసేపూ నవ్వుతూనే ఉన్నా. అంత జాయ్‌ఫుల్‌గా సాగిపోయింది. తెలుగు ప్రేక్షకులకూ నచ్చుతుందని నమ్మాను. నేనే కాదు.. రేపు ఈ సినిమాని థియేటర్లో చూసిన ప్రతి ఒక్కరూ హాయిగా నవ్వుకొంటారు. కొన్ని సినిమాల్ని రీమేక్‌ చేయడం కుదరదు. ఆ ఫీల్‌ పోతుంది. అందుకే కన్నడ సినిమాని డబ్బింగ్‌ చేశాం. డబ్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొన్నాం. రష్మితో కొన్ని సీన్లు రీషూట్‌ చేసి జోడించాం. డైలాగుల్ని యధాతధంగా అనువదించలేదు. మన ఫీల్‌ పోకుండా.. వాటిని చక్కగా రీరైట్‌ చేశాం. చాయ్‌ బిస్కెట్‌ లాంటి సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో వారితో మరిన్ని సినిమాలు చేస్తాం’’ అన్నారు. అన్నపూర్ణ స్టూడియో గురించి మాట్లాడుతూ ‘‘స్టూడియో అనేది చాలా పెద్ద బాధ్యత. అన్నపూర్ణతో పాటు మొదలైన కొన్ని ప్రతిష్టాత్మక స్టూడియోలు ఎప్పుడో మూతపడ్డాయి. మేం మాత్రం నిలకడగా సినిమాలు చేస్తున్నాం. యేడాదికి ఒక్క సినిమా చేసినా నాణ్యమైన వినోదాన్ని అందించాలనుకొంటున్నాం. నాగేశ్వరరావు గారు ఎంత కష్టపడి ఈ స్టూడియోని నిర్మించారో, నాగార్జున గారు అంతే కష్టపడి ఆ లెగసీని కొనసాగించారు. చైతూ, అఖిల్‌తో త్వరలో మా సంస్థ నుంచి సినిమాలు రాబోతున్నాయ’’న్నారు.

Updated Date - 2023-08-24T02:49:09+05:30 IST