గుండెపోటుతో కన్నుమూసిన బాలీవుడ్‌ దర్శకుడు

ABN , First Publish Date - 2023-03-10T00:46:09+05:30 IST

బాలీవుడ్‌ నటుడు, దర్శకుడు సతీశ్‌ కౌశిక్‌ (66) గురువారం గుండెపోటుతో ఢిల్లీలో కన్నుమూశారు. హోలీ వేడుకల కోసం ఢిల్లీలో ఉన్న స్నేహితుడి ఇంటికి ఆయన వెళ్లారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంట్లో కాస్త నలతగా అనిపించడంతో...

గుండెపోటుతో కన్నుమూసిన బాలీవుడ్‌ దర్శకుడు

బాలీవుడ్‌ నటుడు, దర్శకుడు సతీశ్‌ కౌశిక్‌ (66) గురువారం గుండెపోటుతో ఢిల్లీలో కన్నుమూశారు. హోలీ వేడుకల కోసం ఢిల్లీలో ఉన్న స్నేహితుడి ఇంటికి ఆయన వెళ్లారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంట్లో కాస్త నలతగా అనిపించడంతో ఆస్పత్రికి బయలుదేరారు. మార్గమధ్యంలోనే ఆయన కన్ను మూశారు. సతీశ్‌కు భార్య, పదేళ్ల కుమార్తె ఉన్నారు. ఆయన ఆకస్మిక మరణంతో బాలీవుడ్‌లో విషాద ఛాయలు నెలకొన్నాయి. సతీశ్‌తో చిరకాల అనుబంధం కలిగిన అనుపమ్‌ ఖేర్‌ను ఆయన మరణం షాక్‌కు గురి చేసింది. ‘45 ఏళ్ల మా స్నేహ బందం ముగిసింది’ అంటూ భావోద్వేగంతో ఆయన ట్విట్టర్‌లో పోస్ట్‌ పెట్టారు. హర్యానాలో పుట్టిన సతీశ్‌ నాటకరంగంలో అనుభవం గడించి బాలీవుడ్‌లో నటుడిగా కెరీర్‌ ప్రారంభించారు. హాస్య పాత్రలు పోషించడంలో పేరొందారు. ‘రూప్‌ కీ రాణీ చోరోన్‌ కా రాజా’, ‘ప్రేమ్‌’, ‘తేరే నామ్‌’, ‘షాదీ సే పెహ్లే’ వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.ఆయన దర్శకత్వంలో రూపొందిన చివరి చిత్రం ‘కాగజ్‌’ (2021) ‘ఉత్సవ్‌’, ‘సాగర్‌’, ‘మిస్టర్‌ ఇండియా’, ‘రాజాజీ’, ‘బాఘీ 3’ తదితర సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. నాలుగు దశాబ్దాల సినీ జీవితంలో నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తన ప్రతిభను ప్రదర్శించారు. సల్మాన్‌ ఖాన్‌, గోవింద, అనిల్‌ కపూర్‌లతో ఆయన కలసి పని చేశారు. ప్రస్తుతం సతీశ్‌ ‘ఎమర్జెన్సీ’ , సల్మాన్‌ ఖాన్‌ ‘కిసీ కా భాయ్‌ కీ జాన్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు.

Updated Date - 2023-03-10T00:46:11+05:30 IST