అ అంటే అందం... ఆ అంటే ఆకర్షణ
ABN, First Publish Date - 2023-05-02T00:32:50+05:30
ఇదివరకు భారతీయ చిత్రసీమ అంటే... బాలీవుడ్డే. ముందు హిందీ సినిమా గురించి మాట్లాడుకొని, ఆ తరవాతే దక్షిణాది ప్రస్తావనకు వచ్చేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి.
హిందీ భామల తెలుగు పాఠాలు
ఇదివరకు భారతీయ చిత్రసీమ అంటే... బాలీవుడ్డే. ముందు హిందీ సినిమా గురించి మాట్లాడుకొని, ఆ తరవాతే దక్షిణాది ప్రస్తావనకు వచ్చేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇండియన్ సినిమాకి కేరాఫ్‌గా నిలిచింది తెలుగు పరిశ్రమ. టాలీవుడ్ నుంచి ఓ అవకాశం వస్తే, అది టాప్ స్టార్ సినిమాలో అయితే, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వస్తుందన్న నమ్మకం కలుగుతోంది. అందుకే తెలుగు సినిమాల్ని అస్సలు వదలడం లేదు. ముఖ్యంగా కథానాయికలు. మనవాళ్లు అడగడం ఆలస్యం. పారితోషికం ఎంత? క్యారెక్టర్ ఏమిటి? అనేవి కూడా ఆలోచించకుండా ‘ఎస్...’ చెప్పేస్తున్నారు. అంతేనా..? తెలుగు భాష నేర్చుకొని, సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడానికి సైతం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ‘అ అంటే అందం.. ఆ అంటే ఆకర్షణ..’ అంటూ కొత్త పాఠాలు నేర్చుకొంటున్నారు.
ఇప్పుడన్నీ పాన్ ఇండియా సినిమాలే. అందుకే బాలీవుడ్ భామలైతే అన్ని విధాలా బాగుంటుందని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు. అందుకే హిందీ చిత్రసీమ నుంచి కథానాయికలు టాలీవుడ్‌కి దిగుమతి అయిపోతున్నారు. ఇది వరకు కూడా.. చాలామంది బాలీవుడ్ భామలు తెలుగులో మెరిశారు. అయితే ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయారంతే. తెలుగులో స్థిరపడాలన్న ఆలోచన వాళ్లకు ఉండేది కాదు. డబ్బింగ్ సంగతి పక్కన పెట్టండి.. మైక్ ఇస్తే.. తెలుగులో ఒక్క ముక్క కూడా మాట్లాడేవాళ్లు కాదు. అంతెందుకు తెలుగులో ప్రచారం చేసుకోవడానికి కూడా అంతగా ఇష్టపడేవాళ్లు కాదు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెలుగు ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకోవాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. అందుకే.. తెలుగు నేర్చుకొని, తెలుగులో మాట్లాడి, తెలుగమ్మాయిలు అనిపించుకోవడానికి తహతహలాడుతున్నారు.
‘ప్రాజెక్ట్ కె’ కోసం ప్రభాస్‌తో కలిసి నటిస్తోంది దీపికా పదుకొణె. ఆమె నటిస్తున్న తొలి తెలుగు చిత్రమిదే. అందుకే ఈ సినిమాపై గట్టిగా ఫోకస్ పెట్టింది. దీపిక లాంటి కథానాయికలు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడానికే ఇష్టపడతారు. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ కోసం తమిళ యాస కాస్త నేర్చుకొంది. అది తనకు బాగా ప్లస్ అయ్యింది. ఇప్పుడు ‘ప్రాజెక్ట్ కె’ కోసం కూడా అదే పనిలో ఉందట. ఈ సినిమా విడుదల కావడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఈలోగా తెలుగు నేర్చుకొని, వీలైతే తన డబ్బింగ్ తానే చెప్పుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తోంది దీపికా. కృతి సనన్ కూడా అదే బాటలో పయనిస్తోంది. తెలుగులో ఇప్పటికే కొన్ని సినిమాలు చేసింది కృతి. అయితే.. తెలుగు మాత్రం అస్సలు నేర్చుకోలేదు. ఇప్పటి వరకూ డబ్బింగ్‌పైనే ఆధారపడింది. అయితే.. ‘ఆదిపురుష్’లో సీత పాత్ర కోసం తెలుగు నేర్చుకొంది. ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పినా, చెప్పకపోయినా... డైలాగుల్లో స్పష్టత కోసం, సన్నివేశాన్ని అర్థం చేసుకోవడం కోసం తెలుగు పాఠాలు నేర్చుకోవడం ఆమెకు తప్పనిసరి అయ్యింది. పైగా ‘ఆదిపురుష్’ తరవాత తెలుగులో తనకు మరిన్ని అవకాశాలు వస్తాయని నమ్ముతోంది కృతి. అందుకే.. తెలుగుపై దృష్టి సారించింది.
శ్రీదేవి కూతురుగా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది జాన్వీ కపూర్. ఎన్టీఆర్‌తో జోడీ కడుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవలే పట్టాలెక్కింది. జాన్వీకి తెలుగు రాదు. అయితే.. ఈ సినిమా కోసం ఆమె తెలుగు పాఠాలు నేర్చుకొంటోంది. సంభాషణలు అర్థం చేసుకోవడానికీ, కెమెరా ముందు మళ్లీ పలకడానికీ.. చాలా కసరత్తులు చేస్తోందట. అందుకోసం ప్రత్యేకంగా ఓ తెలుగు ట్యూటర్‌ని కూడా నియమించుకొందని సమాచారం. అలియాభట్ ఇప్పటికే ‘ఆర్.ఆర్.ఆర్’తో మెప్పించింది. ‘ఆర్.ఆర్.ఆర్’ తరవాత.. తెలుగులో నటించడానికి మరింత ఉత్సాహం చూపిస్తోంది. తనకు కూడా తెలుగు కొంచెం కూడా అర్థం కాదు. ‘‘ఆర్.ఆర్.ఆర్ సమయంలో.. తెలుగు నాకు అస్సలు రాదు. ఇంగ్లీష్‌లో డైలాగులు రాసుకొని, బట్టీ పట్టి మాట్లాడేదాన్ని. ఈసారి తెలుగులో నటిస్తే.. తప్పకుండా తెలుగు నేర్చుకొనే సెట్లోకి అడుగుపెడతా’’ అంటోంది అలియా. ఇటీవల తెలుగు నుంచి అలియాకు ఓ బంపర్ ఆఫర్ వచ్చిందని, ఆమె త్వరలోనే మరో తెలుగు సినిమా చేసే అవకాశం ఉందని ఇన్‌సైడ్ వర్గాలు చెబుతున్నాయి. సో... అలియా నోటి నుంచి కూడా తెలుగు పలుకులు వినొచ్చన్నమాట.