అందెల రవమిది పదములదా...!

ABN , First Publish Date - 2023-02-05T06:45:56+05:30 IST

ప్రతీ పరీక్షలోనూ వంద మార్కులు తెచ్చుకోవడం ఎంతటి అత్యుత్తమ విద్యార్థికైనా సాధ్యం కాకపోవొచ్చు. కానీ... ప్రతీ పాటకీ నూరు శాతం న్యాయం చేయడం, ఆ పాటని హృదయాంతరాల్లోంచి గానం చేయడం...

అందెల రవమిది పదములదా...!

ప్రతీ పరీక్షలోనూ వంద మార్కులు తెచ్చుకోవడం ఎంతటి అత్యుత్తమ విద్యార్థికైనా సాధ్యం కాకపోవొచ్చు. కానీ... ప్రతీ పాటకీ నూరు శాతం న్యాయం చేయడం, ఆ పాటని హృదయాంతరాల్లోంచి గానం చేయడం వాణీ జయరామ్‌కే చెల్లింది. లతా మంగేష్కర్‌, సుశీల, జానకీ ఉధృతంగా పాడేస్తున్న కాలంలోనూ ‘వాణీ’ నిలబడ్డారంటే, తన ప్రత్యేకత చాటుకొన్నారంటే, ‘ఈ పాటల్ని వాణీ జయరామ్‌ మాత్రమే పాడాలి’ అనిపించుకొన్నారంటే, కొన్ని పాటలు ఆమెను వెదుక్కొంటూ వచ్చాయంటే అది మామూలు విషయం కాదు. తమిళంతో పోల్చుకొంటే, తెలుగులో ఆమె తక్కువ పాటలే పాడారు. కానీ ప్రతీ పాటా ఆణిముత్యమే. ప్రతీ పాటలోనూ వాణీ ముద్ర ప్రస్పుటంగా కనిపిస్తూనే ఉంటుంది. విశ్వనాథన్‌, కె.వి. మహదేవన్‌, ఇళయరాజా, రాజన్‌ నాగేంద్ర... వీళ్లేం వాణీకి సులభమైన పాటల్ని ఇవ్వలేదు. ప్రతీ ట్యూనూ.. సవాల్‌ విసిరేదే. ‘అందెల రవమిది పదములదా..’ పాటలో ఇళయరాజా స్వర వేగానికి తగ్గట్టుగానే వాణీ గాత్రం పోటీ పడింది. వాణీ జయరామ్‌ని క్లాసికల్‌ సింగర్‌గా చూస్తారు కానీ.. తన గొంతులో రొమాన్స్‌ కూడా భలే పలికింది. ‘నువ్వడిగింది ఏనాడైనా కాదన్నాన’ పాటలో అంత చిలిపిదనం, కొంటెదనం.. వాణీ గొంతు వల్లే వచ్చాయి. అప్పుడేంటి.. ఇప్పుడు కూడా ఆ పాటకు ఫిదా అయిపోని బ్రహ్మచారి లేడు. ‘ఒక బృందావనం..’ తెరకెక్కించిన తీరులోనే కాదు.. ఆ పాటని పాడిన విధానంలోనూ శృంగారం పరవళ్లు తొక్కుతుంది. ‘కురిసేను విరిజల్లులే..’ పాటకు ఎండాకాలంలో కూడా కారు మబ్బులు కమ్ముకొంటాయి. ప్రేమ చినుకులు కురిపిస్తాయి. వాణీ గొంతులో విషాదం ఎంత గొప్పగా పలుకుతుందో చెప్పడానికి ‘జాలిగా జాబిలమ్మ..’ పాటకంటే గొప్ప ఉదాహరణ ఉండదేమో..? ‘తెలిమంచు కరిగింది తలుపు తీయవా ప్రభూ..’, ‘ఆనతి నీయరా హరా..’ ఇవి కేవలం వాణీ మాత్రమే పాడగలిగే పాటలు. ఈ పాటల్లో సాహిత్యం ఉధృతమైన గంగా ప్రవాహంలా ఉంటుంది. ఆ పదాలన్నీ... వాణి గొంతులోంచి కాకుండా గుండెల్లోంచి పుట్టుకొచ్చినట్టు అనిపిస్తాయి. అందుకే ఈ పాటలన్నీ క్లాసిక్స్‌ అయిపోయాయి. వాణీ పాడిన పాటలన్నీ మణులూ... మణిహారాల్లా మిగిలిపోయాయి.

టాప్‌ -10

పాట చిత్రం సంగీత దర్శకుడు

తెలిమంచు కరిగింది స్వాతి కిరణం కె. వి మహదేవన్‌

ఇన్నిరాశుల యునికి శ్రుతిలయలు కె. వి మహదేవన్‌

మానస సంచరరే శంకరాభరణం కె. వి మహదేవన్‌

ఆనతినీయరా హరా స్వాతికిరణం కె. వి మహదేవన్‌

విధి చేయు వింతలన్నీ మరో చరిత్ర ఎం. ఎస్‌ విశ్వనాథన్‌

పూజలు సేయ పూజ రాజన్‌-నాగేంద్ర

నువ్వడిగింది ఏనాడైనా వయసు పిలిచింది ఇళయరాజా

మిన్నేటి సూరీడు సీతాకోకచిలుక ఇళయరాజా

అందెల రవమిది స్వర్ణకమలం ఇళయరాజా

కన్నెవలపు కన్నెల పిలుపు గుప్పెడు మనసు ఎం. ఎస్‌ విశ్వనాథన్‌

‘వాణీ జయరామ్‌ మృతి సృజనాత్మక ప్రపంచానికి తీరని లోటు. మెలోడీ వాయి్‌సతో చిరకాలం గుర్తుండిపోతారు. పలు భాషల్లో నేపథ్యగానం చేసి, ఎన్నో రకాలైన ఎమోషన్స్‌ను చూపించారు. ఆమె మృతికి సంతాపం తెలుపుతూ, కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నాను. ఓం శాంతి’.

ప్రధాని మోదీ

‘పదాలకు ఉన్నత స్థితి కల్పించి అరుదైన బాణీల్లో ఎన్నో పాటలను ప్రపంచానికి కానుకగా సమర్పించిన గానకోకిలగా జీవించిన వాణి జయరాం అస్తమించారు. ఆమె పాటలు మనలో కలకాలం నిలిచివుంటాయి. ఆమెకు నా అంజలి’.

కమల్‌హాసన్‌

‘వాణీ జయరామ్‌ ఇకలేరని నేను ఎంతో ఆవేదనకు లోనయ్యాను. నాకు ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. ఈ పరిస్థితుల్లో ఆమె మరణవార్త విని ఎంతో దిగ్ర్భాంతికి గురయ్యాను’.

ఇళయరాజా

Updated Date - 2023-02-05T06:45:58+05:30 IST