ఆ నలుగురు హీరోలపై నిషేధం

ABN , First Publish Date - 2023-09-15T01:07:37+05:30 IST

కోలీవుడ్‌కు చెందిన నలుగురు హీరోలపై తమిళ సినీ నిర్మాతల మండలి నిషేధం విధించింది. ఈ రెడ్‌ కార్డు పడిన హీరోల్లో ధనుష్‌, శింబు, విశాల్‌, అధర్వ ఉన్నారు. ఈ నలుగురూ కొత్త చిత్రాల్లో నటించకుండా నిషేధం విధించారు...

ఆ నలుగురు హీరోలపై నిషేధం

కోలీవుడ్‌కు చెందిన నలుగురు హీరోలపై తమిళ సినీ నిర్మాతల మండలి నిషేధం విధించింది. ఈ రెడ్‌ కార్డు పడిన హీరోల్లో ధనుష్‌, శింబు, విశాల్‌, అధర్వ ఉన్నారు. ఈ నలుగురూ కొత్త చిత్రాల్లో నటించకుండా నిషేధం విధించారు. తమిళనాడు చలనచిత్ర నిర్మాతల మండలి సమావేశం బుధవారం జరిగింది. ఇందులో అనేక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా సినిమా షూటింగులకు కాల్షీట్లు ఇచ్చి ఆ తర్వాత నిర్మాతలను ఇబ్బందులకు గురిచేస్తున్న నలుగురు హీరోల పట్ల కఠిన నిర్ణయం తీసుకున్నారు. నిర్మాత తేనాండాల్‌ మురళి నిర్మించిన చిత్రం 80 శాతం మేరకు పూర్తికాగా, మిగిలిన చిత్రాన్ని పూర్తి చేసేందుకు హీరో ధనుష్‌ ఏమాత్రం సహకరించడం లేదని, ఈ కారణంగా తాను ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయినట్టు ఫిర్యాదు చేశారు. దీంతో ధనుష్‌కు రెడ్‌ కార్డు వేశారు. హీరో శింబుపై నిర్మాత మైఖేల్‌ రాయప్పన్‌, హీరో అధర్వపై నిర్మాత మదియళగన్‌ ఫిర్యాదు చేశారు. అదేవిధంగా హీరో విశాల్‌ తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో విశాల్‌పై కూడా నిర్మాతల మండలి ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆయనపై కూడా నిషేధం విధించింది. ప్రస్తుతం ఈ అంశం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై నడిగర్‌ సంఘం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. కాగా, ప్రస్తుతం నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శిగా విశాల్‌ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

ఆంధ్రజ్యోతి, చెన్నై

Updated Date - 2023-09-15T01:07:37+05:30 IST