Awards.. Joys.. Congratulations : అవార్డులు.. ఆనందాలు.. అభినందనలు
ABN , First Publish Date - 2023-08-26T05:25:41+05:30 IST
తెలుగు సినిమాకి మరో పండగ వచ్చింది. 69వ జాతీయ అవార్డుల ప్రకటనతో టాలీవుడ్‌లో సంబరాలు మిన్నంటాయి. ఏకంగా 11 అవార్డులు సాధించడంతో టాలీవుడ్ సత్తా మరోసారి దేశ వ్యాప్తంగా తెలిసొచ్చింది. అవార్డు విజేతల ఇంట్లో ఆనందాలు వెల్లువిరిశాయి...

తెలుగు సినిమాకి మరో పండగ వచ్చింది. 69వ జాతీయ అవార్డుల ప్రకటనతో టాలీవుడ్‌లో సంబరాలు మిన్నంటాయి. ఏకంగా 11 అవార్డులు సాధించడంతో టాలీవుడ్ సత్తా మరోసారి దేశ వ్యాప్తంగా తెలిసొచ్చింది. అవార్డు విజేతల ఇంట్లో ఆనందాలు వెల్లువిరిశాయి. అభినందనల వెల్లువలో అంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్ ఇంట్లో గురువారం రాత్రి నుంచే సంబరాలు మొదలైపోయాయి. శుక్రవారం ఆయన హాస్య నటుడు బ్రహ్మానందం ఇంటికి వెళ్లారు. మర్యాదపూర్వకంగా కలుసుకొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం బన్నీని అభినందించారు.
తెలుగు సినిమా రెపరెపలు
‘‘అల్లు అర్జున్ అవార్డు అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు కథానాయకుడిగా నిలవడం గర్వంగా ఉంద’’న్నారు దర్శకుడు త్రివిక్రమ్. ‘‘ఓ పాత్రకు ప్రాణం పోసే విషయంలో ఆయన చేసే కృషి, కనబరిచే శ్రద్దాశక్తులు ఎలాంటివో నాకు తెలుసు. భవిష్యత్తులో ఆయన మరిన్ని పురస్కారాలు అందుకొంటారన్న నమ్మకం ఉంద’’న్నారు త్రివిక్రమ్. జాతీయ అవార్డులతో తెలుగు సినిమా పతాకం దేశ వ్యాప్తంగా రెరపరెపలాడిందన్నారు. జాతీయ అవార్డులు సాధించిన కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్, కాలభైరవ, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్, శ్రీనివాస్ మోహన్, కింగ్ సోల్‌మన్‌లకు ఆయన అభినందనలు తెలిపారు. తెలుగు చిత్రసీమకు ఈ స్థాయిలో అవార్డులు రావడం గర్వకారణమని, ఈ పురస్కారాలతో టాలీవుడ్ ఖ్యాతి మరింత ఇనుమడించిందని తెలుగు ఫిల్మ్‌ఛాంబర్, నిర్మాతల మండలి ‘మా’ ఏపి వ్యవస్థాపకుడు దిలీప్ రాజా ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ అవార్డు ప్రేక్షకులదే: అభిషేక్ అగర్వాల్
‘‘కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి రెండు అవార్డులు గెలుచుకోవడం ఆనందంగా ఉంది. ఇది ప్రజల సినిమా. ఈ అవార్డు కూడా ప్రేక్షకులదదే’’ అన్నారు నిర్మాత అభిషేక్ అగర్వాల్. ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా ‘కశ్మీర్ ఫైల్స్’ చిత్రానికి పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. ఉత్తమ సహ నటిగా పల్లవి జోషి నిలిచారు. ఈ సందర్భంగా అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ ‘‘నిజాయతీతో తీసిన సినిమా ‘కశ్మీర్ ఫైల్స్’. బాక్సాఫీసు దగ్గర గొప్ప విజయాన్ని అందుకొంది. ఇప్పుడు అవార్డు రావడంతో మా సంస్థ గౌరవం మరింత పెరిగింది. ఈ అవార్డుని ప్రేక్షకులకు అంకితం ఇస్తున్నాం’’ అన్నారు.
రుణపడి ఉంటా: కాలభైరవ
‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో ‘కొమరం భీముడో’ పాటకు గానూ కాలభైరకు ఉత్తమ గాయకుడిగా పురస్కారం లభించింది. ఈ సందర్భంగా కాలభైరవ స్పందించారు. అవార్డుకి ఎంపిక చేసినందుకు జ్యూరీ సభ్యులతో పాటుగా గొప్ప సాహిత్యాన్ని అందించిన గీత రచయిత సుద్దాల అశోక్ తేజకు కృతజ్ఞతలు తెలియజేశారు. ‘‘ఈ పాట మెరవడానికి కారణమైన అందరికీ రుణపడి ఉంటా. ‘ఆర్.ఆర్.ఆర్’లాంటి ప్రాజెక్టులో భాగం కావడం గర్వంగా అనిపిస్తోంద’’న్నారు కాలభైరవ.
మాటల్లో చెప్పలేను: అలియా
ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం లభించడం పట్ల అలియా భట్ (గంగూభాయ్) సంతోషం వ్యక్తం చేశారు. తన ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాననీ, ఈ విజయం తన అభిమానులదే అని అన్నారామె. తనతో పాటు ఉత్తమ నటిగా ఎంపికైన కృతిసనన్‌కి అభినందనలు తెలిపారు. ‘‘మిమి చిత్రం చూడగానే కృతికి ఫోన్ చేశాను. ఎంతో శక్తిమంతమైన పాత్ర అది. అవార్డుకు కృతి అన్ని విధాలా అర్హురాలు’’ అన్నారు.